Wedding trends : వివాహాలు.. వింత పోకడలు!!

Wedding trends : వివాహాలు.. వింత పోకడలు!!

Update: 2025-01-02 13:47 GMT

దిశ, ఫీచర్స్ : పెళ్లి అంటే తప్పట్లు.. తాళాలు.. పచ్చని పందిళ్లు అనుకునేవారు ఒకప్పుడైతే. ఆ తర్వాత .. టెంట్లు, ఫంక్షన్ హాళ్లు, ఫొటో షూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్ల హవా నడుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ వెడ్డింగ్ ట్రెండ్స్ చూస్తే.. ఈ మధ్య కొత్త కొత్త పోకడలెన్నో వస్తున్నాయి. వాటిని ఫాలో అయ్యే వారి సంఖ్యను పక్కన పెడితే ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తున్న నయా మ్యారేజ్ ట్రెండ్స్ చాలానే ఉన్నాయి. వాటి ప్రత్యేకతలేమిటో చూద్దాం.

 ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్

దంపతుల మధ్య బంధం బలపడాలంటే.. భార్య భర్తలుగానే కాదు, మంచి స్నేహితుల్లా కూడా మెలగాలి అంటుంటారు పెద్దలు, నిపుణులు. అయితే కొందరు అదంతా ఎందుకు? అలాంటి పెళ్లి చేసుకొని నానాపాట్లు పడేకంటే ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ చేసుకొని సంతోషంగా ఉంటే సరిపోదా..! అంటున్నారు. ఇంతకీ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ అంటే ఏమిటనే కదా మీ సందేహం? ఏం లేదు.. మేజర్లు అయిన ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలని నిర్ణయం తీసుకుంటారు. ఒకే ఇంట్లో అచ్చం భార్యా భర్తల్లా కలిసి ఉంటారు. కలిసి వండుకుంటారు. కలిసి పనులు చేసుకుంటారు. ఆసక్తులు, అభిప్రాయాలు, ఖర్చులు, లావాదేవీలు అన్నీ పంచుకుంటారు. కానీ వీరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం ఉండదు. జస్ట్ ఫ్రెండ్స్ అంతే. వెరైటీగా ఉంది కదూ.. కానీ ఈ మధ్య అనేకమందిని ఆకట్టుకుంటున్న కొత్త పోకడ ఇది.

సోలో వెడ్డింగ్

పెళ్లంటే మూడు ముళ్ల బంధమే కాదు. రెండు మనసుల కలయిక అంటారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి జీవించడానికి తీసుకునే నిర్ణయమే ఇది. కానీ ఈ మధ్య కొందరు అమ్మాయిలు అందుకు భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ‘సోలో లైఫే సో బెటర్’ అంటూ ప్రొసీడ్ అయిపోతున్నారు. అంటే సింగిల్‌గా ఉండటానికే ఇష్టపడుతున్నారు. అయితే ఈ సోలో వెడ్డింగ్ ట్రెండ్ మొదట జపాన్‌లో స్టార్ట్ అయిందని నిపుణులు చెబుతున్నారు. ఒంటరిగా జీవించాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు వేడుకగా ఎందుకు జరుపుకోవాలనే సందేహం కూడా ఎవరికైనా కలుగుతుంది. అయితే ఇక్కడ సింగిల్‌గా ఉండటమంటే.. ఒంటరయ్యామనో, లైఫ్ పర్‌ఫెక్ట్ కాదనో కాదు. అలాంటి ప్రతికూల భావాల నుంచి బయటపడేందుకేనట సోలో వెడ్డింగ్ వేడుక. అంటే తమ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను వదులుకోకుండా, ఇష్టంగా జీవించడమే ఈ తరహా మ్యారేజ్ ముఖ్య ఉద్దేశం అంటున్నారు ‘సోలో ఫాలోవర్లు’.

