Hyderabad Book Fair : పుస్తకం.. విజ్ఞాన సర్వస్వం

Hyderabad Book Fair : పుస్తకం.. విజ్ఞాన సర్వస్వం

Update: 2024-12-18 15:24 GMT

దిశ, ఫీచర్స్ 

పుస్తకం.. ఆలోచింప జేస్తుంది. ఆచరణవైపు నడిపిస్తుంది

పుస్తకం.. ఆకట్టుకుంటుంది. ఆకర్షణల జడిలో తడిపేస్తుంది

పుస్తకం.. ఆనందాన్ని కలిగిస్తుంది.. ఆవేశాన్ని రగిలిస్తుంది.

పుస్తకం.. విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. వికాసాన్ని కలిగిస్తుంది

పుస్తకం.. అజ్ఞానాన్ని తరిమి కొడుతుంది. కొత్త ఆలోచనలకు పదును పెడుతుంది.

పుస్తకం.. నిరాశలో నువ్వున్నప్పుడు ఆశల హరివిల్లయ్ వికసిస్తుంది.

పుస్తకం.. సమస్యల సుడిగుండాలు నిన్ను చుట్టు ముట్టినప్పుడు పరిష్కారమార్గమై దారి చూపుతుంది

పుస్తకం.. యుద్ధరంగంలో ఒంటరివై తండ్లాడుతున్నప్పుడు ఏకవ్యక్తి సైన్యమై ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుంది

పుస్తకం.. అమ్మలాలనలోని హాయినిస్తుంది.. కోయిలపాటలోని తీయందనాలను పంచుతుంది

పుస్తకం.. ఆత్మవిశ్వాన్ని పెంచుతుంది. ఆత్మ స్థైర్యాన్ని నింపుతుంది.

అవును.. పుస్తకమొక విజ్ఞాన సర్వస్వం. అందుకేనేమో ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు. పుస్తకానికుండే పవర్ అలాంటిదని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ. నిజానికి మానవులకు పుస్తకాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. చిన్నప్పుడు బడిలో చదివేటప్పుడైనా, పెద్దయ్యాక ఉద్యోగం చేసేటప్పుడైనా, ఇంజినీరింగైనా, ఎంబీబీఎస్ అయినా, ఏ చదువైనా సరే అక్షరాల రూపంలో, పదబందాల అనుబంధాలతో, వాక్య నిర్మాణాల వరుసలతో అల్లుకుపోతుంది. సమాచారమంతా ఒక దగ్గర పుస్తకాల రూపంలో ఇమిడి ఉంటుంది. సైన్స్ అయినా, సోషల్ అయినా, మ్యాథ్స్ అయినా, రాజకీయమైనా, సామాజికమైనా, రంగమేదైనా, సబ్జెక్టు మరేదైనా అది పుస్తక రూపాన్ని సంతరించుకోగలదు. సమాజానికి ఉపయోగపడగలదు అంటున్నారు నిపుణులు.

సమాచార సర్వస్వం

అంశమైనా కావచ్చు దానిపట్ల మనకు సందేహం కలిగిందే చాలు.. నివృత్తి చేసుకోవడానికి, లోతైన సమచారాన్ని పొందడానికి కంప్యూటర్లోనో, బుక్ స్టాల్‌‌లోనో మనం ముందుగా వెతికేది పుస్తకాలనే. ఆధునిక కాలంలో, డిజిటల్ యుగంలో సమాచారం అనేక రూపాల్లో, అనేక వేదికల్లో అందుబాటులో ఉండవచ్చు. కానీ లోతుగా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే మాత్రం ఇప్పటికీ పుస్తకాలే సరైన వేదికలని అందరూ అంగీకరిస్తారు. కాలం గిర్రున మారవచ్చు. ఆదిమకాలం నుంచి ఆధునిక కాలం వరకు అనేక పరిణామాలు జరిగాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయినా.. పుస్తకానికేం ఢోకా లేదు. కాలానుగుణంగా అది కూడా డిజిటల్ రూపాన్ని సంతరించుకుంటున్నది. ఎక్కడికెళ్లినా వెంట తీసుకెళ్లగలిగే కాగితపు పుస్తకాల రూపంలోనూ ఉంటున్నది. ఏ రూపంలో ఉంటేనేం.. సమాచారాన్ని, జ్ఞానాన్ని అందిస్తూనే ఉంది. మారుతున్న కాలంతోపాటు కొత్త రంగులను, హంగులను సంతరించుకుని ఆధునికతలో ఇమిడిపోతోంది తప్ప, ఆదరణ మాత్రం కోల్పోవడానికి సిద్ధంగా లేని మహా మొండిఘటం పుస్తకం. ఇప్పుడే కాదు ఇంకెప్పటికైనా పుస్తకం ఉంటుంది. సమాచారాన్ని అందిస్తుంది. అది ఉనికి కోల్పోదు. ఎందుకంటే ప్రతి విషయాన్నీ, ప్రతి అంశాన్నీ అక్షరాల రూపంలో భద్ర పర్చుకునే విజ్ఞానగని పుస్తకం.

