ఇపుడు యుద్ధం ముగిసిందనుకొంటే పొరపాటే...
ఇప్పుడిక ఆ ధైర్యం అస్తమించిందనుకొంటే గ్రహపాటే...
యోధుడు కూలినా లక్ష్యం గురితప్పలేదు
వీరుడు ఒరిగినా వీరత్వం తొణకలేదు
తూరుపెందుకో మరీ ఎరుపెక్కింది!
సమరశంఖం తానే ఒక ఘర్జనై ఎగిసి అతడి
గాథలే దిక్కులు పిక్కటిల్లేల పాడుతోంది...
శ్రామిక రైతాంగ బావుటా సీతారాముడి
వీడ్కోలుగా నింగికెగిసి శాల్యూట్ చేస్తోంది..
ప్రజాతంత్ర లౌకికశక్తుల్ని ఏకం చేసిన
అసమాన పోరాట పటిమ శతకోటి
ఎర్ర సూర్య ప్రభలతో ఉవ్వెత్తున ఎగిసిపడి
నింగిన వెలుగై నిలిచింది!
మహోన్నతుడు నేడు భౌతిక కాయమైనా
అతడి స్ఫూర్తి దివ్య నీరాజనాలందుకొంటుంది
లెఫ్ట్‌కు రైటన్న పెద్దన్న నడిచిన బాట...
బడుగు బలహీన వర్గాల పాలిట రాచబాటై
అవిశ్రాంత పోరాట లక్ష్యాల్ని సాధించింది..
ఓ మహానాయకా అందుకో అలుపెరుగని మా
లాల్ సలామ్...లాల్ సలామ్!!
(సీతారాం ఏచూరికి నివాళి)
- భీమవరపు పురుషోత్తమ్
99498 00253