వర్ణాంతర సంధ్యలో.... ప్రపంచమే ప్రకాశిస్తుంది.

డా. కత్తి పద్మారావు వర్ణాంతర సంబంధాలు కవిత్వం

Update: 2024-11-07 12:26 GMT

దిశ, వెబ్ డెస్క్ : వర్ణాంతర సంధ్యలో.... ప్రపంచమే ప్రకాశిస్తుంది.

-----------------

అరేబియా సంద్రంలో

ప్రయాణిస్తున్న నౌక.

సుగంధ ద్రవ్యాలతో

ఘుమఘుమలాడుతుంది.

పడవకు కట్టిన తెరచాపకు

ఓ నక్షత్రం దిక్సూచిగా మెరిసింది.

సూర్యోదయాన్ని బట్టి దిక్కులు

నిర్ణయిస్తున్న నావికుడు.

జీవన సంక్షోభంలో

నేటి బతుకు పడవ.

దిక్సూచి లేని ప్రయాణం.

కడలి గర్భంలో ఉన్న చేపల గుంపుల్లో కలవరం.

అగ్నిపర్వతాలు అంతరంగం నుండే పుడుతున్నాయి.

కుటుంబం వైరుధ్యభరితంగా ఉంది.

మనుషుల అభిరుచుల మధ్య ఘర్షణ.

కొత్తపుంతలకు అడ్డుగోడలు.

చెరువులు నాచు పడుతున్నాయి.

కాలువలకు పూడిక తీయక

పంటలు ఎండిపోతున్నాయి.

కంకి ఫలించక ముందే రాలిపోతుంది.

దాహార్తిని మత్తుమందుతో తీర్చుకుంటున్నారు.

గుండెకు చిల్లులు పడుతున్నాయి.

మనిషిలో మృగం తొంగి చూస్తుంది.

పాలకుడు రుగ్మతకు

అయువు పోస్తున్నాడు!

మరో ప్రక్క ఆ యవ్వనుల

జీవన యానం

ఓ మధుర గానంలా సాగుతుంది.

పాడుతున్న ఆ గంధర్వకాంతకు

ఫ్లూట్ వాయిస్తున్న అతడి

శ్వాస తగులుతుంది.

ఆ యువతి కాళ్లు తడుపుకుంటున్నప్పుడు

అలలు మునివేళ్ళతో మాట్లాడుతున్నాయి.

ఆమె తలార స్నానం చేశాక

కురులు ఆమెతో ముచ్చటిస్తున్నాయి.

ఔను! ఇప్పుడు ఆమె తనతోనే

తాను మాట్లాడుకోగలుగుతుంది.

ఆమె ప్రతి కదలికలో

ఒక భావనా చాతుర్యం ఉంది.

ఆమె విరబూసిన తోటలో విహరిస్తుంది?

ప్రతి చెట్టులో పొటమరిస్తున్న

చిగురాకు లో ఉన్న మృదుత్వం

ఆ యువతిని ప్రశ్నిస్తుంది.

జీవితంలోని రంగుల వలయాలను

అంతరాంతరాల్లో దాగిన వెన్నెల

తరగలను చూడమని చెప్తుంది.

ఇప్పుడు తనకి తానే

ఓ స్నేహితురాలు.

ఈ నిర్వేదితులు ఎందుకు

ఆ జవ్వని అడుగు

చప్పుళ్లకు బెదిరిపోతున్నారు?

వీరు తగిలించిన

ఇనుపకచ్చడాలను

ఆమె ఛేదించిందనా ?

వీరు వీక్షించలేని చిత్రాలకు

ఆమె రంగులద్దుతుందనా ?

వీరు దర్శించలేని శిల్పాలలోని వన్నెలను

ఆమె చూపులు అందుకుంటున్నాయనా ?

ఎందుకు ఆమె అంతర్వీక్షణకు వీరు

నిర్వీక్షకులవుతున్నారు?

ఆమె మేఘాల మీద నడిచేటప్పుడు

విద్యుత్ వలయాలు ఆమె చరణాలకు

కాంతులద్దుతున్నాయి.

మీరు పేర్చిన చితి మంటలలో నుంచి

లేచిన చితాభస్మం నుండే

ఈ చైతన్య జ్వాల ప్రభవించింది.

