చిక్కని చిరునామా

poem

Update: 2023-06-25 18:30 GMT

కాలం ఎంత గొప్పది

మాట్లాడకుండా మనతో మాట్లాడించి

మంచిగా నటిస్తూ..మౌనంగా నడుస్తూ

తప్పులని చేయించి ...చిక్కులతో బిగించి

ఎన్ని ప్రశ్నలనో విధించి

శిక్షలను ప్రేమించే విధంగా చేస్తుంది...

తాను కనిపించకుండా లోపల అనిపించి

ఒకే ఒక్క రోజు తన రూపాన్ని

మనలో మనకే చూపి

చిక్కుముడిలా చిక్కని చిరునామాతో

పక్క పక్కనే ఉంటూ

ఎక్కడి నుండో వినిపిస్తోంది

విచిత్రంగా....

తీపిగా పుట్టి చేదుగా పెరిగి

చప్పగా గడిచి మధురంగా తోచి

ఎప్పటికప్పుడు ఏదో పరీక్ష..

జవాబులు ఒప్పుకోదు..

తాను జవాబు చెప్పదు.

ఒక్కొక్కరి నుదుటిపై ఒక్కో రంగు రాత

ఒక్కొక్కరి బతుకులో ఒక్కో నాటకం

ఏ ఒక్కరూ చెప్పలేని వింత

ఏ విధంగా తోచని విధి కాలం

చందలూరి నారాయణరావు

97044 37247

Tags:    

Similar News