ధర్మం ఆధారమైన సంకలనం

NEMMI NEELAM Book Review

Update: 2024-11-04 01:15 GMT

లోకాన్ని నడిపేది డబ్బు అనుకుంటాం మనం.. కాని లోకాన్ని నడిపేది ధర్మం, అధర్మం అనే రెండు విషయాలు మాత్రమే. అలా అని ధర్మాత్ములు, అధర్మాత్ములు అని ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. అప్పటి వారి అవసరాలకు ఏదోక వైపు నిలబడతారు. జయమోహన్ రాసిన "నెమ్మినీలం" పుస్తకంలో అన్ని కథలు ధర్మం ఆధారంగా రాసినవే. తమిళ రచయిత జయామోహన్ నలభై రోజుల్లో ఇన్ని కథలు రాశాడు అంటేనే చాలా ఆశ్చర్యం వేసింది.

మొదటి కథ 'ధర్మం' లో తమిళంలో మొదటి తరం రచయితలు ఒక్కో నవల ఇరవై ముప్పై రూపాయలకే, ఎలాంటి హక్కులు లేకుండా రాశారని తెలిసి ఆశ్చర్యం వేసింది. రచయితల నోటి వాక్కులు ఫలిస్తాయి అనడం కూడా. రెండవ కథ 'ఒగ్గనివాడు'లో బ్రిటిష్ కాలంలో ఊర్లలో పన్ను వసూలు చేసే నాయర్ల అరాచకాలు, బానిసత్వం... తెలంగాణలో నిజాం కాలంలో జమీందారీ - వెట్టి చాకిరీ వ్యవస్థలను గుర్తుకు తెచ్చాయి. అక్కడ బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి వణంగాన్ కూడ నాయర్ల అవమానాలు పడి.. చివరికి నేసమణి సహాయంతో ఏనుగు మీద ఊరేగి.. నాయర్ల అరాచకాలను తొక్కి పడేస్తాడు. అచ్చం ఇక్కడి పీడిత ప్రజల వెనకాల నిలబడి గర్జించిన సంఘం లాగ.

అమ్మవారి పాదం

మూడవ కథ 'అమ్మవారి పాదం'లో సంగీతం ప్రాధాన్యంగా సాగుతుంది. అప్పటిదాకా శేషయ్యర్ సంగీతానికి పరవశించిపోతూ... చివర్లో ఆయన తండ్రి మంచంలో విసర్జించిన మలమూత్రంతో నిండిన పాత్ర.. ఇంటిపనుల్లో పడిపోయి తీయని భార్య నెత్తిమీద గుమ్మరించిన శేషయ్యర్ పాతాళంలోకి పడిపోయినట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి మనం వీళ్లు గొప్పవాళ్లు అనుకుంటాం. కానీ అసలు గొప్పతనం వాళ్ల భార్యల కన్నీళ్లు చూసి లెక్కెయ్యాలి.

ఏనుగుల డాక్టర్..

నాలుగవ కథ "ఏనుగుల డాక్టర్'. ప్రకృతి అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. కానీ ప్రకృతితో మమేకమయ్యే వాళ్లు అరుదు. ఉద్యోగరీత్యా అటవీశాఖలో వెటర్నరీ డాక్టర్ అయిన డాక్టర్ వి. కృష్ణమూర్తి గారి కథ ఇది. ఏనుగుల డాక్టర్‌గా పిలుస్తారు అంతా. ఈ కథలో అడవి గురించి.. ఏనుగుల గురించి వివరించడం బాగా నచ్చింది నాకు. ముందునుండి అడవిపై ఏనుగులపై ఉండిన ఇష్టం వల్ల ఇంకా ఎక్కువ నచ్చింది. ఏనుగులు అనేవి లేకుంటే సంగం సాహిత్యంలో ఏమీ ఉండదు..తగలబెట్టుకోవడం తప్పా అనడం ఎంత నిజమో.. అడవి లేకపోతే కూడ మనుషుల గురించి చెప్పుకునేది ఏమీ ఉండదు అనేది అంత నిజం.

వంద కుర్చీలు

ఇక బుక్ లో ముఖ్యమైన కథ 'వంద కుర్చీలు'. అసలు ఈ పుస్తకానికి ఈ టైటిల్ పెట్టాల్సింది అనిపించింది. చదువుతున్నంతసేపూ గుండెను పచ్చటి గుమ్మడి ఆకు మీద తుమ్మ ముళ్లుతో కసాబిసా తూట్లు గుచ్చుతున్న పెయిన్ తిప్పేస్తూ ఉంటుంది. ఇప్పుడే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి ఇలా ఉంటే ఓ అరవై ఏళ్ల కింద ఎలా ఉండి ఉంటుంది..? అందునా అనాథలకు, బిచ్చగాళ్ళకు, కింద కులాలు కూడా అంటరాని వాళ్లుగా చూసే వాళ్ల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండేదో..? తలుచుకుంటే ఒళ్లు జలదరించింది. ఇప్పటికీ మనం చూస్తున్న రోడ్డుపక్కన పడి ఉన్న అనాథలు.. బిచ్చగాళ్ల.. పరిస్థితుల్లో ఏం మార్పు లేదు అనిపిస్తుంది. ముసురు పట్టిన రోజు లేదా చలికాలం వచ్చే తుఫాను గాలులు వణికిస్తున్న రోజునో..వెచ్చటి రగ్గు కప్పుకుని పడుకున్నప్పుడు... వేడి వేడిగా సూపులు.. ఆహారం తింటున్నప్పుడు గుర్తుకు వస్తారు వీళ్లంతా. గుర్తుకు వచ్చి నొప్పితో మనసు మూలుగుతుండటమే నేను చేసేది.

