జీవించే ప్రతి క్షణాన్నీ ఆస్వాదిద్దాం..

ICHIGO ICHIE Book Review

Update: 2024-11-04 00:45 GMT

మనదేశం నుంచి తరలిపోయిన జ్ఞానసంపదలో బౌద్ధ జీవన విధానం అతి ముఖ్యమైనది. ఇది చైనా జపాన్ వంటి దేశాలకు చేరి, కాలానుగుణంగా మార్పులు చెంది, మానవ జీవన విధానాన్ని ప్రభావితం చేసే నూతన తాత్విక సిద్ధాంతాలతో ప్రాచీన బౌద్ధం మళ్లీ మనల్ని చేరింది. అందులో భాగమే ' ఇచిగో ఇచి ' జీవన విధానం. ఈ క్షణంలో జీవించడం, వర్తమానంలో ఆనందంగా గడపడం ' ఇచిగో ఇచి ' సారాంశం. ఇది, చదవదగిన మంచి పుస్తకం. ప్రాచీన జపనీస్ జీవన విధానాన్ని నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ పుస్తకంలో రచయితలు ప్రతిపాదించిన నూతన మార్గాలు ఆచరించదగినవి.

వర్తమానంలోనే జీవించండి అంటూ..

"సంతోషం మీకు సహజమైనది, దానిని ఆశించడం తప్పు కాదు, దాన్ని వెలుపల వెతకడం తప్పు, అది మీ లోపలే ఉంది" అంటారు రమణ మహర్షి. సంతోషం మనలోనే ఉంటే ఎక్కడెక్కడో వెతకడం దేనికి? వ్యక్తిగతమైన మార్పు ద్వారా నిత్య సంతోషాన్ని వెలికితీయవచ్చు కదా! ఎవరినో మార్చాలనుకోవడం కన్నా ముందు మనల్ని మనం మార్చుకోవడం ముఖ్యం. దృష్టికోణం మార్చుకుంటే అంతా సవ్యంగా కనిపిస్తుంది. సంతోషంగా జీవించడం అంటే ఇప్పుడు ఈ క్షణంలో జీవించటం అనేది సుస్పష్టం. "నిన్నటి రోజు ఒక కల మాత్రమే / రేపు అనేది కేవలం ఒక కల్పన / కానీ ఈ రోజు చక్కగా జీవిస్తే / ప్రతి నిన్నటి రోజూ /ఎప్పుడూ ఒక సంతోషకరమైన కలే అవుతుంది" అని ఎన్నో ఏళ్ల క్రితమే కవికుల గురువు, సంస్కృత పండితుడు కాళిదాసు చెప్పారు. 'ఇచిగో ఇచి' పుస్తకం కూడా ఇదే చెబుతుంది. వర్తమానంలో జీవించమని.

అత్యున్నత జీవన విధానం..

'ఇచిగో ఇచి' అనేది జపనీస్ పదం. అంటే, "ఇప్పుడు మనం అనుభవిస్తున్నది మళ్లీ తిరిగి జరగదు. అందుచేత మనం ప్రతిక్షణానికి అందమైన నిధికి ఇచ్చిన విలువ ఇవ్వాలి " అని తెలుగు అర్థం. ఇది ఒక అత్యున్నత జీవన విధానం. భారతీయ, పాశ్చాత్య తాత్విక బోధనల సారాంశం కూడా ఇదే. ఈ ప్రాచీన జీవన విధానాన్ని 'ఇచిగో ఇచి' పుస్తక రచయితలు హెక్టార్ గ్రేషియా, ఫ్రాన్సిస్ మిరల్లెస్‍‌లు చాలా సులభంగా, అర్థవంతంగా, ఉదాహరణల రూపంలో, పాఠకులు తమ జీవితంలో ఆచరించదగినవిగా రచించారు. దీనిని వి.వి. సత్యవతి గారు తెలుగు అనువాదం 190 పేజీలలో ఉండే విధంగా, మన చేతి సంచిలో ఇమిడిపోయే అందమైన పుస్తకంగా రూపొందించారు. ఈ పుస్తకంలోని మూడు అధ్యాయాల్లో ప్రధాన భావమైన ఇచిగో ఇచి సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతో కలిసి జీవించడం, ఆనందమయ జీవన విధానానికి బాటలు ఎలా వేసుకోవాలో రచయితలు చాలా సులభమైన మార్గాలను సూచిస్తారు.

