అనువాదం గొప్ప అనుసృజన
Introduction of IRUGU PORUGU book Translated by Varala Anand
భాషా, సంస్కృతులు తమదైన శూన్యంలో పుట్టవు, పెరగవు. కవులూ రచయితలూ అంతే. తమదైన స్వీయ సృజనతో పాటు ఇతర భాషలను చదవడం నేర్చుకోవడం, ఆయా భాషల్లో సాహిత్యాల్లో వస్తున్న సృజనాత్మక మార్పుల్ని గమనించడం వారికి అనివార్యమయిన అధ్యయనం. దీంతోటే భాషాభివృద్ధితో పాటు సాహిత్యాభివృద్ధి సాధ్యమవుతుంది. కేవలం కొన్ని గంటలు ప్రయాణం చేసి చూస్తేనే కొత్త భాష వినిపించే మన దేశంలో భాషా సాహిత్యాల మధ్య ‘ఆదాన్ ప్రదాన్’ అత్యంత ముఖ్యమైనది. అది సాధ్యం కావడానికి ఆయా భాషల నడుమ అనుబంధం వాటి మధ్య అనువాదం అత్యంత అవసరమైన ప్రక్రియ. అట్లని అనువాదం కేవలం భాషానువాదం కాదు. అది మొత్తంగా ఆ ప్రాంత జనజీవన సాంస్కృతిక ప్రతిబింబమై ఉండాలి. అందుకే అనువాదం అన్నది గొప్ప అనుసృజన. రెండు భాషలకూ, రెండు వ్యక్తీకరణలకూ, రెండు సంస్కృతులకూ నడుమ ‘అనువాదం’ ఓ అక్షరాల వారధి. అది ఓ గొప్ప భావానుబంధం. సమస్త మానవాళి జీవితాల్నీ, జీవనానుభవాల్నీ ఏకం చేసే ఓ సాంస్కృతిక వేదిక. అందుకే సాహిత్య చరిత్రలో అనువాదకుడి పాత్ర విలక్షణమయింది, విశిష్టమయిందీ కూడా.
భాషానువాదం జీవితంలో భాగమై..
‘ఇన్నేళ్లుగా కళాత్మక సినిమా, కవిత్వమూ అంటూ తిరిగిన నిన్ను ఈ అనువాదం ఎట్లా ఆకర్షించింది, ఏందీ కథ’ అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. తాను అట్లా అడిగే సరికి అవును కదా అని నేనూ ఆలోచనలో పడ్డాను. నా మాతృభాషకూ ఇతర భాషలకూ ఎట్లా కుదిరింది ఎక్కడ మొదలయింది అని నా గతంలోకి వెళ్ళాను. నా చిన్నప్పుడు చుట్టూ అందరూ వున్నా తీవ్రమైన ఒంటరితనంతో మా అమ్మా నాన్నే లోకంలా గడిపాను. మా ఇంటికి ఎదురుగా వున్న విజయలక్ష్మి హోటల్లో ఒక రేడియో వుండేది. అందులో ఎక్కువగా హిందీ పాటలే పెట్టేవాళ్లు. మానాన్న వాళ్ళ మిత్రులు అక్కడ ఆ పాటల్ని వింటూ పాడుతూ వుండేవాళ్లు. నేను కొంచెం ఎదిగే సమయానికి నాకు గుర్తున్న మేరకు, మా నాన్న వారాల అంజయ్య వృత్తిరీత్యా ఉపాధ్యాయుడే అయినప్పటికి హిందీ పాటలన్నా, ఉర్దూ పుస్తకాలన్నా బాగా ఇష్టంగా వుండేవాడు. తాను స్వయంగా గొంతెత్తి పాటలు పాడేవాడు. తలత్ మహమూద్, నటుడు దిలీప్ కుమార్ అంటే ఆయనకి బాగా ఇష్టంగా వుండేది. ఒకరోజు ‘ఏ హవా ఏ రాత్ ఏ చాందినీ, తేరీ అదాపే నిసార్ హై’ అంటూ నాన్న పాడటం విని అట్లా అంటే ఏంది నాన్నా అర్థం ఏంటి అని అడిగాను. ఆయన నవ్వి ఒక్కో పదానికి తెలుగులో అర్థం చెప్పడం మొదలు పెట్టాడు. నాకు కొంచెం అర్థం అయ్యి కొంచెం కాలేదు. అవి హిందీ లోంచి నా మాతృభాష తెలుగులోకి నేను నేర్చుకున్న మొదటి మాటలు, పాఠాలు. ఇవన్నీ అర్థం కావాలంటే హిందీ బాగా చదవాలిరా అన్నాడు నాన్న.
