చత్వారపు కళ్ళజోడు
అక్టోబర్ 1 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ శైలజ మామిడాల కవిత్వం
చత్వారపు కళ్ళజోడు
----------------------------
నాకు నిరంతరం దారి చూపించే
నా చత్వారపు కళ్ళజోడు
ఎల్లవేళలా వెన్నుదన్నుగా ఉండి
నన్ను నడిపించే నా చేతికర్ర!
అలసినప్పుడు నన్ను
సేదతీర్చే నా వాలుకుర్చీ!
కష్టాలలో, కన్నీళ్ళలో ధైర్యం చెప్పి
మార్గనిర్దేశనం చేసిన
నా పాత భగవద్గీత పుస్తకం!
అప్పుడప్పుడు ఎగసిపడిన భావావేశాలను
తెల్లకాగితంపై పెట్టడానికి
సహకరించిన నా పత్తిపెన్ను !
ఇవంటే ప్రాణం నాకు!
ఎందుకంటే
జీవిత పర్యంతం వాటిని
నేను అంటిపెట్టుకొని ఉన్నా
ఆధారపడి ఉన్నా
ఏనాడూ అవి నన్ను ఏవగించుకోవు
ఏరు దాటాక తెప్ప
తగలేసిన చందంగా
నన్ను వీధిపాలు చేసి
వదిలించుకున్న నా కన్నబిడ్డల్లా!
(అక్టోబర్ 1 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం)
డాక్టర్ శైలజ మామిడాల,
హనుమకొండ.
99850 19167