సంతృప్తికి పరిమితులు లేవా?

సంతోష రాహిత్యానికి కారణం కోరికని బుద్ధుడు గుర్తించారు. ఆనందమయ జీవితానికి కోరికను అదుపులో పెట్టుకోవడం, కోరికను జయించడం ముఖ్యమని బౌద్ధం చెబుతుంది. ఇదే విషయాన్ని ఇచిగో ఇచి గ్రంథంలో "ఒకసారి మన కోరిక తీరిన తర్వాత మళ్లీ అసంతృప్తి ఆరంభమవుతుంది. ఎందుకంటే మనకు సర్వసాధారణంగా ఆ మెట్టు తర్వాత ఉన్నదేదో కావాలి. ఇది ఒక ప్రక్రియ. కానీ ఇచిగో ఇచి జీవన విధానాన్ని అనుసరిస్తే కోరికను జయించి మళ్లీ మన సంతృప్తి స్థాయి అట్టడుగుకు చేరుకుంటుందని రచయితలు చెబుతారు. ఇటువంటి ఉదాహరణలతో జీవన నైపుణ్యాల గురించి ఈ పుస్తకం చర్చిస్తుంది. దుఃఖం, విషాదం, విధి వంటి భావనలతో పాటు వినడం, చూడడం, స్పందించటం, ఆస్వాదించటం, కలిసి జీవించటం వంటి జీవన విధానాల గురించి ఆచరించదగిన సులువైన మార్గాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.

ఈ క్షణాన్ని ఆనందమయం చేసుకోండి

"ఇచిగో ఇచి గురించిన జ్ఞానం మన ఊహాజనిత ప్రపంచం నుండి బయటపడేసి, ప్రతీ ఉదయం ఈ ప్రపంచంతో గడుపుతున్నప్పుడు, మన పిల్లలతో గడుపుతున్నప్పుడు, మనం ప్రేమించే వారితో గడుపుతున్నప్పుడు, ఆ క్షణం చాలా విలువైనదని గుర్తు చేస్తుంది. ఇదే అత్యంత ఆవశ్యకమైనది. ఎందుకంటే మనకు మన జీవితం ఎప్పుడు అంతమవుతుందో తెలియదు కనుక.." అంటారు రచయితలు. గతాన్ని తలుచుకుని విచారించడం భవిష్యత్తుపై బెంగ పెట్టుకోవడం కన్నా లభించిన ఈ క్షణాన్ని ఆనందమయం చేసుకోమని ఇచిగో ఇచి గ్రంథం చెబుతుంది. దీర్ఘకాలిక అర్థవంతమైన జీవితం గడుపుతున్నారంటే వారికి సాధారణంగా రెండు లక్షణాలు ఉంటాయి. వారి ధర్మం వారికి తెలుసు. ప్రతిక్షణం ఎలా ఆనందించాలో వారికి తెలుసు. వారికి వర్తమానంలోని ఈ క్షణం ఇచిగో ఇచి అనుభవించేటందుకు ఒక శాశ్వత అవకాశం అంటారు హెక్టార్ గ్రేషియా, ఫ్రాన్సిస్ మిరల్లెస్‌లు.

పుస్తకం పేరు : ఇచిగో ఇచి

రచయితలు : హెక్టార్ గ్రేషియా, ఫ్రాన్సిస్ మిరల్లెస్

తెలుగు అనువాదం : వి.వి. సత్యవతి

పేజీలు : 190

వెల : 350

ప్రతులకు : ఆన్‌లైన్ స్టోర్స్‌లో లభ్యం


సమీక్షకులు

శిఖా సునీల్ కుమార్

99081 93534

Tags:    

Similar News