వైన్స్ ముందు జనం.. వెనుక నుంచి బ్లాక్ దందా!

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల పాటు అనూహ్యంగా లాక్డౌన్ విధించడంతో మందుబాబుల ముందు చూపు ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ లిక్కర్ వ్యాపారుల ముందు చూపు ఉన్నట్టుగా తెలుస్తోంది. లాక్డౌన్ ప్రకటన వెలువడగానే వందల సంఖ్యలో వైన్ షాపుల ముందు జనం మద్యం కొనుక్కునేందుకు బారులు తీరిన తీరు అందరినీ ఔరా అనిపిస్తోంది. కానీ వీరి మాటున జరుగు తున్న మరో దందా మాత్రం ఎవరి కంటా కనపడటం లేదు. డెన్‌లోకి […]

Update: 2021-05-11 09:03 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల పాటు అనూహ్యంగా లాక్డౌన్ విధించడంతో మందుబాబుల ముందు చూపు ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ లిక్కర్ వ్యాపారుల ముందు చూపు ఉన్నట్టుగా తెలుస్తోంది. లాక్డౌన్ ప్రకటన వెలువడగానే వందల సంఖ్యలో వైన్ షాపుల ముందు జనం మద్యం కొనుక్కునేందుకు బారులు తీరిన తీరు అందరినీ ఔరా అనిపిస్తోంది. కానీ వీరి మాటున జరుగు తున్న మరో దందా మాత్రం ఎవరి కంటా కనపడటం లేదు.

డెన్‌లోకి వెళ్లిన స్టాక్..

లాక్‌డౌన్ ప్రకటన వెలువడగానే జనం మద్యం కోసం వైన్ షాపుల ముందు గుమిగూడారు. దీంతో అప్పటివరకు ఖాళీగా కనిపించిన వైన్‌షాపు కౌంటర్లన్నీ జనంతో కిటకిటలాడాయి. అయితే జనం కొన్న లిక్కర్ కన్న ఎక్కువ స్టాక్ డెన్‌లలోకి చేరిపోయినట్టుగా తెలుస్తోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న వ్యాపారులు పెద్ద ఎత్తున మద్యాన్ని సీక్రెట్ పాయింట్లలోకి చేర్చినట్టు ప్రచారం జరుగుతోంది.

ఫస్ట్‌వేవ్ ఆదర్శం..

ఫస్ట్ వేవ్ సమయంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మందు బాబులకు మద్యం దొరకక నరకయాతన పడ్డారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు మూడు రెట్లకు ధరలు పెంచి విక్రయాలు జరిపారు. అయినా, మద్యం ప్రియులు అడ్డగోలు డబ్బులు చెల్లించి మద్యం కొనుగోలు చేయడంతో వారి పంట పండిందనే చెప్పాలి. అప్పటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న లిక్కర్ వ్యాపారులు గుట్టుగా మద్యాన్ని దాచి పెట్టి నో స్టాక్ బోర్టు పెట్టేశాయి. కోట్ల రూపాయల విలువ చేసే మద్యం నల్ల బజారుకు తరలిపోయినట్టుగా తెలుస్తోంది. రేపటి నుండి వ్యాపారుల ఏజెంట్లు రంగంలోకి దిగి లిక్కర్ ధరలు పెంచే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వం మద్యం అమ్మకాలకు కూడా నాలుగు గంటల పాటు అనుమతి ఇచ్చినప్పటికీ చాలా షాపుల్లో లాక్‌డౌన్ మొదటి రోజునే నో స్టాక్ బోర్డులే కనిపించే అవకాశం ఉంది.

రూరల్ లిక్కర్ షిప్ట్..

గ్రామీణ ప్రాంతాల్లోని వైన్ షాపుల నుండి పెద్ద ఎత్తున లిక్కర్ పట్టణ ప్రాంతాలకు తరలించేందుకు సిండికేట్ మాఫియా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో అయితే ఎక్కువ ధర పలుకుతుందని దీంతో తమ పంట పండుతుందన్న యోచనతో లిక్కర్ వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా రూరల్ ఏరియా నుండి అర్బన్ ప్రాంతాలకు మద్యాన్ని తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Tags:    

Similar News