Finance Ministry: మూడేళ్లలో 3 రెట్లు పెరిగిన నకిలీ పెద్ద కరెన్సీ నోట్లు
2020-21 నుంచి రూ. 2,000 విలువైన నకిలీ నోట్లు మూడు రెట్లు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేసింది. అయితే, తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2018-19 నుంచి 2023-24 మధ్య కాలంలో రూ. 500 విలువైన నకిలీ నోట్లు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. అలాగే, 2020-21 నుంచి ఇప్పటివరకు రూ. 2,000 విలువైన నకిలీ నోట్లు మూడు రెట్లు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించింది. నకిలీ కరెన్సీ పెరుగుతుండటం ఆందోళనకరంగా ఉంది. ప్రధానంగా నకిలీ కరెన్సీలకు రూ. 500 నోట్లు కీలకంగా ఉన్నాయని, వాటి చలామణి అత్యంత వేగంగా పెరుగుతోందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 2018-19లో 2.1 కోట్ల నకిలీ కరెన్సీ నోట్ల నుంచి 2022-23లో 9.1 కోట్ల నకిలీ కరెన్సీని గుర్తించినట్టు డేటా స్పష్టం చేస్తోంది. 2023-24లో ఇది స్వల్పంగా తగ్గి 8.5 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో రూ. 2000 విలువైన నోట్ల సంఖ్య మూడు రెట్లు పెరిగాయి. 2018-19లో 8,798 నుంచి 2023-24లో 26,035కి పెరిగాయి.