పెద్ద ఉద్యోగిపైనా అంటరానితనం

కథలో మాత్రం... అరవై ఏళ్ల కింద ఉన్న అంటరానితనం.. అంటరాని కులాలుగా చెప్పబడుతున్న వాళ్లు కూడా అసహ్యించుకున్న నాయాడి కులంలో పుట్టిన ధర్మపాలన్ అనే కాప్పన్.. చెత్త కుప్పల పక్కన పుట్టి, అక్కడ పడేసిన పాచిపోయిన బూజు పట్టిన ఆహారం కోసం పందులతో, ఎలుకలు, పందికొక్కులతో పోటీపడి తిన్న కాప్పన్ పడిన కష్టాలకు.. అసలు కష్టాలు, బాధలు అనే పేర్లకంటే ఎక్కువ వ్యక్తీకరించే పదాలు కనిపెట్టాలి. అలాంటి కాప్పన్ కేవలం మంచి తిండి కోసం మాత్రమే థియోసాఫికల్ సొసైటీకి వచ్చి చేరి, చదువుకొని సివిల్స్ సాధిస్తాడు. అంత పెద్ద ఉద్యోగం సాధించాక కూడా అంటరానితనం కాప్పన్ మీద రుద్దబడుతూనే ఉంటుంది. రుద్దబడుతున్న అంటరానితనంతో జీవితాన్నే కోల్పోతాడు అమ్మతో సహా. తమ నాయాడి వాళ్లను బయట పడేయడానికి తనకు అధికార కుర్చీలు వందకావాలి అనిపించింది కాప్పన్ కు అది అప్పటి కాలానికి, ఇప్పుడైతే లక్ష కుర్చీలు కూడ చాలవు. అయితే ధర్మపాలన్ గా మారిన కాప్పన్ ఏ అధర్మాన్ని ఎదురించినట్టు ఉండదు కానీ నిస్సహాయుడు, మరో అంటరాని కులానికి చెందిన ఆ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుని విషయంలో అధర్మాన్ని గట్టిగా పాటిస్తాడు. అపుడు మన కన్నీళ్లు చేదు అవుతాయి.

నెమ్మి నీలం

9వ కథ 'నెమ్మి నీలం'. అమ్మవారి పాదం కథలో ఉన్న పాత్రలే ఇందులోనూ ఉంటాయి. కొత్తగా చంద్ర అనే నాట్యగత్తె ఉంటుంది. కళాకారులకు సాధారణంగానే ఉండే స్త్రీ సౌందర్య ఆరాధన ఇందులో కనిపిస్తుంది. అప్పటికాలం అయినా ఇప్పటికాలం అయినా స్త్రీ కళాకారుల పట్ల ఉండే చులకన భావం ఏం మారలేదు. సంగీత పరిజ్ఞానం ఉన్నవాళ్లకి ఈ కథ అర్థమవచ్చు. ఇంతకీ నెమ్మి నీలం అంటే.. నెమలి మెడరంగు నీలం. చిత్ర కట్టుకున్న చీర రంగు.

40 రోజుల్లో డజను కథలు

రచయిత జయామోహన్ నలభై రోజుల్లో ఇన్ని కథలు రాశాడు అంటేనే చాలా ఆశ్చర్యం వేసింది. కానీ కొన్ని కథలు మాత్రమే మెప్పించాయి. 'వంద కుర్చీలు', 'కూటి ఋణం', 'ఏనుగుల డాక్టర్', 'పిచ్చి మాలోకం' కథలు బాగున్నాయి. అయితే అన్ని కథల్లో తమిళ పేర్లు, ప్రాంతాల పేర్లు రావడం గజిబిజిగా అనిపిస్తుంది. మనకు మొదట్లో చెప్పినట్టు ధర్మం ఆధారంగా సాగే కథలు అనిపించినా.. కొన్ని కథల్లో ధర్మాన్ని మీరుతాడు.

ఏనుగులు, జంతువుల భాష తెలిస్తే...

'ఏనుగుల డాక్టర్' కథ మాత్రం చాలా ప్రత్యేకం. అక్కడక్కడా గుర్రాలను, ఒంటెలను, ఏనుగులను మనుషులు సరదాగ ఎక్కించి తిప్పే యంత్రాల్లా వాడతారు. వాటికి తిండి ఉండదు, బక్కచిక్కి ఎముకలు బయటికి కనిపిస్తూ ఉంటాయి. వాటి స్వేచ్ఛకు.. బయట వాటితో పదీ పరకకి చేయించే పనులు.. కాసేపు విషాదం మన నెత్తి మీద విలయతాండవం చేసినా.. మనమేం చేయలేం కాబట్టి తర్వాత మర్చిపోతాం. పేజీలు ఎక్కువ ఉన్నాయని పుస్తకానికి ఎక్కువ డబ్బులు పెట్టినట్టు ఉన్నరు. దానికి బదులు కథలు అలాంటివి అని చెప్పాల్సింది. మరిన్ని పుస్తకాలు మీ సంస్థ నుంచి రావాలని "ఛాయ" పబ్లికేషన్ వారిని కోరుకుంటూ...

పుస్తకం: నెమ్మినీలం

పేజీలు: 432

వెల : రూ. 450

ప్రతులకు: ఛాయ పబ్లికేషన్స్


సమీక్షకురాలు

-రాజీ కన్నా

Tags:    

Similar News