అండమాన్ - నికోబార్ దీవులు -1
YHAlకి చెందిన హైదరాబాదు మహిళా విభాగం విహంగ నుంచి తొమ్మిది మందిమి అండమాన్ ట్రిప్‌కు రెండునెలలు ముందుగానే బుక్ చేసుకున్నాము.
దిశ, వెబ్ డెస్క్ : YHAlకి చెందిన హైదరాబాదు మహిళా విభాగం విహంగ నుంచి తొమ్మిది మందిమి అండమాన్ ట్రిప్‌కు రెండునెలలు ముందుగానే బుక్ చేసుకున్నాము. అందులో ఎనిమిది మంది మహిళలం. పన్నెండు యేళ్ళ అబ్బాయి నవరంగ్ ఉన్నారు. నేను అంతకు ముందు నెలలోనే లక్షద్వీప్ వెళ్లి వచ్చినా అండమాన్ వెళ్ళడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి చారిత్రకంగా ప్రసిద్ధి పొందిన అండమాన్ జైలు. రెండోది సహ యాత్రికులు. మనం ఏ ప్రయాణం చేసినా మన తోటి ప్రయాణీకులను బట్టి కూడా కొంతవరకు మనం పొందే ఆనందం, విజ్ఞానం ఆధారపడి ఉంటాయి. అండమాన్ ట్రిప్ లో అలాంటి సహ యాత్రికులు ఉండడం రెండోకారణం. అలా pow సంధ్య, ప్రముఖ రచయిత్రి శాంతి ప్రబోధ, భండారు విజయ, జూపాక సుభద్ర, అన్నె అరుణ, CMS అనిత, రిటైర్డు ప్రిన్స్ పల్ జానకి గారు నేను ... సంధ్య కొడుకు పిల్లాడే అయినా మంచి సూక్ష్మ పరిశీలకుడు అయిన నవరంగ్ మొత్తం తొమ్మిది మందిమి డిసెంబర్ ఏడో తారీఖున హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం ఆరున్నరకు బయలుదేరి 8.30 ని.లకు పోర్ట్ బ్లెయిర్ లోని వీరసావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం 8.30 ని.లకు చేరుకున్నాము. కలకత్తానుంచి వచ్చిన ఒక జంటతో కలిపి పదకొండుగురు బృందం అయ్యాము. YHAl ( Youth Hostels Arsiation of India ) వాళ్ళు హోటల్ ఇన్ఫినిటీలో మాకు వసతి ఏర్పాటు చేశారు. ఆరు రోజులు, ఐదు రాత్రుల ప్యాకేజీకి 19,900 లు చెల్లించాము. విమాన చార్జిలు, వాటర్ గేమ్స్ అదనం. భారత దేశంలోని అండమాన్ నికోబార్ దీవుల మొత్తం సంఖ్య పట్ల భిన్నాభిప్రాయాలున్నాయి. మొత్తం 836 దీవులని వీటిలో 31 దీవులలో ప్రజలు నివసిస్తున్నారని ఒక అభిప్రాయం. కాదు 572 దీవులని వీటిలో 37 దీవులలో ప్రజలు నివసిస్తున్నారని మరో అభిప్రాయం. అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్. అండమాన్ అనే పేరు హండుమాన్ అనే పదం నుంచి వచ్చింది. మలయా భాషలో హనుమంతుడిని హండుమాన్ అని పిలుస్తారట. అలాగే నికోబార్ అంటే మలయా భాషలో నగ్న మనుషుల భూమి అని అర్థం.
