సామాజిక సంబంధాలతో సక్సెస్‌ వైపు.. స్కిల్స్ ముఖ్యమంటున్న నిపుణులు

మీరు జీవితంలో సంతోషంగా ఉండాలంటే శారీరక, మానసిక ఆరోగ్యం మాత్రమే కాదు, ఇతరులతో హెల్తీ కమ్యూనికేషన్స్ అండ్ హెల్తీ రిలేషన్‌షిప్స్ కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.

Update: 2024-07-08 13:56 GMT

దిశ, ఫీచర్స్ : మీరు జీవితంలో సంతోషంగా ఉండాలంటే శారీరక, మానసిక ఆరోగ్యం మాత్రమే కాదు, ఇతరులతో హెల్తీ కమ్యూనికేషన్స్ అండ్ హెల్తీ రిలేషన్‌షిప్స్ కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. దీనిని ఒక హాబీగా మల్చుకుంటే మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని, కోరుకున్న రంగంలో సక్సెస్‌కు కారణం అవుతుందని చెప్తున్నారు. దీనినే సోషల్ వెల్‌నెస్ లేదా సామాజిక ఆరోగ్యంగా, శ్రేయస్సుగా పిలుస్తున్నారు.

మీనింగ్‌ఫుల్ ఇంటరాక్షన్స్

నిజానికి సోషల్ వెల్‌నెస్ వ్యక్తుల మానసిక, శారీరక, భావోద్వేగ ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందని, మెరుగైన సమాజానికి దోహదపడుతుందని, మీరున్న రంగంలో, సామాజిక పరిస్థితుల్లో మీనింగ్‌ఫుల్ ఇంటరాక్షన్‌కు, హ్యాపీనెస్‌కు సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు, రోజువారీ ఒత్తిళ్లను ఎదుర్కోవడంలో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పాజిటివ్‌గా స్పందించడంలో సోల్ వెల్‌నెస్‌గా ఉండటం కీలకపాత్ర పోషిస్తుంది. మీ ఎండోక్రైన్ వ్యవస్థకు, ఆరోగ్యకరమైన కార్డియో‌ వాస్క్యులర్ పనితీరుకు, మెరుగైన రోగ నిరోధక వ్యవస్థకు కూడా దారితీస్తుంది.

డిస్‌కనెక్ట్ నుంచి కనెక్ట్ వరకు

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో టెక్నాలజీతో కనెక్ట్ అయి ఉంటున్నారు. రోజులో ఎక్కువ భాగం దానికే కేటాయించేవారు కూడా లేకపోలేదు. అయితే మీరు సామాజికంగా ఉండాలంటే ఏదో ఒక సమయంలో, ఎంతో కొంతసేపు టెక్నాలజీతో డిస్‌కనెక్ట్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లో నిమగ్నం అవ్వడానికి, సోషల్ మీడియాలో స్ర్కోల్ చేయడానికి ఒక సమయం కేటాయించండి. మిగతా సమయంలో డిస్‌కనెక్ట్ అవ్వడం ద్వారా మీ కుటుంబం, స్నేహితులు, కొలీగ్స్, బంధువులు, ఇలా ఎవరో ఒకరితో మనస్ఫూర్తిగా మాట్లాడేందుకు టైమ్ స్పెండ్ చేయండి. ఇదొక హాబీగా మల్చుకోవడమే మీలో సోషల్‌ వెల్‌నెస్‌ను పెంచుతుంది.

స్కిల్స్ ఇంప్రూవ్‌మెంట్

మీరు ఏది సాధించాలన్నా సామాజిక అవగాహనతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి వీలైనప్పుడల్లా మిమ్మల్ని మీరు ఆ దిశగా మోటివేట్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. మీలో లోపాలను గుర్తించి అధిగమించాలని, ఇంకా మెరుగుదల అవసరమని భావిస్తే స్కిల్స్‌ పరంగా శిక్షణ తీసుకోవడానికైనా వెనుకాడవద్దని సూచిస్తున్నారు. దీంతోపాటు అన్ని పరిస్థితుల్లోనూ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటంవల్ల ఇతరులు మీతో కలిసి ఉండటానికి, మీతో మాట్లాడటానికి ఆసక్తి చూపుతారు. ఇది మీలో కూడా ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. సామాజిక శ్రేయస్సులో కీ రోల్ పోషిస్తుంది.