పుస్తకమే అన్నింటికీ పునాది

ఒకటా రెండా పుస్తకం గురించి ఎంత చెప్పినా తక్కువే. మానవ వికాసానికీ, సామాజిక విశ్లేషణకూ, సైన్స్ నిరూపణకూ, సాహిత్య ప్రక్రియకూ.. దేనికైనా పుస్తకమే ఆధారం. అదే అన్నింటికీ పునాది. అందులో రాత్రీ, పగలూ ఉన్నట్లే.. మంచీ చెడూ అన్ని అంశాలూ పుస్తకాల్లో ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే బహు రకాల ఆలోచనల సమాహారం పుస్తకం. అన్ని రకాల భావజాలపు వేదిక పుస్తకం. సూర్య కాంతి స్వచ్ఛమైన తటాకములలోని నీటినీ ఆవిరి చేయగలదు. అలాగే డ్రయినేజీల్లోని మురుగు నీటినీ కూడా ఆవిరి చేయగలదు. అంతమాత్రాన సూర్యుడికి, సూర్యకాంతికి ఉన్న తేజస్సు పోదు. శక్తి మారదు. తేటగా ఉన్న నీటిని ఆవిరి చేసినప్పుడు స్వచ్ఛంగానూ, మురికి నీటిని ఆవిరి చేసినప్పుడు మురికిగాను సూర్యుడు మారిపోడు. తన ఉనికిని ఎన్నటికీ కోల్పోడు. పుస్తకం కూడా అంతే. తరాలు మారినా, కాలాలు మారినా దాని ఉనికి మారలేదు. జీవనదిలా ప్రవహిస్తూ, అవసరమైన మార్పులను సంతరించుకుంటూ మనవెంటే పరుగెడుతోంది తప్ప అలసీ సొలసీ ఎన్నడూ ఆగిపోలేదు పుస్తకం.

పవర్‌ఫుల్ శక్తి, ప్రేరణ.. పుస్తకమే..

అజ్ఞానపు చీకట్లను చీలుస్తూ.. విజ్ఞానపు వెలుగులను ప్రసరిస్తుంది పుస్తకం. అపజయాల దారుల్లో మనం నడుస్తున్నా అన్నింటినీ అధిగమించి విజయ తీరాలకు చేర్చే మార్గదర్శిగా నిలుస్తుంది పుస్తకం. ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక స్ర్తీ ఉంటుంది అన్నట్లుగానే.. ప్రతీ సక్సెస్ వెనుక ఒక మంచి పుస్తకం ఉంటుంది. ఒక వ్యక్తి మంచి గుర్తింపు పొందడం వెనుక ప్రేరణగానూ అది నిలుస్తుంది. ఒక వ్యక్తి రచయిగా, మేధావిగా మారడం వెనుక కూడా పుస్తకం ఉంటుంది. ఒక వ్యక్తి సైంటిస్టుగా, సైకాలజిస్టుగా, కమ్యూనిస్టుగా, కరడుగట్టిన విప్లవ కారుడిగా మారడానికి కూడా పుస్తకమే ఒక ప్రేరణ అనడంలో సందేహం లేదు. అంతేకాదు డాక్టర్‌గా, ఇంజినీర్‌గా, మోటివేటర్‌గా, ఫిలాసఫర్‌గా, ఆధ్యాత్మిక వేత్తగా, ఆధునిక మానవుడిగా మనుషులు తమ తమ గుర్తింపులతో ఫోకస్ అవడం వెనుక పుస్తకాల పాత్రే కీలకం. అందుకే పుస్తకానికున్న పవర్ కాంతిశక్తి, విద్యుచ్ఛక్తి, తరంగ శక్తి ఇలా.. భూమిపై ఉన్న ఏ శక్తికీ లేదంటే నమ్మండి. అందుకే పుస్తకమొక ప్రభావవంతమైన మహాశక్తి.