భారత నావికా స్థావరాల కేంద్రం.. నికోబార్
మొదటి రాజేంద్ర చోళుడు (1014-1042 ) శ్రీ విజయ సామ్రాజ్యం మీద దండయాత్ర మొదలు పెట్టినప్పుడు వ్యూహాత్మకమైన నావికా స్థావరంగా అండమాన్ నికోబార్ దీవులను ఉపయోగించినట్లు చరిత్ర చెపుతోంది. శ్రీవిజయ సామ్రాజ్యం అంటే ఇప్పటి ఆధునిక ఇండోనేషియా. ఇప్పుడు కూడా భారత ప్రభుత్వానికి చెందిన సురక్షితమైన నావికా స్థావరాలు నికోబార్ దీవులలోనే ఉన్నాయి. అందువలన అక్కడికి యాత్రికుల ప్రవేశాన్ని నిషేధించారని గైడ్ మాల్యాద్రి చెప్పాడు. ఎవరైనా తప్పనిసరి పరిస్థితులలో ఆఫీసు, వ్యక్తిగత (పెళ్ళి లాంటి వేడుకలకు) అవసరాలకొరకు వెళ్ళవలసి వస్తే ముందుగా అనుమతి పత్రం (వీసా లాంటిది ) తీసుకోవలసి ఉంటుంది. అక్కడ ఉండడానికి మూడు నాలుగు రోజుల కన్నా ఎక్కువ అనుమతి లభించదని మాల్యాద్రి చెప్పాడు. అతడు అండమాన్ స్థానికుడు. అక్కడే పుట్టి పెరిగినవాడు. వాళ్ళ నాన్న ఆ కాలంలోనే మన నెల్లూరు ప్రాంతం నుంచి అక్కడకు వెళ్లి స్థిరపడ్డారట. వాళ్ళ తమ్ముడు అక్కడి పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తాడట.
వీరసావర్కార్ ప్రత్యేక సెల్
మొదటి రోజు మూడుగంటలకు అండమాన్ జైలును సందర్శించడానికి వెళ్ళాము. మా హోటలు నుంచి 15. ని.లు ప్రయాణం. జైలు నిర్మాణం 1896 లో మొదలై 1905 లో పూర్తయింది. ఆ భవనంలో ఏడు సరళ రెక్కలు ఉన్నాయి. మధ్యలో టవర్ ఉంది. అది వాచ్ టవర్‌గా ఉపయోగపడేదట. చూడడానికి నక్షత్రం ఆకారంలో ఉంది. సైకిలు చక్రం లాగా కూడా ఉంటుంది. బర్మా నుంచి తెచ్చిన ఒకలాంటి ఎరుపు రంగు ఇటుకలను నిర్మాణానికి ఉపయోగించారు. ఒక్కొక్క రెక్కలో మూడు అంతస్తులు ఉన్నాయి. మొత్తం 696 సెల్ లు ఉన్నాయట. ప్రతి సెల్ 2.7 వెడల్పుతో 4.5 పొడుగుతో ఒక అతి కష్టంగా మెసలాడానికి వీలు కానంత ఇరుకుగా ఉన్నది. పైన చిన్న వెంటిలేటర్ మాత్రం ఉన్నది. రెండో అంతస్తు చివరలో వీర సావర్కర్ గది ప్రత్యేకంగా ఉన్నది. ఆ గదిలో ఆయన ఫోటో, చిన్న చెక్క బల్ల, రెండు లోహపు పాత్రలు ఉన్నాయి. ఒకరితో మరొకరు మాట్లాడుకోవడానికి వీలులేని నిర్భంధం. ఒంటరితనంతో మానసికంగా కృంగి కృశించడం. ఖైదీల కొరకు ఎక్కడా మల మూత్ర విసర్జన శాలలు లేకపోవడం మరింత బాధాకరం.
అండమాన్ జైలులో క్రూర శిక్షలు
దానికి తోడు భయంకరమైన శిక్షా విధానం. శక్తికి మించిన పనులు చెప్పి, చేయలేక పోయినందుకు శిక్షించడం. కొబ్బరి పీచునుంచి తాళ్ళను తయారు చేయించడం. రోజంతా చేతితో గానుగను తిప్పుతూ నూనెను తీయించడం అందులో కొన్ని. చేతితో తిప్పే హాండిల్ సులువుగా తిప్పడానికి వీలుకాని విధంగా బరువులు బిగించబడి ఉన్నాయి. టార్గెట్‌ను పూర్తి చేయలేదని శిక్షించే విధానం కూడా భయంకరంగా ఉండేదట. ఒక చువ్వకు ఖైదీని బోర్లా పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి, పిరుదులమీద చర్మం ఊడి వచ్చేదాకా కొట్టే వారట. ఒక రోజుతో చర్మం ఊడి రాని పక్షంలో మరుసటి రోజు మళ్ళీ అదే శిక్ష. ఒక్కోసారి ఆ చోటులో కారం పొడి కూడా చల్లే వారట. ఈ రకమైన శిక్షా నమూనా అక్కడ ప్రత్యేకంగా ఉన్నది. దానితో ఖైదీలు కూర్చోలేక, పడుకోలేక భయంకరమైన వేదన అనుభవించేవారు.
