తెరిచిన పుస్తకంలో కాలం రాసిన యాది

Yadonki Barath Book Review

Update: 2024-09-15 18:45 GMT

పనిముట్లు ఉంటే వస్తువును శిల్పంగా, కావ్యంగా, దృశ్యంగా, యాదిగా వొంపుకునేదే సృజన. అదో అద్భుత కళ. ఆ తపనలో ఒక శిల్పి, ఒక కవి, ఒక సినీ ఋషి, ఒక రచయిత రాటుదేలడం అద్భుతం. అయితే ఆ కళలన్నీ లలితంగా, అందంగా, సరళంగా, కొలువుదీరిన మనుషుల కృషి బహుముఖీనం. ఐతే దీక్షాదక్షత, నిబద్ధత, అక్షర ప్రేమసేతతో ఒకేచోట పుట్టిన యాది పొత్తమే 'యాదోంకీ బారాత్'.

ఇది ఒక యజ్ఞమే. ఆరాటం, పోరాటం కలిసి పడిలేచిన కెరటాల నదీ ప్రవాహం కూడా. సంగమ సురసంగీత స్వర లహరుల లాహిరి బతుకు యాది. కళల కాణాచి కరీంనగర్ ఒడ్డును చుట్టేసుకున్న అరుదైన పద మంజరి నాట్యం ఇది. అమూర్తత్వమైన గనిని తొలిచిన కవి కలం నడకే పూల రేకుల బతుకు తోట. ఆ తొవ్వలో వారాల ఆనంద్ కృషి ఎంతగానో కొనియాడదగ్గది. ఇక పిలుస్తున్న ఈ పుస్తకంలోకి సాగే కళ్ళకు వినిపించే కథనం ఓ సంగీత విభావరి. అదే భావోద్వేగాల పొక్కిలి తాకిన నది గలగలల మానేరు. జ్ఞాపకాల బారాత్‌లో ఈదాక తడిలేని పొడితో బయటపడడం అంత సులభం కాదు. అదే ఆనంద్ రచనలో మనకు తెలియని రహస్యం. అక్షరాల మహత్తు.

తన జ్ఞాపకాల పుస్తకంలో..

ఇక తెలంగాణ వైతాళికుడు కాళోజీ నా గొడవ కవితలో చెప్పారిలా... 'పుట్టుక నీది/చావు నీది/బతుకంతా దేశానిది' ఇక దీని సారాంశాన్ని పూర్తిగా ఒడిసిపట్టిన తీరున ఆనంద్ యాదోంకీ బారాత్ నడిపిస్తున్నారు. ఇందులో పుట్టుక బతుకు రెండూ జీవాధ్యాయాలే. అందులోనూ కరీంనగర్ మట్టివాసనలే. తిరుగుతున్న కాలం సినిమా రీల్స్. అందులో తారసపడ్డ పాత్రల చిత్రణ మనల్ని తట్టిలేపి చదివిస్తుంది. ఆ పల్స్ ఇంపల్స్ లే ఆనంద్ అంతరంగంలో స్పెషల్. లోతైన సునిశిత ఆలోచనల కాన్వాస్ ఆనంద్ అమేయం. అది సువిశాల జీవసీమ కూడా. తన చుట్టూ బతికిన గాలి తెమ్మెర తను తాకిన గాలి తెరల ఊరేగిన జ్ఞాపకాల పొది ఇది. బడి నేర్పిన బుడిబుడి నడకల పాఠాలు ఈ మెత్తని మట్టి సొంతం. ఉద్యోగసీమ తెరిచిన కిటికీలోంచి వచ్చిందే సినిమా కవిత్వాలనే రెండు కనులు. అదే వారానంద విస్తృత జీవన రూపకం. ఇక నాకూ ఆనంద్‌కూ గల గాఢమైన అక్షర బంధం చక్కగా వివరించారు ఈ పుస్తక పేజీల్లో. దాదాపు మూడు దశాబ్దాల నా యవ్వన జీవితం అంతా నడిచింది కరీంనగర్‌లోనే. అక్కడ వైద్యునిగా సేవచేస్తున్న నాలో మౌనం మాట్లాడింది కవిత్వ సంపుటిని వెలుగీకరించే కృషిలో ఆనంద్ ప్రథముడు. అలాగే ముఖ్యుడు కూడా. ఎంత వత్తిడివున్నా అనుకున్న పనిని పూర్తి చేసిన కమిటెడ్ మిత్రుడు ఆయన. అదే తన జ్ఞాపకాల పుస్తకంలో రికార్డు చేయడం గొప్ప విశేషం. ఇందులో కరీంనగర్ మట్టిగాలి ఆత్మీయ స్నేహం నాట్యం చేసింది. ఆ నాట్యమే నన్ను ఒక కవిగా పిలిచింది. అందుకు ఆనంద్‌కు మరొక్కసారి నా మనసు చెప్పేనీ కృతజ్ఞతలు.