కంఫర్ట్‌గా ఉండటం నేర్చుకోండి

కొందరు ఏకాంతంగా లేదా ఒంటరిగా ఉండటంవల్ల ఇబ్బంది పడుతుంటారు. అసౌకర్యంగా ఫీలవుతుంటారు. మీలో సామాజిక ఆరోగ్యం అలవడాలంటే అప్పుడప్పుడూ ఒంటరిగా కూడా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అలోన్‌గా ఉండటంల్ల కూడా ఇతర వ్యక్తులతో సమయాన్ని వెచ్చించాలన్న ఆసక్తి మీలో మరింత పెరుగుతుంది. తర్వాత ఇది సోషల్ వెల్‌నెస్‌కు దారితీస్తుంది. మొత్తం సామాజిక ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవడంలో మీకు సహాయపడుతుందని నిపుణులు చెప్తు్న్నారు.

ప్లాన్‌ ముఖ్యం..

మీరు సామాజికంగా సౌకర్యవంతంగా లేనట్లయితే.. ఉండేందుకు అవసరం అయిన యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి మీకంటూ ఒక సమయం, సందర్భం, అవతలి వ్యక్తుల కంఫర్టబుల్ కూడా కీలకమని గుర్తించాలి. కాబట్టి కేవలం మీవైపు నుంచి మాత్రమే కాకుండా అన్ని కోణాల్లో ఆలోచించాలి. సామాజిక ఆరోగ్యంలో, శ్రేయస్సులో ఇది కూడా మంచి అవకాశాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అట్లనే స్వయం సేవకంగా ఉండటం, స్థానిక కమ్యూనిటీలతో కనెక్ట్ అవ్వడం మీలో స్వీయ విలువను పెంపొందించిన భావాన్ని కలిగిస్తుంది.

ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌..

మీరు సామాజికంగా మెలగాలంటే కేవలం మీ ఆసక్తులను మాత్రమే ఇతరులపై రుద్దితే చెల్లదు. ఇతరుల ఆలోచనలు, భావోద్వేగాలతో కూడా మీరు కనెక్ట్ అవ్వాలి. కనీసం అర్థం చేసుకోవడం, గౌరవించడం, సపోర్ట్ చేయడం చాలా ముఖ్యం. కాబట్టి మీరొక ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్‌గా అవతలి వారికి ఏది అవసరమో గుర్తించగలగాలి. అవసరం అయినప్పుడు సందర్భాలను సెలబ్రేట్ చేసుకోవడం, అభినందించడం, కృతజ్ఞతగా ఉండటం, ఇబ్బందుల్లో సహాయపడటం చేయాలి. ఇదంతా మీ సామాజిక పరిధిని, శ్రేయస్సును, సత్సంబంధాలను మెరుగు పరుస్తుంది.

బౌండరీస్ సెట్ చేసుకోండి

సోషల్ వెల్‌నెస్ అంటే మీరు అన్ని వేళలా సామాజికంగానే ఉండాలని మాత్రం కాదు. మీ వ్యక్తిగత ఆసక్తులు, అభిరుచులతోపాటు సమాజంతో ఎలా వ్యవహరించాలో తెలిసి ఉండటం మాత్రమే. కాబట్టి సామాజికంగా ఉండే ఆలోచనతో మిమ్మల్ని మీరు విస్మరించుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పైగా ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఓటమికి కారణం అవుతుంది. సామాజికంగా ఉంటున్నప్పుడు మీ బౌండరీస్ గౌరవించబడుతున్నాయని గనుక మీరు భావించకపోతే, అలాంటి సామాజిక పరిస్థితులు మీకు మంచి కంటే, హాని చేసే అవకాశమే ఎక్కువ. కాబట్టి మీకంటూ మీరు కొన్ని సరిహద్దులను కలిగి ఉంటూనే సోషల్ వెల్‌నెస్‌గా ఉండాలంటున్నారు నిపుణులు. 


Similar News