Health : చలికాలం కదా అని బయట తిరగడం మానేస్తే..? మీ శరీరంలో జరిగే మార్పులివే..

Health : చలికాలం కదా అని బయట తిరగడం మానేస్తే..? మీ శరీరంలో జరిగే మార్పులివే..

Update: 2024-12-26 07:53 GMT

దిశ, ఫీచర్స్ : అసలే చలికాలం.. ఉదయంపూట వెదర్ చాలా కూల్‌గా ఉంటుంది. ఓ వైపు మంచు కురువడం, మరోవైపు చల్లటి గాలులు వీయడంవల్ల ఈ సీజన్‌లో కొంతమంది బయటి వాతావరణంలో తిగరడానికి పెద్దగా ఇష్టపడరు. మార్నింగ్ చల్లగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోయినా పర్లేదు. కానీ ఎండ వచ్చిన తర్వాత కూడా పలువురు బయటకు వెళ్లకపోవడంతో సూర్యరశ్మికి గురయ్యే అవకాశాన్ని కోల్పోతారు. ఇక ఉద్యోగాలు చేసేవారిలో కూడా చాలామంది ఇంటి నుంచి వెళ్లాక ఆఫీసు పనిలో నిమగ్నమై పోతారు దీంతో వీరు కూడా బయట ప్రకృతిని ఆస్వాదించే పరిస్థితులు ఉండవు. అయితే చలికాలంలో బయట తిరగలేని ఈ విధమైన జీవనశైలితో పలు సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.

మానసిక గందరగోళం

చలికాలంలో బయట పరిసరాల్లో సమయాన్ని స్పెండ్ చేయకపోవడం, ఎక్కువరోజులు సూర్యరశ్మి తగలకుండా ఉండటం అనేవి మానసిక స్థితిలో మార్పులకు కారణం అవుతాయని నిపుణులు అంటున్నారు. పైగా దీనివల్ల మూడ్ స్టెబిలైజర్‌‌లో ముఖ్యపాత్ర పోషించే సెరోటోనిన్ హార్మోన్ లెవల్స్ తగ్గుతాయి. నిజానికి ఇదొక న్యూరో ట్రాన్స్‌మిటర్. ‘ఫీల్‌ గుడ్ హార్మోన్’ అని కూడా పిలుస్తారు. ఎక్కువ రోజులు బయట తిరగడం మానేస్తే మీ శరీరంలో ఇది ఉత్పత్తి కావడం ఆగిపోతుంది. దీంతో మానసిక ఆందోళన, వివిధ రుగ్మతలు, శారీరక అనారోగ్యాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది.

సిర్కాడియన్ రిథమ్‌పై ఎఫెక్ట్

సహజ సిద్ధమైన ప్రకృతిని ఆస్వాదించడం, సూర్యకాంతికి గురికావడం, ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండటం, బయటి పరిసరాల్లో టైమ్ స్పెండ్ చేయడం అనేది మన సిర్కాడియన్ రిథమ్‌(స్లీప్ సైకిల్)కు చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే నేచురల్ లైటింగ్ అనేది మనిషిలో నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. సహజంగా ఇది నిద్రవేళకు ముందు పెరుగుతుంది. మేల్కొన్న తర్వాత పడిపోతుంది. కాబట్టి పగటిపూట బయటకు వెళ్లకపోతే ఈ ప్రక్రియకు ఆటకం కలిగిస్తుంది.

అలెర్జీలు, క్యాబిన్ ఫీవర్ వచ్చే చాన్స్

బయట తిరగకపోతే మీరు ‘క్యాబిన్ ఫీవర్’ బారిన పడవచ్చు. అంటే తరచుగా ఒక క్లోజ్డ్ స్పేస్‌లో ఎక్కువకాలం గడపడంవల్ల అనుభవించే ఇబ్బంది కరమైన అనుభూతినే నిపుణులు ‘క్యాబిన్ ఫీవర్’గా పేర్కొంటున్నారు. మానిసిక గందరగోళం, విసుగు, ఆందోళన, అసంతృప్తి వంటివి క్యాబిన్ ఫీవర్‌లో భాగంగా పేర్కొంటారు. దీంతోపాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, మానసిక ఒత్తిడి మరింత పెరగడం, అలెర్జీల బారిన పడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

ఒళ్లు, కీళ్ల నొప్పులు వేధిస్తాయ్

మీరు ఎక్కువ రోజులు బయట పరిసరాల్లో తిరగకపోతే సహజంగానే కొన్ని రకాల శారీరక నొప్పులను అనుభవించే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సూర్యరశ్మి తక్కువగా ఉండటం ఫలితంగా విటమిన్ డి లెవల్ తగ్గుతుంది. దీంతో శరీరం, కండరాలు, కీళ్ల నొప్పులు వస్తాయి. పేగుల్లో అసౌకర్యం ఏర్పడుతుంది. క్రమంగా ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్‌కు దారితీస్తుది.

క్యాన్సర్ రిస్క్ పెరగవచ్చు

బయట ప్రకృతిలో గడపకపోతే శరీరానికి సూర్యరశ్మి లభించదు. ఇది విటమిన్ డి లోపానికి దారితీస్తుంది. క్రమంగా చర్మ క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కామన్వెల్త్ మెడికల్ కాలేజీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. వివిధ రకాల క్యాన్సర్లను అనుభవిస్తున్న మూడు వంతుల మంది క్యాన్సర్ పేషెంట్లలో విటమిన్ డి లెవల్స్ చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అందుకు కారణం వారు బయటి పరిస్థితుల్లో సమయాన్ని స్పెండ్ చేయకపోవడమేనట.

జ్ఞాపకశక్తి తగ్గుతుంది

ప్రకృతిలో గడపడం లేదా బయటకు వెళ్లడం మానేసి, పూర్తిగా ఇంటిలోనే తప్పితే ఆఫీస్‌లోనో మాత్రమే ఉండే జీవనశైలి మీ మెదడు సామర్థ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది క్రమంగా జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మిచిగాన్ యూనివర్సటీ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం కూడా ప్రకృతిలో, బయట పరిసరాల్లో గడపడం, నడవడం వంటి యాక్టివిటీస్ మతిమరుపును పోగొట్టి.. 20 శాతం మేర జ్ఞాపశక్తిని పెంచుతాయి. అంతేకాదు నిరుత్సాహం, అలసట, దృష్టి లోపాలు వంటి సమస్యలన్నీ బయట తిరగకపోవడం కారణంగా వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి వీటన్నింటికీ చక్కటి పరిష్కారం వీలైనంత ఎక్కువగా మీరు ప్రకృతితో కనెక్ట్ అవడమే అంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ ఎంతో కొంత సమయం బయటి పరిస్థితులను పరిశీలించడానికి, ప్రకృతిని ఆస్వాదించడానికి కేటాయిస్తే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు అధ్యయనాల నుంచి సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News