వారం వారం మంచి పద్యం: నయము

POEM

Update: 2023-07-23 19:00 GMT

బుంగి ఎప్పుడేం చేసేది తెలియదు. కష్టజీవి కనుక అందరివాడయ్యాడు. ఎవరినైనా ఒప్పించగలడు. అలాగే కాదనగలడు. నమ్మకం కలిగిస్తూ, అపనమ్మకాన్ని అందించగలడు. రెండు నాలుకల పాము అందామా! నిరూపించలేము. చీకటి పని పగటి పూట, పగటి పని చీకటి పూట చేయగల సమర్ధుడు. వాదనలో ఓడించలేము, ఆతని ఆకర్షణను అడ్డుకోలేము. ఎవరికి ఏ రీతిన అర్థమవాలో అలాగే కాగలడు. ఎవరికీ, ఎట్లా, ఎప్పుడు ఆసనం వేయాలో, లాగాలో తెలిసిన నేర్పరి. సిద్ధాంతాన్ని, రాద్దాంతంగాను, రాద్దాంతాన్ని సిద్దాంతంగాను చెప్పగల తీర్పరి. ఆటల్లో తొండిని, చెరువుకు గండిని వేయగల ఘటికుడు. ఘటనా ఘటన సమర్థుడు. ప్రస్తుతం అతడు టాపిక్ అయ్యాడు. అతనికి ఏదో ఒక పదవి ఇవ్వాలి అన్నాను.‘అతడేమిటి’ అన్నారు. అతడే షడ్రుచులు ఏడు రంగులు అతనివే. రుచుల్ని చవి చూపగలడు. రంగులు మార్చగలడు. ‘అలాంటి వాడికి పదవి ఇస్తే సిద్ధాంతం నవ్వుల పాలు కాదా’ ‘ఇవ్వకుంటే సిద్ధాంతం నేలపాలు కాదా’. ‘అయినా సరే, గంగిపోవు పాలు గరితెడెత్తను చాలు’ ‘నేడు గంగ నీరంతా మురికి పాలు’ ఇప్పుడేమిటి దిక్కు. ‘అతడే నయము, మనలో కలుపుకోవాలి. బలంగా తయారవాలి’. ‘ఫలితం భవిష్యత్తు అనుభవిస్తది’. భవితను అంచనా వేయలేము. అంటూ లేచాను వెనక నుండి ఇదేదో పుట్టిముంచే వ్యవహారంలా ఉంది అనడం వినిపించింది.

పదవి, మాటలు రెండును పరువు నిల్పు

జారినను పోవు రయమున జరుగుబాటు

నగుదురను భావమున్నను నయము జరుగు

కశప చెప్పిన కధనమ్ము కాంతి బాట

డా. బి.వి.ఎన్ స్వామి

92478 17732

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం