4 Hours: సవాల్‌గా మారిన ఆ నాలుగు గంటలు.. కరోనా అడ్డాలు ఇవే..!
దిశ, తెలంగాణ బ్యూరో : లాక్‌డౌన్ సమయంలో పరిస్థితి ఎలా ఉన్నా సడలింపు ఉన్న నాలుగు గంటల సమయమే ఇప్పుడు ప్రభుత్వానికి సవాలుగా మారింది. ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి ఉ 10 గంటల వరకు లాక్‌డౌన్‌కు సడలింపు ఇవ్వడంతో పాలు, కూరగాయలు, నిత్యావసరాల కోసం జనం రోడ్డెక్కుతున్నారు. ఒక్కసారిగా రద్దీ పెరిగిపోతుండడంతో కంట్రోల్ చేయడం పోలీసులకు సాధ్యం కావడంలేదు. ఆ సమయంలో పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. 20 గంటల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా […]
దిశ, తెలంగాణ బ్యూరో : లాక్‌డౌన్ సమయంలో పరిస్థితి ఎలా ఉన్నా సడలింపు ఉన్న నాలుగు గంటల సమయమే ఇప్పుడు ప్రభుత్వానికి సవాలుగా మారింది. ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి ఉ 10 గంటల వరకు లాక్‌డౌన్‌కు సడలింపు ఇవ్వడంతో పాలు, కూరగాయలు, నిత్యావసరాల కోసం జనం రోడ్డెక్కుతున్నారు. ఒక్కసారిగా రద్దీ పెరిగిపోతుండడంతో కంట్రోల్ చేయడం పోలీసులకు సాధ్యం కావడంలేదు. ఆ సమయంలో పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. 20 గంటల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా పాటించి వైరస్ వ్యాప్తికి బ్రేకులు వేసినా సడలింపు సమయంలో నాలుగు గంటల విచ్చలవిడి కదలికలు స్ఫూర్తికి విఘాతంగా మారాయి. లాక్‌డౌన్ టైమ్‌లో రోడ్లమీదకు వస్తున్న వాహనాలను అదుపు చేయగలుగుతున్న పోలీసులకు రైతుబజార్లు, మార్కెట్లు, మాల్స్ లాంటి ప్రాంతాల్లో మాత్రం రద్దీని నివారించడం సాధ్యం కావడంలేదు. ఏ ఉద్దేశంతో లాక్‌డౌన్ విధించారో నాలుగు గంటల సడలింపు ఆ లక్ష్యానికి సంకటంగా మారింది.
ప్రతీ రోజు ఉదయం సమయంలో ఆ నాలుగు గంటల పాటు రద్దీ యథావిధిగా కొనసాగుతూ ఉంది. ఆదివారం ఉదయం రాంనగర్ చేపలమార్కెట్, భరత్‌నగర్, యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్ తదితర మార్కెట్లతో పాటు నగరంలోని దాదాపు అన్ని రైతుబజార్లలో ఇసుక వేస్తే రాలనంత స్థాయిలో రద్దీ నెలకొన్నది. చేపలు, చికెన్, మటన్ దుకాణాల దగ్గర రద్దీ ఒకింత ఎక్కువగా ఉంది. సెకండ్ వేవ్‌లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా, వేగంగా ఉందని, గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని వైద్యులు, ప్రభుత్వం మొత్తుకున్నా ప్రజలు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. సోషల్ డిస్టెన్స్ అనేది పూర్తిగా అటకెక్కింది. స్వీయ నియంత్రణ పాటించాల్సిన ప్రజలు నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు.
కరోనా కేంద్రాలుగా మార్కెట్లు
కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కడెక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ప్రభుత్వం అంచనా వేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే తొలుత వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించిన కేటగిరీల్లో వీధి వ్యాపారులు, దుకాణాల్లో పనిచేసేవారు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, హోటళ్ళలో పనిచేసేవారు.. ఇలా వివిధ పనుల్లో నిమగ్నమయ్యేవారిని గుర్తించింది. వారి ద్వారా వైరస్ ఇతరులకు వేగంగా వ్యాపిస్తుందని, ఆ పనుల స్వభావమే అలా ఉంటుందని పేర్కొన్నది. అందువల్లనే 18-44 ఏజ్ గ్రూపువారికి వ్యాక్సిన్ ఇవ్వడం మొదలైన తర్వాత ప్రాధాన్యతా క్రమంలో తొలుత వీరికి ఇవ్వాలని ప్రణాళిక రూపొందించింది. కానీ లాక్‌డౌన్ సడలింపు సమయంలో ఇప్పుడు వ్యక్తులు, ఆ ప్రాంతాలే వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారాయి.
లాక్‌డౌన్‌లో ప్రధాన రోడ్లు నిర్మానుష్యం
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు ఆదివారం రోడ్లపై వాహనాలను దాదాపు పూర్తిగా నియంత్రించారు. శనివారం కనిపించిన రద్దీ ఆదివారం కనిపించలేదు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ-పాసులు, అనుమతి పత్రాలు లేకుండా రోడ్లమీదకు వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. రాచకొండ పరిధిలో తాజా లాక్‌డౌన్ కాలంలో సుమారు 35 వేల వాహనాలను సీజ్ చేసినట్లు కమిషనర్ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు పెట్టలేదు. చాలా మంది యువకులు శనివారం జరిగిన పోలీసు లాఠీఛార్జిని దృష్టిలో పెట్టుకుని ఆదివారం రోడ్డుమీదకు రాకుండా జాగ్రత్త పడ్డారు.
బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో లాకప్
లాక్‌డౌన్ సమయంలో తగిన అనుమతి పత్రాలు, ఈ-పాస్‌లు లేకుండా రోడ్లమీదకు వచ్చినవారిని చెక్‌పోస్టుల దగ్గర నిలిపివేసిన పోలీసులు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూలు ఆవరణలోకి పంపి బైట నుంచి గేట్లకు గడి పెట్టారు. వారందరినీ ఓపెన్ లాకప్‌గా బంధించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎపిడమిక్ యాక్టు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. వారి వాహనాలను సీజ్ చేశారు. అత్యవర పనుల మీద వచ్చినట్లు తగిన పత్రాలను, ఆధారాలను, మెసేజ్‌లను చూపినవారిని ఆ అవసరాల మీద వెళ్ళడానికి అనుమతించారు.