సంధికాలపు వ్యవస్థకు దారిచూపిన పుస్తకం
ప్రపంచ ప్రసిద్ధ నవలల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ఇడియట్’ నవల తొలి తెలుగు అనువాదం త్వరలో మన చేతుల్లోకి రానుంది. ఎంత ప్రఖ్యాతి గడించిందో
ప్రపంచ ప్రసిద్ధ నవలల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ఇడియట్’ నవల తొలి తెలుగు అనువాదం త్వరలో మన చేతుల్లోకి రానుంది. ఎంత ప్రఖ్యాతి గడించిందో అంత వివాదాస్పదం, విమర్శనాత్మకం అయిన ఈ నవలలో చిత్రించినది దోస్తోవిస్కీ జీవితమేనని చెబుతారు. ఈ నవల అనువాదకుడు వై. వేణుగోపాల్ రెడ్డికి ఇది తొలి అనువాదం, పైగా ఎన్నుకున్న నవలేమో అనువాదానికి సులభంగా లొంగనిది. సంక్లిష్టత, శిల్ప విలక్షణత వున్న యీ నవలలో రచయిత ఆత్మను పట్టుకోవడం చాలా కష్టం. సాధికారికంగా రష్యన్ భాష వస్తే తప్ప మూల రచయిత ఉద్దేశ్యం ఏదో అర్థం కాని స్థితి. అయినా ఆంగ్ల సాహిత్యంతో విస్తృత పరిచయం ఉన్న వేణు చక్కగా అనువాదం చేసాడు. తనకు అభినందనలు.
దొస్టోవిస్కీ సాహిత్య రంగంలో చెహోవ్, హెమింగ్వే, కాఫ్కాలను, తాత్విక రంగంలో నీషే, సార్త్ర్ లను, వైద్య, మనస్తత్వ శాస్త్ర రంగంలో సిగ్మన్డ్ ఫ్రాయిడ్‌ను ప్రభావితం చేశాడు. యీ మహా రచయిత తన రచనల్లో వాస్తవికవాదంతో మొదలై క్రమంగా అస్తిత్వవాదానికి పునాదులు వేశాడు. సమాజం, మతం, రాజకీయాలు, నీతి వంటి విషయాలపై విస్తృతంగా వ్యాసాలు రాశాడు. అందువల్ల ప్రపంచం అతణ్ణి కేవలం రచయితగానే కాక తత్వవేత్తగా కూడా గౌరవించింది. స్థూలంగా బలహీనుల పక్షానే నిలబడ్డాడు. బలహీనుల పట్ల బుద్ధిజీవులకు ఉండవలసిన సానుభూతి, ప్రేమ, మనుషుల హక్కుల పట్ల ప్రభుత్వాలకు ఉండవలసిన బాధ్యతను రచనల్లో ప్రకటించాడు. 1840ల చివరలో రష్యాలో తిరుగుబాటు బృందంలో చేరి సాహిత్య చర్చల్లో ఉన్న రచయితకు తదితరులకు జార్ చక్రవర్తి మరణశిక్ష విధించి, తర్వాత అంతర్జాతీయ ఒత్తిడికి లోనై అందరికీ యావజ్జీవ శిక్ష విధిస్తాడు. శిక్షకు భయపడి సైబీరియా జైలులో ఆత్మహత్యకు ప్రయత్నించిన తన మిత్రులను ఓదార్చి, స్వాంత పరిచాడు దొస్టోవిస్కీ. ఈ ప్రేమ, కారుణ్య లక్షణాలు నవలలోని మిష్కిన్ పాత్రలోనూ మనకు కనిపిస్తాయి.
మరణ శిక్ష అనాగరిక చర్చ
ఈ ఘటనను భిన్న కోణాల్లో ఇడియట్ నవలలో మూడు నాలుగు చోట్ల ఇలా వర్ణించాడు. “ఒక వ్యక్తికి మరణశిక్ష వేసి చంపడం అతడు చేసిన నేరం కన్నా ఘోరమైన పాపం. న్యాయస్థానాలు మరణశిక్ష విధించడం నిందితుడు చేసిన హత్యకన్నా ఘోరమైనది. ఒక సైనికుడిని యుద్ధంలో ఫిరంగితో కాల్చు ఎక్కడో అక్కడ అతనికి బతికే ఆశవుంటుంది. కానీ అదే సైనికుడికి మరణశిక్ష వేసిన తీర్పు చదివి వినిపించు పిచ్చోడవుతాడు లేదా ఏడుస్తాడు. అటువంటి భయానక సంఘటనను తట్టుకొని పిచ్చివాడు కాని మానవుడు ఎవరైనా వుంటారా”. “పన్నెండు సంవత్సరాలు జైలులో గడిపిన ఒకరి గురించి విన్నాను. వ్యాకులతతో కొన్నిసార్లు బిగ్గరగా ఏడ్చేవాడు. ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకున్నాడు. జైలులో అతనికి ఉన్న ఒకే ఒక్క పరిచయం ఒక సాలెపురుగు. కిటికీ కింద పెరిగిన ఒక మొక్క మాత్రమే.”
జైళ్లు ఎప్పటికీ నరకకూపాలేనా?
