సూర్యపుత్రి శాంతించు..

poem

Update: 2023-07-16 18:30 GMT

యమునా నీవే కాలం..ప్రవహించు కలకాలం

ఢిల్లీ అనుసంధానమైనది బంధం విడదీయరానిది

ఇన్నాళ్లూ

ఉన్నత శిఖరం మీద కూర్చోబెట్టి

పాతాళానికి తోస్తావా, ప్రాణాలే తీస్తావా

ఎప్పుడూ లేనంత, ఎన్నడూ చూడనంత

ఉగ్రం..మహోగ్రం

జలమంటే,

సంక్షోభం తరిమేది, సంక్షేమం కోరేది

సగటు జీవికి గాసమై

సామాన్య రైతుకి జీవన గానమై నిల్చేది

కానీ.. హద్దులు విరిచేసుకొని

సరిహద్దులు చేరిపేసుకొని వురకలెత్తితే

నదీ ధర్మం విస్మరించి ఉదధి రూపం దాల్చితే

నిలువగలమా

విరామం లేకుండా మేఘాలు

కురిసి వుండొచ్చు

అధిక వర్షపాతం నమోదై ఉండొచ్చు

వొళ్ళువిరిచినా తుళ్ళిపడినా పరవళ్ళు తొక్కినా

నియమబద్ధంగా శాంతియుతంగా సాగాలి

కుండపోత వల్లనో ప్రకృతి విపత్తుగానో

నీలో.. వికృతం నీడ చూడకూడదు

విధ్వంసం క్రీడ ఆడకూడదు

జనజీవితం చిధ్రమవుతుంది చూడు

జనజీవనం చిన్నాభిన్నమవుతుంది నేడు

పట్టింపు వద్దు..రెట్టింపు వద్దు

శాంతించు.. సూర్యపుత్రీ శాంతించు

కరుణించు.. ఈ ధరిత్రిపై కరుణించు

కోటం చంద్రశేఖర్

9492043348

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం