ఆపద వచ్చినప్పుడే
మనిషి ప్రవర్తన మారినట్టు
ఏది శాశ్వతము కాదని
నిజం అప్పుడే తెలిసినట్టు
ఆపదలో చిక్కుకొని
ప్రాణాపాయం తప్పదని తెలిసి
అందరం సమానమే అని
కులమత భేదం ఎందుకని
ప్రాణం మీదికి వస్తే కాని
వాస్తవాలు పలికినట్టు
నీటి బుడగ జీవితం
నిమిషంలో మటుమాయం అంటు
మాటలెన్నో చెపుతాడు
అన్ని చెప్పినా మనిషి
మనసు మాత్రం మారదెందుకో
కరోనా కళ్ళు తెరిపించినా
మనిషి మాత్రం మారలేదు
స్తోత్రం, మంత్రం, జపిస్తే
జీవితాలు మారతాయని
చెప్పేవన్నీ నిజమైతే
వరదలు ముంచెత్తినప్పుడు
ఆస్తినష్టం, ప్రాణనష్టం
జరుగకుండా ఆపాలి
ఏ శక్తి ఆపదని, అంతా అబద్దమని
మనిషికెప్పుడు తెలుస్తుందో....
ప్రకృతి ప్రళయం రూపం
కండ్ల ముందే జరుగుతున్నా
ఏది ఎప్పుడు జరుగుతుందొ
తెలియని మనిషి
ఇంకా నీది నాదని నీల్గుతుండు
వాస్తవం ఏమిటో తెలిసి కూడా
మూఢనమ్మకాల ఊబిలో పడి
నిజాలను నిరాకరిస్తున్నాడు
- నక్క కుమారస్వామి
వంగపహడ్ -హన్మకొండ