అంతులేని దుఃఖం ... 'ఆఖరి వడ్లగింజలు'

Akari vadlaginzalu Book Review

Update: 2024-09-02 17:27 GMT

‘‘వర్షాలు పడక, నదిలో పారుతున్న నీళ్లు అందక, పంటలు ఎండిపోయి, ‘ఆఖరి వడ్ల గింజలు’ మిగిల్చిన దు:ఖం! ఆ ఆఖరి వడ్ల గింజల్ని చూస్తూ, ఆకు ఆకులో అగ్నికణాలను మోస్తూ, తల బాదుకుంటూ భోరున ఏడ్చింది చెట్టు. అడవి కష్టాల నుంచి కాపరులను పారిపొమ్మని గొర్రెలు కూడా ఒర్లుతున్నాయ్. మనిషిని కావలించుకుని తనివి తీరా ఏడుద్దామన్నా మనిషే దొరకని దు:ఖం. ఎండిపోయిన చెరువంత దు:ఖం. గల్ఫ్‌లోని ఉరికొయ్యలకూ, ఊర్లలోని చెట్టు కొమ్మలకూ వేలాడే శవాలు మిగిల్చిన దు:ఖం. మిత్రమా.. దు:ఖం ఒక తిరుగుబాటు. దు:ఖం ఒక ఆయుధం. దు:ఖం ఒక విప్లవం’’ గీతాంజలి రాసిన పాలమూరు వలసబతుకులు-’ లోని ‘ఆఖరి వడ్ల గింజలు’ కథాసంకలనంలో ఉన్న ఈ కవితా చరణాలు ఈ కథల ఆత్మను పట్టిస్తాయి. రెండు పెద్ద కథలు, రెండు కవితలు, ఒక నవలిక, ఒక నాటిక ఏది కదిలించినా పాలమూరు వలస బతుకులు బొలబొలా ఏడుస్తాయి!

‘ఆఖరి వడ్ల గింజలు’

‘‘గా సర్కరోనికి గుడక మా భూమి గుంజుకునే అధికారం లేదు. సచ్చెదంక నా భూమి కోసం ఒర్లుతనే ఉంట’’ అంది యాదమ్మ. ఈ కథా సంకలంలోని ‘ఆఖరి వడ్ల గింజలు’ కథ పోలేపల్లి సెజ్ బాధితుల ఆక్రోశానికి అద్దం పట్టింది. ‘‘నీ పశురాలను కాలుస్తున్నరబ్బా, నీ కొడుకు ఆడెక ఉర్కిండు’’ మొగిలమ్మకు పెంటయ్య చెప్పిండు. ‘‘భూమి గుంజుకుని నా మొగున్ని సంపిండ్రు, గిప్పుడు గీ జీవాల్ని గూడక్క సంపుతుండ్రు. గీ బాడ్కవ్ సర్కారు కెవలు నిప్పు పెట్టల్ల?’’ అన్కుంట ఊరిదిక్కు ఉర్కింది మొగిలమ్మ. మొగిలమ్మ పోయేటప్పటికి నాలుగు బర్రెలు చచ్చిపడున్నయ్. వాట్ని చూస్త మొగిలమ్మ ముగ్గురు కొడ్కులు బిడ్డె ఎక్కెక్కి ఏడుస్తున్నరు. ‘సర్కారు భూముల తీస్కుంటున్నది. మీరు గిన పట్టా కాగితాలు ఇచ్చి ఈ పైసలు తీస్కోక‌వోతే గీ ఇంత పైసలు గుడ్క ఇయ్యకుండ పుఖట్క తీస్కుంటది’ అని బెదిరిచ్చి ముంచిండు గీ కొడ్కు’’ అంది మొగిలమ్మ సర్పంచ్ గురించి. ‘‘తమ ఊర్ల గుంజుకున్న ఎకర ఎకరకు వీనికి అరవై నుంచి డెబ్బై వెయిలు వచ్చనయ్యంట. తమకేమో ఎకరాకు మెట్టు మెట్టుకు తిన్నంక, మూడు నాలుగు వెయిలు గుడక మిగల్లె.’’ గుంజుకోవడం వల్ల భూమితో ముడిపడిన బతుకులకు వారి జీవితాల్లో ఏర్పడిన ఘర్షణను ఈ కథలో గీతాంజలి చిత్రించారు. మొగిలయ్యకు తనింట్ల మిగిలిన ఆఖరి వడ్ల గింజల బస్త కండ్ల ముంగట కనవడి గుండె బరువెక్కింది. ‘‘గవ్వి మీ నాయన నిశానీరా..అయినగని ఇత్నాలకు కావద్దురాబ్బ మల్ల చెల్కల నాటనీకి, ఉండనీ’’ అంది మొగిలమ్మ. ‘‘నీ పిస గానీ బూమి యాడుందనబ్బ, ఇత్నాలు తీస్కవోతున్నవు మొగులమ్మొదినే?" జంగయ్య జాలి నిండిన కండ్లతోని అన్నడు.