అప్పటికి భాషల గురించి నాకు వేరే ఏమీ తెలీదు. కానీ వేరే ఒక భాషలోని మాటల్ని అర్థం చేసుకోవడానికి వాటిని మన మాతృభాషలోకి మార్చుకోవాలని అనిపించింది. బహుశా నేనే కాదు అందరూ వేరే ఇతర భాషను అర్థం చేసుకోవడానికైనా తప్పకుండా తమ మాతృభాషలోకి మార్చుకోవాల్సిందే. ఖుషీ అనగానే సంతోషం అనీ, సాడ్ అనగానే దుఖం అనీ తెలిసిపోతుంది. అదంతా లోపల మనకు తెలియకుండానే అప్రయత్నంగానే జరిగిపోతుంది. కొత్త భాషను అర్థం చేసుకునే క్రమంలో జరిగే మేధోపరమైన సమన్వయం అది. అదంతా అప్పుడు తెలీదు. కానీ మా ఇంట్లో రేడియోలో ‘శ్యామే ఘంకీ కసమ్’, ‘తు కహే అగర్’, ‘సుహానా సఫర్’ ఇట్లా అనేక పాటలు వచ్చేవి. నాన్న పాడుతూ వుండేవాడు. వాటితో పాటు ప్రతి బుధవారం బినాకా గీత్ మాల, ప్రతిరోజూ వచ్చే పురానీ ఫిల్మోకా గీత్....అట్లా అన్నీ హిందీ పాటలే. దాంతో నేను హిందీ నేర్చుకోవడానికి స్కూల్లోనూ కాలేజీలోనూ సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నాను. అకడెమిక్ ప్రోగ్రామ్‌లో భాగంగా కొంత ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. అట్లా స్కూలు ముగిసే సరికి మూడు భాషల పరిచయం కలిగింది. తర్వాత సైన్స్ చదువుకోవడం ఉద్యోగంలో చేరడం అన్నీ జరిగి పోయాయి. సాహిత్యంతో పరిచయం వున్నప్పటికి ఎప్పుడైతే ఆర్ట్ సినిమా వైపు ఆసక్తి పెరిగిందో అపుడు ఈ అనువాదం నాకు తెలీకుండానే వచ్చేసింది.‘పథేర్ పాంచాలి’ చూడాలంటే బెంగాలీ రాదు, సబ్ టైటిల్స్ పైన ఆధారపడాల్సిందే. అంటే బెంగాలీ మాటల్ని ఇంగ్లీష్‌లో చదివి తెలుగులో అర్థం చేసుకోవాలి. బెంగాలీ మాత్రమే కాదు కన్నడ, మరాఠీ, తమిళ్, మలయాళం ఏ ఇతర భాషా సినిమా చూడాలన్నా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌పై ఆధారపడ్డమే. అట్లా భాషానువాదం జీవితంలో భాగమైపోయింది.
వివిధ భాషల కవిత్వం అందించేందుకు..