నడిపించేవి.. మురిపించేవి పుస్తకాలే

కొన్ని పుస్తకాలు మనల్ని ఆనందలో ముంచెత్తుతాయి. కొన్ని పుస్తకాలు మనలో ఆవేశాన్ని రగిలిస్తాయి. మరికొన్ని పుస్తకాలు మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఇంకొన్ని పుస్తకాలు కన్నీటి పర్యంతమయ్యేలా చేస్తాయి. ఏదో ఒక రకమైన భావజాలపు బాంధవ్యాన్ని పెంచుతాయి కొన్ని పుస్తకాలు. భౌతికవాద జ్ఞాన సముపార్జనకు తోడ్పడతాయి మరికొన్ని పుస్తకాలు. కొన్ని పుస్తకాలు చారిత్రాత్మక వాస్తవాలను వెల్లడించే వారధులవుతాయి. ఇంకొన్ని పుస్తకాలు చరిత్రను వక్రీకరించే చీకటి పుటలు కూడా అవుతాయి. కొన్ని పుస్తకాలు ఉరకలెత్తే ఉత్సాహాన్ని నింపుతాయి. మరికొన్ని పుస్తకాలు ఉద్యమ పాఠాలై విప్లవాగ్ని రగిలిస్తాయి. కొన్ని పుస్తకాలు శరదృతు వర్ణనలై మదిని రంజింపజేస్తాయి. మరికొన్ని వసంతకాలపు మేఘగర్జనలై మనల్ని తట్టిలేపుతాయి. కృష్ణశాస్ర్తి భావుకతలై అలరిస్తాయి పుస్తకాలు, బాపుగీసిన వర్ణచిత్రమై ఆకర్షిస్తాయి పుస్తకాలు.

ఎంత చెప్పినా తక్కువే..

శ్రీ శ్రీ మహా ప్రస్థానపు జగన్నాథ రథచక్రాలై దొర్లుతాయి పుస్తకాలు. చలం రాతల ‘వలపు మైదాన’ములై పరవశింపజేస్తాయి పుస్తకాలు. ఎంకిపాటల రాగాలై రంజింపజేస్తాయి. వెన్నెల రాత్రుల్లో విరహ గీతాలై మదిని తడుముతాయి.. ఇలా ఒకటా రెండా ఎంతని చెప్పాలి? ఏమని వర్ణించాలి పుస్తకాల గురించి. పుస్తకాలు చదివితేనే అందులోని అసలైన మాధుర్యం మనకు తెలిసొస్తుంది. పుస్తకం చదివితేనే ఆనందమో, ఆవేదనో, ఆవేశమో, ఆత్రుతో మనల్ని కదిలిస్తుంది. ఇంకెందుకాలస్యం ఈ రోజు(డిసెంబర్ 19) నుంచే హైదరాబాద్‌లో పుస్తకాల ప్రారంభమైంది. వెళ్లి తనివి తీరా చూసి, నచ్చిత పుస్తకాన్ని వెంట తెచ్చుకొని పుస్తకం అందించే విజ్ఞానాన్నో, మాధుర్యాన్నో తనివితీరా అనుభవిద్దాం చలో!