గొర్రెలు

‘‘నేను పోనంటె పోనబ్బ, ఇక్కడ్నే ఉంట. సచ్చిన అడవికి వోనింగ. నా కాలుల ఎట్ల కొచ్చగైనయి సూడు, అడవిల గుట్టలెక్కి నా కాళ్లు ఎట్ల పుండు పుండైనయో సూడు. నా తోన కాదు నాయన, నేను వోను ఆడ జంగల్ల నేను సచ్చిన గని మీకు నా ఖబర్ అందది సూడున్రి’’ ఇది ‘గొర్రెలు’ కథలోని వెంకటయ్య కొడుకు కాపరి రాము ఆవేదన. పాలమూరు జిల్లాలో రైతులు పంటలు పండక, ఆసాముల వద్ద చేసిన అప్పులు తీర్చలేక, ఆసామి గొర్రెలను అడవికి తీసుకెళ్లి మేపే రాము అక్కడ అవస్థలు పడలేక పారిపోయి వస్తాడు. గొర్రెల కాపరులను వాటి యజమానులు పెట్టే బాధలు, గొర్రెల కాపరుల కష్టాలను వారి మాటల్లోనే ‘గొర్రెలు’ కథలో కళ్ళకు కట్టినట్టు చూపించారు రచయిత్రి. కిలోమీటర్ల కొద్ది నడుస్త గొర్లను మ్యాపుకుంట పోవల్ల. ఎక్కడ గ్రాసం, నీల్లు ఉంటే, ఆడ గంటల కొద్దీ ఆగల్ల. ఒక్కో తూరి రెండ్రోజుల దంక ఆడనే ఉండుడు. య్యాడాడ దిరిగిండు? పాలమూరు దాటినంక ఎక్కడనో ఉన్న సమ్మక్క సరాలమ్మ అడివిల గుట్ల మీన నడక. ఆసామి కూసోనివ్వడు, నిద్రవోనియ్యడు. పాలేర్లు యామన్న అట్టిట్ల అయిన్ర, కర్రతోనె కొట్టుడే. రెండు నెలలైనంక గొర్లు ఖమ్మం, భద్రాచలం అడవుల్ల తేలినయ్. పాలమూరు కెల్లి యాటూరు నాగారం అడవి సేరేటందుకు మూడు నెలలపైన వట్టింది. గొర్రెల కొచ్చె రోగాలు, వాటికి చిట్కా వైద్యాలు. ‘‘సిగ్గు ల్యాదురా రాము. ఫో గీ దండకారన్యం మద్దెల కెల్లి ఊల్లెకుపో’’ అంటూ గొర్రె అర్సినట్టు రాముకు అనిపించింది. అది రాము మనసులో మాటే. మార్మిక వాస్తవం. ఈ కథలో గొర్రెల కాపరుల జీవితాలను సజీవంగా చిత్రించారు రచయిత్రి.

‘లక్ష్మి’

పాలమూరు జనం బతుకుల్లోని విషాదాల వెల్లువే లక్ష్మి నవలిక. పాలమూరు వలస కథలు రెండు భాగాల్లోని పాత్రలు ఈ నవలికలో రచయిత్రితో మాట్లాడతాయి. తన ఇంట్లో సహాయకురాలుగా పనిచేస్తున్న పాలమూరు బిడ్డ లక్ష్మి జీవన విషాదం ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. పాలమూరులో నీల్లే లేవు. ఎండిపోయిన ఎడారి పాలమూరు. ఈ కథల్లోని పాత్రలు వలసపోతున్నయ్, సచ్చిపోతున్నయ్. ఆడోల్లు లైంగిక వేధింపులకు గురవుతున్నరు. కథలన్నీ చావు కథలై కూర్చున్నయ్. ‘పోలేపల్లి పీనుగను మాట్లాడుతన్న’ కథలో సచ్చిపోయిన పెంటయ్య, తన శవాన్ని వేలాడదీసిన చెట్టు దగ్గరకు తన వెంట రచయిత్రిని తీసుకుని వెళతాడు. అన్ని పాత్రలతో పాటు గొర్రెలు, భూమి, చెట్లు రచయిత్రితో మాట్లాడతాయి.

వలసలాగుతయ్.. ఊల్లేనే ఉంట

తెలంగాణ వచ్చినంక రాచకొండ గుట్టలల్ల ఫిలింసిటీలు, యాదగిరి గుట్టను వాటికన్ సిటీగా మార్చుడు, ఎత్తైన భవనాలు కట్టుడు, పార్కులు కట్టుడు, భూస్వాముల రియల్ ఎస్టేట్ దందకు పిలుచుడు. ‘‘తెలంగాన రాంగనే చెర్వులు నిండుతయ్, నాకు ఊల్లెనే పన్లు దొర్కుతయ్. వలసలాగుతయ్. ఊల్లెనే ఉంట ’’ అనుకుంది లక్ష్మి. కానీ దు:ఖంతోని బొలబొల ఏడుస్త టిప్పరెక్కతాన్న లక్ష్మి రచయిత్రికి కనపడ్డది. తెలంగాణ వచ్చినా మళ్ళీ అదే కరువు, అదే దారిద్ర్యం, టిప్పర్లు ఎక్కి పనులకు గుజరాత్ వెళ్లడం, లక్ష్మి తిరిగి వస్తుందో, రాదో? పోలేపల్లి శవం మాట్లాడినట్టుగానే చెరువమ్మ నాటికలో చెరువు తన ఘోషను వినిపిస్తుంది. ఈ కథలో తెలంగాణ ఏర్పడముందున్న జీవితాలు వారి భాషలోనే, వారి యాసలోనే మాట్లాడతాయి. ఈ పదేళ్ళ తెలంగాణా పరిపాలనలో పంటల పరిస్థితి ఏమిటి? ఆత్మహత్యలు తగ్గాయా? వలసలు తగ్గాయా? తగ్గితే అవి ఏ మేరకు అన్న వివరాల కోసం నిజాయితీగా సర్వే జరగవలసిన అవసరం ఉంది.

పరిచయ కర్త : రాఘవ

పుస్తకం : ఆఖరి వడ్ల గింజలు

రచన : గీతాంజలి (డాక్టర్ భారతి)

పేజీలు : 160

వెల : 150

పుస్తకాలకు : గీతాంజలి, 88977 91964


సమీక్షకులు

రాఘవ

94932 26180

Tags:    

Similar News

ఎర్ర శిఖరం!
బుల్డోజరు