Behaviors : మీపై ఆసక్తి లేనప్పుడు అవతలి వ్యక్తిలో కనిపించే కొన్ని సంకేతాలివే!
Behaviors : మీపై ఆసక్తి లేనప్పుడు అవతలి వ్యక్తిలో కనిపించే కొన్ని సంకేతాలివే!
దిశ, ఫీచర్స్ : పరిచయాలు అందరితో ఉంటాయి. కానీ స్నేహం, సాన్నిహిత్యం, ప్రేమ వంటివి కొందరి మధ్యే ఉంటాయి. అయితే ఇది గ్రహించడంలో చాలా మంది పొరబడుతుంటారని నిపుణులు అంటన్నారు. ఇలాంటప్పుడు తమతో కాస్త మంచిగా మాట్లాడేస్తే చాలు అవతలి వ్యక్తి తమవారేనని ఫీలైపోతుంటారు. కొందరైతే క్లోజ్‌గా మూవ్ అయిపోతూ రహస్యాలన్నీ చెప్పేస్తుంటారు. చివరికి చిక్కుల్లో పడుతుంటారు. ఇక స్త్రీ, పురుషుల విషయానికి వస్తే, ముఖ్యంగా టీనేజర్స్ అవతలి వ్యక్తి తమతో కాస్త క్లోజ్‌గా మాట్లాడేసినా, నవ్వినా తమను ఇష్టపడుతున్నారని భ్రమపడేవారు మస్తు మందే ఉంటారు. కానీ ఇదంతా అవగాహనా రాహిత్యం అంటున్నారు నిపుణులు. క్లోజ్‌గా ఉంటున్నా మీరంటే ఇష్టం లేదా ఆసక్తి లేని వ్యక్తి ప్రవర్తనలో అందుకు సంబంధించిన సంకేతాలు ముందుగానే కనిపిస్తుంటాయి. లవ్, ఫ్రెండ్‌షిప్, రిలేషన్‌షిప్, డేటింగ్ వంటి సంబంధాల్లో వీటిని గుర్తించవచ్చు. అవేమిటో చూద్దాం.
*ఇష్టం లేకున్నా తప్పని పరిస్థితిలో సంబంధం కొనసాగిస్తున్న వారిని లేదా నటిస్తున్న వ్యక్తులను బాడీ లాంగ్వేజ్‌ను బట్టి కూడా పసిగట్టవచ్చు అంటున్నారు నిపుణులు. అలాంటి సంకేతాల్లో వాటిలో ఐ కాంటాక్ట్ ఒకటి. అంటే అవతలి వ్యక్తితో మీరు ఎంతసేపు మాట్లాడినా మీ వైపు ఫోకస్ చేయడం గానీ, మీ కళ్లల్లోకి చూడటం గానీ చేయకపోతే మీరంటే ఇష్టం లేకపోవచ్చు లేదా ఆ సందర్భంలో మీతో మాట్లాడటానికి లేదా సమయం కేటాయించిడానికి ఇష్టం లేకపోవచ్చు. దీంతో మీరు మాట్లాడటం ఎప్పుడు ఆపేస్తారా ఎదురు చూస్తుంటారు. ఇలాంటి బిహేవియర్ గుర్తిస్తే గనుక మీరంటే అవతలి వ్యక్తికి పెద్దగా ఆసక్తి లేదా ఇష్టం లేదని అర్థం.
*మీరంటే ఇంట్రస్ట్ లేనప్పుడు అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు పెదవులు కొరుకుతూ ఉండటం, మీరు చెప్పేది అంత ముఖ్యమైంది కాదన్న ధోరణితో వేరేవైపు దృష్టి సారించడం చేస్తుంటారు. ఏదైనా అడిగితే సమాధానం ఇవ్వడంలో ఆలస్యం చేస్తుంటారు. అలాగే ముక్తసరిగా, చులకనగా సమాధానం ఇవ్వడం, ప్రతీ విషయాన్ని తిరస్కరించడం, కారణం లేకుండానే విమర్శించడం చేస్తుంటారు.
* అవతలి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వారు తమ పాదాలను, ముఖాన్ని మీ వైపునకు కాకుండా మరో దిశకు తిప్పి ఉంచడం చేస్తుంటే.. మీతో మాట్లాటానికి ఇష్టం లేకపోవచ్చు. సబంధంలో ఉన్నప్పుడైతే మీరంటే ఇష్టం లేదనే సంకేతం కూడా కావచ్చు. అలాగే బయట స్నేహితులో, సహచరులో అయితే తాము వెళ్లడానికి రెడీగా ఉంటే.. మీరేదో సోది చెప్తున్నారనే ఇలాంటి సంకేతాన్ని పరోక్షంగా ఇస్తుంటారు. దీనిని బట్టి ఆ సమయంలో మీతో సంభాషణ కొనసాగించడానికి వారికి ఇష్టం లేదని అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు.
* రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే అవతలి వ్యక్తికి ఇష్టం లేకపోతే మీరు వారికి దగ్గరకు రావడానికి అడ్డంకులు క్రియేట్ చేస్తుంటారు. మానసికంగా మీ మధ్య ఉన్న దూరాన్ని ఉదాహరణలతో చెప్పే ప్రయత్నం చేస్తారు. వివిధ వస్తువులను చూపించడం, దగ్గరకు రానివ్వకుండా చేతులు అడ్డు పెట్టడం వంటివి చేస్తుంటారు. మీరు నిలబడి లేదా కూర్చొని ఉన్నప్పుడు వారు మీకు ఒక అడుగు దూరం వెనక్కి జరిగి అసౌకర్యంగా ఉన్నట్లు హావ భావాలు ప్రదర్శిస్తుంటారు.
*అది నవ్వే సందర్భమైనా, మీరు నవ్వించడానికి ప్రయత్నించినా అవతలి వ్యక్తి పట్టించుకోవడం లేదంటే మీపట్ల ఆసక్తి లేదని కూడా అర్థం. కొన్నిసార్లు ఏదో మొక్కుబడిగా నవ్వుతుంటారు. మీరు చెప్పేది పూర్తిగా వినకుండానే సమాధానం ఇస్తుంటారు. మరికొన్నిసార్లు మధ్యలోనే కట్ చేసి ఇక నాకు తెలుసులే.. అనేస్తుంటారు. ఈ విధమైన బాడీ లాంగ్వేజ్ ప్రదర్శిస్తున్నారంటే అవతలి వ్యక్తికి మీరంటే ఇష్టం లేకపోవడమో లేదా ఆ సందర్భంలో మాత్రమే మీతో మాట్లాడటానికి లేదా సమయం కేటాయించడానికి ఇష్టం లేదా ఆసక్తి లేకపోవడమో వంటి సంకేతాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.
* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.