2014 తర్వాత సంస్థలు, సభలు, నిర్వహణ కార్యక్రమాలు మానేశాక సాహిత్యమే జీవితమైపోయింది. ఆ క్రమంలో తెలుగు కవిత్వమే కాకుండా వివిధ భాషల సాహిత్యం ముఖ్యంగా కవిత్వం చదవడం అలవాటయింది. ‘ఇండియన్ లిటరేచర్’ లాంటి పత్రికల్ని పదేళ్లుగా క్రమం తప్పకుండా అధ్యయనం చేస్తూ వస్తున్నాను. దాంతో పాటు నాకు దశాబ్దాలుగా ఇష్టమైన గుల్జార్‌ను ఫాలో అవడం మొదలు పెట్టాను. జావేద్ అఖ్తర్, సచ్చిదానందన్, జయంత్ మహా పాత్ర, గిరీష్ కర్నాడ్ ఇట్లా అనేక మంది రచనల్ని చదువుతూ వచ్చాను. ‘తెలియంది తెలుసుకోవడం, తెలిసింది పంచుకోవడం మొదటి నుంచి నాకున్న అలవాటు’ నేను చదివిన కవితల్లోంచి నాకు నచ్చిన వాటిని తెలుగులో రాసుకోవడం మొదలు పెట్టాను. ముఖ్యంగా ఏదైనా ఒక కవిత చదివినప్పుడు అరె ఎంతబాగా రాశారు. ఇది నేను రాసి వుంటే ఎంత బాగుండేది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా దాన్ని అనువదించే ప్రయత్నం చేశాను. అప్పుడు గుల్జార్ కవిత్వాన్ని ఆకుపచ్చ కవితలు పేర తీసుకొచ్చాను. అదే క్రమంలో మన తెలుగు వాళ్ళకి ఇరుగు పొరుగు భాషల్లో కవిత్వం ఎట్లా వస్తున్నది. అక్కడి కవులు ఏమి రాస్తున్నారు, ముఖ్యంగా వర్తమాన కవుల రచనలు ఎట్లా ఉన్నాయి వాటిని పరిచయం చేయాలనుకున్నాను. రూపంలో సారంలో ఆయా భాషల్లో కవిత్వం ప్రత్యేకతలు ఏమిటి అవన్నీ తెలియాలంటే వాటిని తెలుగులోకి అనువాదం చేసి అందించాలనుకున్నాను. ఆ క్రమంలో గుల్జార్ చేసిన ‘ ఎ పోయెం ఎ డే’ నా కంట పడింది. అది నాకు పెద్ద ప్రేరణ. ఆ క్రమంలోనే కె. సచ్చిదానందన్ సంపాదకత్వంలో వచ్చిన అనేక సంకలనాల్ని తెప్పించుకుని చదివాను. వాటితో పాటు కాశ్మీర్‌కు చెందిన అఘా షాహిద్ అలీ, కెనడాలో వుంటున్న రూపి కౌర్, జయంత మహాపాత్ర, అస్సాంకి చెందిన నీలీం కుమార్ ఇట్లా వివిధ భారతీయ భాషలకు చెందిన కవుల సంకలనాల్ని చదివాను. ఇలాంటి కొన్ని కవితలు అనువాదం చేసి ‘ఇరుగు పొరుగు’ పేర ఓ సంకలనం రూపొందించాను మిత్రమా అనగానే
కాసుల ప్రతాప్ రెడ్డి స్పందించి ఆసియా నెట్ లో వారం వారం వేద్దాం అన్నాడు. ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ ఎంతో సహకరించారు. దాదాపు రెండేళ్లకు పైగా అది కొనసాగింది. తర్వాత వివిధ పత్రికల్లో, ఆన్లైన్ మేగజైన్స్‌లో, సోషల్ మీడియాలో నేను చేసిన అనువాద కవితల్ని ప్రచురిస్తూనే వున్నాను.
దేశంలో అధికారికంగా 22 భాషలు ఉండగా, లిఖిత మౌఖిక భాషలు ఎన్నో ఉన్నాయి. నేను ఇప్పటికీ 29 భారతీయ భాషల నుంచి 90 మందికి పైగా కవులు రాసిన కవితల్లోంచి 150కి పైగా కవితల్ని అనువదించి ఈ సంకలనంలో చేర్చాను. ఈ ‘ఇరుగు పొరుగు’లో వున్న కవితలన్నీ నేను చదివినవి, నాకు నచ్చినవి, నేను అందరితో పంచుకోవాలనుకున్నవి మాత్రమే. ఈ ‘ఇరుగు పొరుగు’ నా నిరంతర అనుసృజనా ప్రక్రియ. ఆ క్రమంలో ఇది ఇరుగుపొరుగు మొదటి సంపుటి. నా స్వీయ కవితా రచనతో పాటు అనువాదం కూడా కొనసాగుతుంది.
వారాల ఆనంద్
94405 01281