అందుకే కాబోలు ఇందుభూషన్ రాయ్ ఆయిల్ తీయలేక అక్కడే తన చిరిగిన చొక్కాతో ఉరివేసుకొని చనిపోయాడట. అలాగే జైలు అధికారుల చిత్రహింసలను తట్టుకోలేక నరింగిన్ సింగ్ అనే ఖైదీ తన సెల్ లోనే ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిసింది. జైలులో ఇచ్చే ఆహారం, నీళ్ళు కూడా తిని తాగడానికి వీలుకాని విధంగా పురుగులతో, వాసనతో ఉండేవట. అందుకు నిరసనగా ఖైదీలు నిరాహార దీక్ష చేశారట. మహావీర్ సింగ్ (భగత్ సింగ్ స్నేహితుడు), మోహన్ కిషోర్, మోహిత్ మోయిత్రాల చేత దీక్ష విరమింప జేయడానికి బలవంతంగా పాలు తాగించినప్పుడు అవి ఉాపిరితిత్తులలోకి పోయి ఊపిరాడక మరణించారట. సెల్యులార్ జైలులో రాజకీయ ఖైదీలే కాకుండా ఇతర నేరస్థులు కూడా ఉండేవారు. కలప దొంగిలించదానికి బర్మానుంచి వచ్చే ఖైదీలు కూడా ఉండేవారట.
1939లోనే అండమాన్ జైలు ఖాళీ
భారతదేశంలో స్వాతంత్య్రోద్యమం కాలంలో మహాత్మ గాంధీ, రవీంద్ర నాథ్ ఠాగూర్ సెల్యులార్ జైలును మూసేయాలని ప్రచారాన్ని ఉద్ధృతం చేసారు. ఫలితంగా వలస ప్రభుత్వం 1937-38 లో రాజకీయ ఖైదీలను స్వదేశానికి పంపించింది. 1939లో దాదాపు జైలు ఖాళీ అయింది. రెండేళ్ళ తరువాత జపనీయులు ఆక్రమించారు. పరిస్థితులు తారుమారయ్యాయి. పోర్టుబ్లెయిర్ లోని జింఖానా గ్రౌండులో సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ పతాకాన్ని ముందుగా ఎగురవేయడంతో 1945లో రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత అండమాన్ భారత దేశంలో భాగమైంది. కానీ పూర్తి హక్కులు భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అంటే 1947 తరువాత వచ్చాయట. 1956లో భారత ప్రభుత్వం అండమాన్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది.
జాతీయ స్మారక చిహ్నంగా సెల్యులార్ జైలు
సెల్యులార్ జైలులో మొత్తం 795 మంది రాజకీయ ఖైదీలు ఉండేవారు. వారిలో ఎక్కువగా బెంగాల్ నుంచి 608 మంది ఉండేవారు. తెలుగు రాష్ట్రాలనుంచి ఎనిమిది మందిని ఉంచారు. స్వాతంత్ర్యం తరువాత జైలులోని రెండు రెక్కలను కూల్చిచేసారట. 1979 ఫిబ్రవరి 11 తేదీన అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయి దానిని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించారు. 1993 నుంచి ప్రజలు సందర్శించడానికి వీలు కల్పించారు. ముందుగా మేము చూసిన ఫోటో గ్యాలరీలలో ఉన్న సమాచారం మేరకు ఇక్కడ ప్రస్తావించాను. ప్రత్యేకంగా ఒక గ్యాలరీలో ఆ కాలం నాటి ఫోటోలనే (లండన్ నుంచి తీసుక వచ్చి) ఉంచారు. మరోచోట నూనె తీసే లోహపు గానుగలు ఉన్నాయి. ఖైదీలు వేసుకునే డ్రెస్సు, శిక్షల నమూనాలు ఉన్నాయి. ఉరిశిక్ష వేసే గది ప్రత్యేకంగా ఉన్నది. ఒకేసారి ముగ్గురికి ఉరిశిక్ష వేసే ఏర్పాటు అక్కడ ఉన్నది. సాయంత్రం మేము చూసిన లేజర్ లైట్ షో సాంకేతికంగా సందర్భానుగుణమైన సంగీతంతో నాణ్యంగా ఉన్నది. ఖైదీలకు వేసే శిక్షలతో పాటు అప్పటి సంఘటనలను కళ్ళ ముందు ఉంచింది.
(ఇంకా ఉంది)
గిరిజ పైడిమర్రి
ట్రావెలర్
99494 43414