విమాన రెక్కలకు వేలాడే వయసు..

ఆమె పేరు కవిత. ఇంటి పేరు కుందుర్తి. ఇక ఆమె అక్షరాలను విశ్లేషించగల సాహసం ఎవరికుంటుంది? కవిత్వం రక్తనిష్టం అయినప్పుడు రసహృదయం

Update: 2024-12-15 23:30 GMT

ఆమె పేరు కవిత. ఇంటి పేరు కుందుర్తి. ఇక ఆమె అక్షరాలను విశ్లేషించగల సాహసం ఎవరికుంటుంది? కవిత్వం రక్తనిష్టం అయినప్పుడు రసహృదయం ద్రవించకుండా ఎలా వుంటుంది? ముంబై బ్లడ్ గ్రూప్‌లా ఒక ప్రత్యేకమైన పోయెటిక్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు పదచిత్రాలు పంజా విసరకుండా ఎలా ఉంటాయి? హృదయం కవిత్వంతో పొంగులు వారుతున్నప్పుడు అది అక్షరాలను పెనవేసుకోకుండా ఎలా వుంటుంది? ఈ పొత్తాన్ని విప్పితే గుప్పున పురిటి వాసన కొడ్తుంది. లేత గులాబీ చేతుల్లాంటి పసికందులా విడీవిడవని పదాలు మురిపిస్తాయి. మరికొన్ని ఊహలు బోసినవ్వుల్లా ముప్పిరిగొంటాయి. కన్నులు విచ్చుకోని పసితనపు పరవశంలా వాక్యాలు అల్లరి చేస్తాయి. వెరసి కవితలన్నీ పచ్చిపురటాలి వివశత్వంలా సుతిమెత్తగా గారాలు పోతాయి.

‘జస్ట్ ఎ హౌజ్ వైఫ్’ అని పేరేగాని, తను అది మాత్రమే కాదని ప్రతి అక్షరంలో చెప్పకనే చెప్పింది కుందుర్తి కవిత. కూతురిగా, తల్లిగా, ఇల్లాలిగా తన బహుముఖ రూపాల్లోని వెలుగు నీడల జంఝాటాన్ని గరళకంఠుడిలా గుప్పిట పట్టిన గుట్టున విప్పే ప్రయత్నం చేసింది. ఈ కవితలన్నీ వైయక్తిక ఆలాపనలు కాదు, సహానుభూతి స్పందనలను సామాన్య పాఠకుడు గ్రహించలేనంత గాఢంగా అక్షరాల్ని పెనవేసింది.

తొంభయ్యో దశకంలో స్త్రీవాద కవిత్వం ఫెళఫెళార్భాటాలతో విరుచుకుపడినప్పుడు ఎలా రాయడానికీ, ఏ పదాలు వాడటానికీ జంకలేదు. కానీ, ఈ కవిత్వంలో మర్యాద పాటించాలనే గొంకు కాస్త కనిపిస్తుంది. అయితే, ఓ అసహనపు రణగొణ ధ్వనుల చిరాకును తన కవితల్లో ధ్వనిస్తూ వుంటుంది. “Wherever you find a great man, you will find a great mother or a great wife standing behind him -- or so they used to say. It would be interesting to know how many great women have had great fathers and husbands behind them.” అని ఎప్పుడో గత శతబ్దానికి చెందిన రచయిత్రి Dorothy L. Sayers సుమారు తొమ్మిది దశాబ్దాల క్రితం రాసిన ‘Gaudy Night’ అనే క్రైమ్ నవలలో అంటుంది. కానీ, వందేళ్ల తర్వాత కూడా ‘వాలిపోతున్న రెక్కలకి/ఆధారమవుతావనుకున్నా/ అలసట కూడా నచ్చనంత/అలుసైపోయాను’ అని వాపోవాల్సి పరిస్థితులే ఉండటం ఎవరి క్రైమ్?

అయినా, పెనుగులాట కొనసాగుతూనే వుంటుంది. ‘నేను మర్చిపోయాననుకున్న/నా అసలు ముఖం/కాలానికి అవతల/నవ్వుతూ కనిపిస్తుంది’ అంటూ దాన్ని వెతికిపట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ, ‘గమ్యానికి చేరానో/చేరాల్సిన చోటే జారిపడ్డానో’ అర్థం చేసుకోవడం సులువు కాదు. ‘పొరపాటున ఎప్పుడైనా ఎదురైతే/దయచేసి నాతో కళ్లు కలపకు’ అని అటుతిరిగి కళ్లు వత్తుకునే ఆమెలో, ‘తట్టుకోలేని ఆనందమో/పట్టరాని దుఃఖమో/అంతుతెలియని పరవశమో/వదిలెళ్ళిన విరహమో/ పేరేదైనా/ కనుపాపలో వెలిగేతడినీటిదీపం’ తొణికిసలాడుతూ వుంటుంది. ‘గదంతా జ్ఞాపకాల సువాసన/దేహం మోహపు మంత్రదడం’ అని మాత్రమే కాదు, ‘తీయని చేదు మర్యాదల ఉచ్చులోంచి/నాదైన అనుభవ కాంతి గోళం వైపు/నన్ను నా లోపలి వైపు/సూర్యముఖినై’ విచ్చుకోవాలని కూడా తెలుసు. అలాగే, ‘గింజ ముట్టట్లేదు/ చుక్క నీరైనా తాగట్లేదు/బెంగపెట్టుకంది’ట. ఎవరు? పిచ్చుక. ఎందుకని? ‘మానవళి తనకంటా ముందే అంతరించి పోతుందేమో’నని అనడంలో, ‘దేవుళ్లారా, మనుషులందరూ మహా భక్తులైపోయారు/మీరైనా మనుషులు కాగలరా?’ అనడంలో తీవ్రమైన ఆక్షేపణ కనిపిస్తుంది. ఒక హౌజ్ వైఫ్ ఎన్ని పనులు చేస్తుందో, అంతకుమించిన కోణాలు ఈ కవితల్లో వున్నాయి.

Roots are not in landscape or a country, or a people, they are inside you అని ఇసాబెల్ అలెండే అన్నట్టు, ఆ రూట్సే ఆమెలో కవిత్వానికి పాదులు తీసాయని అనుకోవచ్చు. అయితే, వచన కవితా పితామహుడు కుందుర్తి మనవరాలు అనే వారసత్వపు బరువు మోయడం అంత సులువు కాదు. లోకులు పోలికలతో పొడుచుకు తినడానికి ఎదురుచూస్తుంటారు. ఆ ప్రమాదాన్ని తెలివిగా తప్పించుకుని, విమానం రెక్కలు పట్టుకు వేళాడకుండా, ఈసారి నేరుగా కవిత్వ విమానం నడుపుకుంటూ వస్తుందనీ, నడి వయసు మధ్యాహ్నపు ఎండకు కవిత్వపు గొడుగుపట్టి సేదదీరుస్తుందనీ అభిలషిస్తున్నా.

దేశరాజు

99486 80009

Tags:    

Similar News