డింక్ ట్రెండ్

ఇటీవల ఎక్కువ ట్రెండింగ్‌లో ఉన్న మరో వెరైటీ వివాహ పోకడల్లో డింక్ ట్రెండ్ ఒకటి. అంటే ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటారు. ఉద్యోగాలు చేస్తుంటారు. సంపాదనకు, సౌకర్యాలకు కొదువుండదు. నచ్చిన విధంగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ సరదాగా జీవిస్తారు. కానీ పిల్లల్ని మాత్రం కనొద్దని నిర్ణయం తీసుకుంటారు. దీనినే ‘డబుల్ ఇన్‌కమ్ నో కిడ్స్’గా పిలుస్తున్నారు. ఈ తరహా వెడ్డింగ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. అంటే ఈ డింక్ ట్రెండ్ ఫాలో అయ్యేవారు కెరియర్, వ్యక్తిగత స్వేచ్ఛ, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ వంటివి లక్ష్యంగా బతుకుతూ ఆనందిస్తారు. సంతానం మాత్రం వద్దనుకుంటారు. సంతానలేమి సమస్యలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఈ ట్రెండ్ పలువురికి ఊరటనిస్తోంది.

పద్దతులూ మారుతున్నయ్..!

ఒకప్పుడు ఫొటోలు, వీడియోలు కేవలం పెళ్లిరోజే తీయించుకునేవారు ఎక్కువమంది. టెక్నాలజీ పెరిగిపోయాక ప్రతీ సందర్భాన్ని కెమెరాల్లో బందిస్తున్నారు. పెళ్లిళ్ల విషయంలోనూ అదే జరుగుతోంది. ప్రీ వెడ్డింగ్ షూట్లతోపాటు ఇంకా అనేక పోకడలు ముందుకు వచ్చాయి. ఫస్ట్ టైమ్ కలిసిన చోటు, ఇద్దరి మధ్య సంభాషణలు, ఎమోషన్స్, చివరికి బెడ్ రూమ్‌లో అడుగు పెట్టేముందు కూడా ఫొటోలు, వీడియోలు తీయించుకుంటోంది ఈతరం. కొందరైతే తమ పరిచయం మొదలుకొని పెళ్లి తంతు ముగిసే వరకు పలు సంఘటనలు, సందర్భాలను వీడియోలు తీసి డాక్యుమెంటరీలు చేయిస్తున్నారు.

ఇన్విటేషన్ తీరు కూడా..

పెళ్లికి ఆహ్వానించే పత్రికులు కూడా సంప్రదాయబద్ధంగా ఉంటాయి మన దేశంలో.. కానీ ఈ మధ్య వీటిలోనూ మార్పులు సంతరించుకుంటున్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకొని కొత్త కొత్త పద్ధతుల్లో ఇన్విటేషన్ థీమ్స్ రూపొందిస్తోంది యువతరం. ఓపెన్ చేయగానే మ్యూజిక్ లేదా సాంగ్ వినిపించేలా కొందరు. అలాగే వీడియో ఇన్విటేషన్స్ ఇంకొందరు వాట్సాప్ ద్వారా పంపుతున్నారు. అట్లనే తమ వ్యక్తిగత ఆసక్తులు, ప్రొఫెషనల్ విషయాలను అందులో పొందు పరుస్తున్నారు. ప్రశ్నలు జవాబుల రూపంలో, పేరడీ పాటల రూపంలో ఆకట్టుకునే వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఈ మధ్య పెరిగిపోయి వైరల్ అవుతున్నాయి. దీంతోపాటు పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ మధుర క్షణాలు గుర్తుండిపోయేలా ‘లవ్ పెయింటింగ్స్’ గీయించుకోవడం మరో నయా ట్రెండ్. ఒకప్పటిలా ఈరోజుల్లో పెళ్లి చేసుకోవడానికి మండపాలే అవసరం లేదు ‘ఓపెన్ ఎయిర్ వెన్యూ’ కాన్సెప్ట్ ముందుకొచ్చింది. అంటే.. బహిరంగ ప్రదేశంలో రాత్రిపూట నిర్మలమైన ఆకాశం కింద అందరి సమక్షంలో ఒక్కటైపోతున్నాయి ఆధునిక జంటలు. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్స్ సంగతి తెలిసిందే.! 

Tags:    

Similar News