విశాల భారతంలో చేసిన విపంచి యాత్రలా..

కవిగా నిరంతర తపన నాలో పడిలేస్తూ ఉంటుంది. ఒక సినిమాలాగా అనిపించే యాది పుస్తకం కదిలిపోయిన కాలం కథ. ప్రతి పేజీ ఎందరినో కలిసింది. నాలాగే మరెందరినో పలుకరించింది. ఇది ఆనంద్ ఆత్మీయత కురిసిన వాన చినుకుల సోయి. నేనున్న టవర్ సర్కిల్ ఇప్పటికీ ఓ దగ్గరి బంధువులా పిలిచినట్టు గొప్ప అనుభూతి కలిగించింది. ఢిల్లీవాలా స్వీట్ హౌస్ తర్వాత ఆనంద్ స్వీట్ హౌస్ వేడివేడి చాయ్‌తో కలిగిన రిఫ్రేష్ ఇంకా నాలో తడితడిగా ఫ్రెష్‌గా ఉంది. అలాగే ఎస్‌ఆర్ఆర్ కాలేజీ లైబ్రరీలో నేను పొందిన సేవలు కూడా ఇంకా నాతో మాట్లాడినట్లు నా మనసు స్థితి. అనేకానేక సాహిత్య కార్యక్రమాల్లో మేము ప్రేక్షకులుగానో వేదికపై గెస్టులలాగానో కరచాలనం చేసిన సందర్భాలు పొదువుకున్న యాది ఇది. మమత టాకీస్‌లో ఒక ఉదయం పూట నాటి కలెక్టర్ పార్థసారథి గారితో కలిసి డాక్యుమెంటరీ పిక్చర్ చూసిన సందర్భం గుర్తొస్తుంది. మొత్తంగా విశాల భారతంలో చేసిన విపంచి యాత్ర రికార్డులా ఉంది. ఇది మజిలీల కేంద్ర బిందువులో వెలిగే సుదీర్ఘ కవితా వాహిని కూడా.

గడిచిన కాలాన్ని ముందుకు తిప్పిన

డా.చారిగా, చారి సార్‌గా జన బాహూళ్యంలో పిలువబడ్డ ఒక వైద్యునిగా నా సేవలు పొందడమే నా వృత్తికీ నాకూ ప్రత్యేక గౌరవం. అలాంటి నన్ను రచయిత ఆనంద్ నాన్న అంజయ్య గారికీ వాళ్ల కుటుంబానికి ఉడతాభక్తిగా అందించిన నా సేవలనూ యాదిలో భద్రపరచిన తీరు, ఫోటో అనుబంధంలో డా.చారి ఫొటోను చేర్చిన వైనం ఒక చరిత్ర. ఇక కవిత్వం సంగతి... అది నడిపించిన యాది కూడా గొప్పదే. వాటి గుర్తులు మరుపురానివి. మధురమైనవి ఎంతో అందంగా కూడా ఉన్నవి. ఇదొక ఒక మంచి వర్తమాన ప్రయత్నం. గడిచిన కాలాన్ని ముందుకు తిప్పిన గోడ గడియారం అలారం గంటలు చెవులలో రింగు రింగు మనడం చెప్పలేని హాయీ. ఇదే ఆనంద్‌లోని సోయి. ఇది ఎంత గొప్పది. తన పని తాను చేసుకుంటూ కదలడమే మౌనం. అది ఎంత గొప్పదో ఆనంద్ లాంటి రచయితలకే తెలిసేది. ఇలాంటి సృజనలెన్నో ఇంకా ఆనంద్ కలం నుండి ఆశిస్తున్న ఆశల జీవాక్షరం.

పుస్తకం

యాందోకి భారత్

వారాల ఆనంద్

పేజీలు 275. వెల రూ. 250

ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలలో లభ్యం


పరిచయకర్త

డా.టి.రాధా కృష్ణమాచార్యులు

98493 05871

Tags:    

Similar News

ఎర్ర శిఖరం!
బుల్డోజరు