Women's Health : మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే హెల్త్ ఇష్యూస్ ఇవే.. కారణం ఏమిటంటే..
అనారోగ్యాలు అందరికీ వస్తుంటాయి. కానీ జీవనశైలి, ప్రత్యేక పని పరిస్థితులు, మానసిక ఒత్తిడి వంటివి పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సందర్భాలు కూడా చాలానే ఉంటున్నాయి. దీంతో కొన్ని రకలా అనారోగ్య సమస్యలు మహిళలకే ఎక్కువగా సంభవిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.
దిశ, ఫీచర్స్: అనారోగ్యాలు అందరికీ వస్తుంటాయి. కానీ జీవనశైలి, ప్రత్యేక పని పరిస్థితులు, మానసిక ఒత్తిడి వంటివి పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సందర్భాలు కూడా చాలానే ఉంటున్నాయి. దీంతో కొన్ని రకలా అనారోగ్య సమస్యలు మహిళలకే ఎక్కువగా సంభవిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎక్కువమంది స్త్రీలు ఇప్పటికీ గృహస్థులుగా ఉంటున్నారు. ఒకవేళ ఉద్యోగం, ఇతర స్వయం ఉపాధి పనులు చేస్తున్నప్పటికీ ఇంటి పనులు కూడా చేసుకుంటూ ఉంటారు. వంట చేయడం మొదలు పిల్లల్ని బడికి పంపడం, అందరికీ బాక్సులు ప్రిపేర్ చేయడం, కుటుంబ బాధ్యతలన్నీ నిర్వహించడం చేస్తుంటారు. ఎంతలా అంటే అందరికోసం పనులు చేస్తూ, ఆలోచిస్తూ తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకునే తీరిక లేనంతగా నేటి ఆధునిక స్త్రీ కూడా అలసిపోతోంది. కాబట్టి కొన్ని వ్యాధులు వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.
75 శాతం రక్తహీనత
ప్రస్తుతం మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో రక్తహీనత ప్రధానంగా ఉంటోందని నివేదికలు పేర్కొంటున్నాయి. మన దేశంలో 75 శాతం మంది మహిళలు ఐరన్ లోపం లేదా రక్తహీనతతో బాధపడుతున్నట్లు ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే ఇక్కడ ఇదొక సాధారణ సమస్యగా ఉంది. పురుషులకంటే మహిళలే ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. సరైన పౌష్టికాహారం అందని పరిస్థితి కొందరిదైతే.. ఇంటి బాధ్యతలు నెరవేర్చే క్రమంలో సమయానికి తినకపోవడం, తమ ఆరోగ్యంకంటే భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత ఇవ్వడం వంటివి ఇందుకు కారణం అవుతున్నాయి. ఇక దీంతోపాటు నెలసరి సమయంలో అధిక రక్త స్రావం, చిన్న వయస్సులోనే గర్భధారణ వంటివి కూడా రక్తహీనతకు దారితీస్తుంటాయి.
చెస్ట్ క్యాన్సర్
మహిళలు చాలా సఫర్ అవుతున్న హెల్త్ ఇష్యూస్‌లో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఈ సమస్యను ఎదుర్కొంటుండగా మన దేశం మూడవ స్థానంలో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆరోగ్యంపట్ల అవగాహన తక్కువగా ఉండటం.. రొమ్ము భాగాల్లో అసౌకర్యాలు, ఇబ్బందులు బయటకు చెప్పే అంశాలు కావనే పితృస్వామిక భావజాలం వంటివి రొమ్ము క్యాన్సర్లు చివరి దశకు వచ్చే వరకు చాలా మంది గుర్తించలేకపోతున్నారు. ప్రారంభంలోనే గుర్తిస్తే తగిన చికిత్స అందించడం ద్వారా బయటపడే అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కువగా సమస్య అధికం అయ్యాకనే ఈ కేసులు బయడపడుతున్నాయి.
మెంటల్ హెల్త్
పురుషులతో పోలిస్తే ఇండియాలో మహిళలే ఎక్కువగా మానసిక అనారోగ్యాలను ఎదుర్కొంటున్నారు. చిన్నప్పటి నుంచే మహిళలు ఒక విధమైన కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతో అణచి వేతకు, వివక్షకు గురికావడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, హింస, పెద్దయ్యాక కూడా వేధింపులు, గృహ హింస, సామాజిక ఒత్తిళ్లు.. చివరికి కుటుంబాల్లో కూడా భావోద్వేగా మద్దతు లభించకపోవడం వంటివి మహిళల్లో మానసిక రుగ్మతలకు కారణం అవుతున్నాయి.
ఆస్టియోపోరోసిస్
నిజానికి ఎముకలు బలంగా ఉండాలంటే శరీరంలో తగినంత కాల్షియం ఉండాలి. కానీ ప్రస్తుతం చాలామంది మహిళలు ఈ లోపాన్ని ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు ఇతర పోషకాలు కూడా తగినంతగా తీసుకోకపోవడం ఫలితంగా ఆస్టియో పోరోసిస్ వంటి బోలు ఎముకల వ్యాధి బారిన పడుతున్నారు. మహిళలకే ఇలాంటి సమస్యలు ఎక్కువగా రావడానికి సామాజిక, ఆరోగ్య, ఆర్థిక కారణాలు ఉన్నాయి. కుటుంబం మొత్తానికి తగిన సేవలు అందించే పనుల్లో నిమగ్నం అయ్యే గృహిణులు తమ ఆరోగ్యం గురించి పట్టించుకునేందు తగిన సమయం ఉండకపోవడం, సమయానికి తినకపోవడం, సమస్యలు వచ్చినా వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోకపోవడం వంటివి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా మెనోపాజ్ పీరియడ్ తర్వాత మహిళలు బోలు ఎముకల వ్యాధిని ఫేస్ చేస్తుంటారని ఆరోగ్య నిపుణులు చెప్తు్న్నారు.
*గమనిక:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.