మీ గణిత శాస్త్రమంతా ఆమె

ముని వేళ్ళ మీద నాట్యం చేస్తుంది.

మళ్లీ మీరెక్కడో మంటలు వేస్తున్నారు కదా!

ఆ మంటల్లో మిమ్మల్నే తోసే చైతన్యo

ఈనాడు ఆమెకుంది.

నిజమే! నేను డర్బన్ నుండి

జాన్స్ బర్గ్ వెళ్లే విమానంలో

ఒక తెల్ల భామ, ఒక నల్ల యువకుడితో

ఉన్న జోడీని చూశాను.

ఇప్పుడు ఫ్రాంచైజస్ అన్నీ

ఆ నల్ల వీరునికే కోట్లు పెట్టి కొంటున్నాయి.

అతనికి ముంబై విమానాశ్రయంలో

భారతీయ తారలు ఎర్రతివాచీ పరిచారు.

నిజమే !

ఆ ఆఫ్రిన్ సౌందర్యవతి పాదాలకు

వారు చెప్పులు తొడుగుతున్నారు.

ఆమె అందమైన గోళ్ళకు వారు వంగి

నెయిల్ పాలిష్ వేస్తున్నారు.

ప్రపంచమంతా ప్రతిభకు

దాసోహమవుతుంది.

ఆకాశ అవనిక పై

విజయ పతాకలు ఎగురుతున్నాయి.

ఆ సవర స్త్రీ ఎప్పుడో

తన మట్టెల మోతలతో

పులులను లొంగదీసుకుంది.

ఆ కోయ భామ ఏనుగు మీదెక్కి

ఆడాడే రాజసం చాటింది.

ఆమె తలలో గుచ్చుకున్న

నెమలి ఈక

జాత్యహంకారానికి గుర్తు.

దేశ దేశాల్లో సైనిక కవాతుల్లో

స్త్రీ గణ రణ చరణ విన్యాసం!

ఎందుకు ఆ సాంప్రదాయ పితృడు

భయపడుతున్నాడు?

తన కుమార్తె గీత దాటుతుందనా?

ఆమె అక్షరాలనే కాదు,

ప్రపంచాన్నే చదువుతుంది.

పుస్తకం మస్తకం

అంతః స్సంబంధితాలని తెలుసుకుంది.

జీవితంలో విద్యను,

విద్యలో జీవితాన్ని చవిచూస్తుంది.

ఎందుకు మీరు తల్లి బతికున్నప్పుడు

ఒక ముద్ద అన్నం పెట్టకుండా

ద్వాదశ దినాలు పిండ ప్రదానం చేస్తున్నారు?

ఆ నిప్పు కణికలతో

మాంసం కాల్చిన దేశంలో

యాగాల్లో నెయ్యిని ఎందుకు పోస్తున్నారు?

అందుకే నీ కూతురు

ఆ మంటల్లో నుండే

నీల వరుణుణ్ణి ప్రేమించింది.

మీ సుత నూత్న సృష్టికి ఆయువులుపోస్తుంది.

ఆమెకు పుట్టిన సుతుడు గంధర్వుడయ్యాడు.

కర్ణుడూ అయ్యాడు.

సామాజిక ఘర్షణ నుండి

యుగకర్తలు పుడుతున్నారు.

ఆమె ఈనాడే కాదు,

ఆ నదీ తీరాన ఆ సత్యవతి

ఆనాడే వర్ణాంతరిత అయింది.

ఆమె తండ్రి శంతనుడు

ఆనాడే చక్రవర్తి.

నిజమే! ప్రపంచమే

వర్ణాంతర సంధ్యలో ప్రకాశిస్తుంది.

ఆ వర్ణాంతరిత ఆకాశంలోని

ఏడు రంగులను ధరించింది.

ఇది ఆమె యుగం.

ఆమె మేల్కొంది.

ఆమె గమిస్తుంది.

ఆమె ఉదయిస్తుంది.

ఆమె అంతరంగికమౌతుంది.

ఆమె నూత్న సృష్టికి

ఆయువులు పోస్తుంది.

ఆమెతో నడుద్దాం.

- మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు.

98497 41695


Similar News