ఇన్ని గింజలు దొరుకుతాయని
ఓ పూట గడుస్తుందనే ఆశతో...
నెలకొకసారి
నస్కుల్నే నిద్ర లేచి
తెల్ల రేషను కారటు పల్లెంతో
గంటల కొద్ది పనులు మానుకొని
పేదరికపు వరుసలో నిలబడితే...,
సారూ, మీరు చెప్పే మాటల్లాగ
మీరు అమలు చేసే పథకాల్లాగ
మీరిచ్చే కంట్రోల్ బియ్యం
అన్నీ మెరికెలు, మట్టి పెడ్డలే !
తిందామంటే నోటి కందదు
పడేద్దామంటే మనస్సు ఒప్పదు.
కన్నీటి చాటలో చెరుగుకొని
పిడికెడు గింజల్ని వొడిసి పట్టుకొని
ఇంటిల్లిపాది ఆకలి బాధను
తరిమికొట్టే సూత్రాన్ని
కనుగొన్న శాస్త్రజ్ఞులం
పుట్ల కొద్ది గింజలు తీసి
కల్లాలను కిలకిల నవ్వించినా.
వెలవెలబోతు మా కంచాలు
మీరు మిగిల్చిన
ఉసుక రాళ్ళ మోసాలను
పంటి కింద లెక్కపెడుతనే..,ఉన్నవి.
(రాళ్ళలో బియ్యం ఏరుతున్న అమ్మను చూసి)
చిక్కొండ్ర రవి
95023 78992