సైబీరియాలో నాలుగేళ్ల జైలు జీవితం “ఎండాకాలం భరించలేని ఉడక, శీతాకాలం రక్తం గడ్డకట్టేంత చలి. జైలు గదుల లోపల ఇంచి మందాన పేరుకుపోయిన మడ్డి… ఎప్పుడైనా జారి పడవచ్చు. పక్కకు తిరగాలంటే జాగాలేనంత క్రిక్కిరిసి, పొద్దున నుంచి రాత్రి దాకా పందులవలె బతుకు. 200 మందికి ఒకే మరుగుదొడ్డి. రాత్రిళ్లు శరీరం పొగలు కమ్మేది లేదా శీతలం ముంచుకొచ్చేది. ఎంత అనారోగ్యంతో వున్నా ఆసుపత్రికి అనుమతి వుండదు. చదవడానికి పుస్తకాలు, న్యూస్ పేపర్లు ఇచ్చేవారు కాదు. రాయడానికి తెల్ల కాగితాలు ఇవ్వరు. ” ఆ దుర్భరత వింటే నూటా యాభై ఏళ్ళ తరువాత కూడా మనదేశంలో అటువంటి పరిస్థితులే వుండటం విషాదమనిపిస్తుంది. స్టాన్ స్వామి, జి ఎన్ సాయిబాబా వరవరరావు, రోనా విల్సన్ వంటి వారి జైలు జీవితాన్ని గుర్తుకు తెస్తుంది.
మేధో వారసత్వం లేకపోతే....
ఇడియట్‌లో 19 శతాబ్దపు రష్యన్ ‘సంపూర్ణ సౌందర్యాత్మక మానవుణ్ణి’ చిత్రించాల నుకున్నాడంటారు అది నిజమైతే అందులో విజయం సాధించాడా? కూలిపోతున్న ఒక సంధికాలపు వ్యవస్థ అంచున నిలబడి ముందుకు వెళ్ళవలసిన దారియేదో, మతాన్ని మానవతగా ఎలా అర్థం చేసుకోవాలో, మనిషిగా నిలబడడానికి ఎంచుకోవలసిన దారియేదో నిర్భీతితో చూపిన దొస్టోవిస్కీ, టాల్ స్టాయ్ వంటి సాహిత్యకారుల అవసరం మనకు ఇప్పుడు చాలా ఉంది. తమ కాలం నాటి ఉద్యమకారులతో ఎన్ని భేదాభిప్రాయాలు వున్నా తమ దేశంకోసం, దేశ ఔన్నత్యం కోసం నిరంతరం రాసిన, హక్కుల గురించి, మానవతా విలువల గురించి మాట్లాడిన సార్త్ర్, ఐన్ స్టీన్ ల వంటి మేధోవారసత్వం మనకు లేదేందుకు? తార్కుండే, మనోరంజన్ మొహంతి, బాలగోపాల్, బి.డి.శర్మ, ఎస్ ఆర్ శంకరన్, కన్నబీరన్, గౌరీలంకేష్, గిరీష్ కర్నాడ్, బొజ్జా తారకం వంటివారితోనే అది అంతరించిందా?
కల్లోల దిశపైపు సమాజం
దొస్టోవిస్కీ చిత్రించిన 19 శతాబ్దపు రష్యన్ సమాజంలాగే ఇప్పటి మన సమాజమూ ఒక కల్లోల దశలో వుంది. కనీసపు నిరసనను కూడా సహించలేని జార్ కంటే క్రూరమైన ప్రభువుల పాలనలో నలుగుతున్నాం. రాజకీయ ప్రశ్నలు నేరంగా చూపబడుతున్నాయి. మరణశిక్షలు, అంతకు భయంకరమైన అండాసెల్ ఖైదులు అమలు అవుతూనే వున్నాయి. మదమెక్కిన మత ఛాందసం రాజ్యాంగ రూపం తీసుకుంటున్నది. రాజ్యాంగ, న్యాయ, శాసన వ్యవస్థలు అన్నీ పెట్టుబడి ముందు సాగిల పడ్డాయి. అడవులు, అడవుల్లోని సంపద పెట్టుబడిదార్ల అంగడికి తరలించడానికి దారులు సిద్ధమవుతున్నాయి. క్రూర చట్టాల, బుల్డోజర్, డ్రోన్ల దాడులతో హక్కులు లుప్తమయ్యాయి. ఎల్లెడలా భయంకర నిశ్శబ్దం. అక్కడక్కడా కొన్ని నిరసన గొంతులు… వినిపించిన వెంటనే హత్య చేయబడుతున్నాయి. వాట్సాప్ వదంతులు,అబద్ధాలు, అర్ధసత్యాలే దేశచరిత్రగా కీర్తించ బడుతున్నాయి. ఇంత జరుగుతున్నా నా దేశ మేధావులు, రచయితలు ఎందుకు మౌనంగా వుంటున్నారు? వివేచించుకుని కదిలే సమయం ఎప్పుడొస్తుంది?
ఇంత అద్భుతమైన నవల ఇన్నేళ్లూ తెలుగులో రాక పోవడం విచారకరం, ఇప్పటికైనా వెలుగు చూస్తున్నందుకు సంతోషంగా ఉంది ఈ మానవ మనస్తత్వ ఘర్షణామయ వేదనా ప్రపంచంలోకి మిమ్మల్నీ ఆహ్వానిస్తున్నా, పుస్తకం అంతా చదివి మూసేసిన తర్వాత దాని ప్రభావం మీ మీద తప్పక ఉంటుంది. దోస్తోవిస్కీ రాసిన క్లాసిక్ నవల 'ఇడియట్' పుస్తక ఆవిష్కరణ డిసెంబర్ 18న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో సాయంత్రం 6 గంటలకు మాజీ భారత రష్యా రాయబారి దాట్ల బాల వెంకటేష్ వర్మ చేతుల మీదుగా ఆవిష్కరింపబడుతుంది.
(దొస్టోవిస్కీ నవల 'ఇడియట్' ముందుమాట లోంచి)
శ్రీనివాసమూర్తి
74999 85329