పుస్తకం - చరిత్ర

పుస్తకమొక విజ్ఞాన సర్వస్వం కాబట్టే దానికో ప్రత్యేకత ఉంది. పుస్తక ప్రదర్శనలు, పుస్తక దినోత్సవాలు, పుస్తక మేళాలు వంటివి మనం చూస్తుంటాం. ఏటా పుస్తక దినోత్సవం కూడా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటుంటారు. హైదరాబాద్‌లో డిసెంబర్ 19 నుంచి 29 వరకు బుక్ ఫెయిన్ నిర్వహించనున్నారు. ఇక పుస్తకాల చరిత్రలోకి తొంగిచూస్తే జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ బుక్ ఫెయిర్ మొదలుకొని కొల్‌కతా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ వరకు పుస్తక ప్రదర్శనలు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప సాంస్కృతి వైభవంగా నిలుస్తున్నాయి. మరింతో లోతుగా పరిశీలిస్తే..17వ శతాబ్దంనాటి యూరప్‌లో పుస్తక దినోత్సవాన్ని సెయింట్ జార్జ్ డే‌గా పాటించేవారట. స్పెయిన్‌లో కూడా పుస్తక దినోత్సవం వేళ ప్రతి పుస్తక కొనుగోలుపై ఒక గులాబీని బహుమతిగా ఇస్తారట. సెవాంతెస్, షేక్‌స్పియర్, ఇన్కా గర్సిలాసో, వేగా అనే ప్రఖ్యాత రచయితలు 1616 సంవత్సరంలో ఏప్రిల్ 23న మరణించినందున ఆరోజు పలు దేశాల్లో పుస్తక దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఏటా ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం జరుపుకోవాలని యునెస్కో 1955లో ప్రకటించింది. 2017లో రిపబ్లిక్‌ ఆఫ్‌ గినీలోని ‘కొనాక్రీ’ సిటీని, 2018లో గ్రీస్‌లోని ‘ఏథెన్స్‌’ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించింది యునెస్కో. మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో అన్ని దేశాలకంటే ఎక్కువగా పుస్తక ప్రియులు ఉన్నదేశం ఇండియానే. భారతీయులు వారానికి సగటున 10.2 గంటలపాటు బుక్ రీడింగ్ చేస్తారని దశాబ్దం క్రితమే ఓ అధ్యయనంలో తేలింది. 2013 నాటి సర్వేలో ఈ సమయం 10.4 గంటలకు పెరిగిందంటే.. 2024లో అది మరింత రెట్టింపయ్యి ఉండవచ్చు అంటున్నారు పుస్తక అభిమానులు, విశ్లేషకులు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్ చరిత్ర

హైదరాబాద్‌కు పుస్తక ప్రదర్శనల విషయంలోనూ గొప్ప సాంస్కృతిక ప్రాభవం ఉంది. మొదటి 1985లో అశోక్ నగర్‌లో గల సిటీ సెంట్రల్ లైబ్రరీలో మొదటిసారిగా బుక్ ఫెయిర్ ప్రారంభించారు. నాడు పబ్లిషర్స్‌ను, పుస్తక విక్రయదారులు ఒకే వేదికపై పుస్తకాల ప్రాధాన్యతను చాటిచెప్పారు. ఆ తర్వాత నల్గొండ, నిజాం కాలేజ్ గ్రౌండ్, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వంటి చోట్ల కూడా పుస్త ప్రదర్శనలు కొనసాగాయి. 12 ఏండ్లుగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ నిర్వహిస్తూ వస్తున్నారు.

డిజిటలైజేషన్ రూపంలోనూ..

టెక్నాలజీ నేడు అనేక రంగాల్లో మార్పులకు కారణమైంది. అలాగే పుస్తకాలు కూడా డిజిటలైజేషన్‌ను సంతరించుకుంటున్నాయి. రచయితలు తమ పుస్తకాలను పీడీఎఫ్‌ల రూపంలో నెట్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని ఈ బుక్స్ అని పిలుస్తాం. అయితే ప్రపంచంలో ఈ బుక్స్ విధానం 20 ఏండ్లనాటి నుంచి అందుబాటులో ఉందని నిపుణులు చెబుతున్నారు. 1991లో తయారు చేసిన ఈ బుక్ బైబిల్‌. ఆ తర్వాత అనేక పుస్తకాలు ఇంటర్నెట్‌లో ఇమిడిపోవడం ప్రారంభమైంది. నేడు అనేక పుస్తకాలు ఈ బుక్స్ రూపంలో అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం మనం వాడే మొబైల్‌ఫోన్‌లో కూడా ఈ-బుక్‌ ఈజీగా చదువుకోవచ్చు. అంటే చరిత్రలో పుస్తకం ఎప్పటికప్పుడూ తన రూపం మార్చుకుంటూ పాఠకులకు అందుబాటులోకి వస్తోంది తప్ప, ఆదరణ కోల్పోయిన దాఖలాలు లేవు. ఏవిధంగా చూసినా పుస్తకాలు అజ్ఞానాన్ని తొలగించే విజ్ఞాన వీచికలు. అందుకే మనం చదవాలి అంటున్నారు మేధావులు.

Tags:    

Similar News