Mental health : రిటైర్మెంట్ డిప్రెషన్ .. లోన్లీనెస్‌తో ఏర్పడుతున్న నిరాశా నిస్పృహలు

Mental health : రిటైర్మెంట్ డిప్రెషన్ .. లోన్లీనెస్‌తో ఏర్పడుతున్న నిరాశా నిస్పృహలు

Update: 2024-12-26 14:31 GMT

దిశ, ఫీచర్స్ : ‘‘ఉద్యోగం చేస్తున్నంత కాలం ఉరుకులూ పరుగుల జీవితమే.. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్. రిటైర్మెంట్ తర్వాతనైనా జీవితం హాయిగా గడపాలి’’ అనుకుంటారు చాలా మంది. నిజానికి శేష జీవితంలో ఇదొక అవసరం కూడా అంటుంటారు. అయితే అందరి జీవితాలూ ఒకేలా ఉండకపోవచ్చు. ఇందుకు భిన్నమైన పరిస్థితిని చాలా మంది అనుభవిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత ఆనందంగా ఉండాలని భావించిన వారు.. ఎంతోమంది ఆ తర్వాత ఒంటరితనంతో బాధపడుతూ డిప్రెషన్ బారిన పడుతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీనిని ఆరోగ్య నిపుణులు రిటైర్మెంట్ డిప్రెషన్‌గా పిలుస్తున్నారు.

ఎందుకు కలుగుతుంది?

పదవీ విరమణ లేదా శేష జీవితంలో ఏర్పడే డిప్రెషన్‌కు ప్రధాన కారణం లోన్లీనెస్ అంటున్నారు నిపుణులు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పదవీ విరమణ వయసులో మనవలు, మనవరాళ్లతో సరదాగా కాలం గడిపేవారు. వచ్చిన పెన్షన్‌తో అందరూ కలిసి అదనపు అవసరాలు, ఆదాయ వనరులు, వ్యవసాయం, కుటుంబ అవసరాలకు వినియోగించుకునేవారు. అందరూ కలిసి మెలిసి ఉండటంవల్ల మానసికంగానూ బలంగా ఉండేవారు. దీంతో అనారోగ్యాలు వచ్చే అవకాశం కూడా తగ్గేది. ఏదైనా సమస్య వస్తే కుటుంబం మొత్తం అండగా ఉండేది. పదవీ విరమణ తర్వాత శేష జీవితం గడుపుతున్న వ్యక్తులు తమకు ఏదైనా జరిగితే తమ కుటుంబం ఉందన్న ధైర్యం, భరోసా ఫుల్లుగా ఉండేది. ఇదే వారి ఆనందానికి, ఆరోగ్యానికి కారణం అయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండా పోతోంది. కొడుకులు, కూతుళ్లు, ఇలా కుటుంబ సభ్యులు ఉద్యోగాలు, ఉపాధి రీత్యా దూర ప్రాంతాల్లోనో, విదేశాల్లోనో ఉండటం మలి వయసులో ఒంటరై నిస్సాహాయత, ఆందోళన, ఒంటరితనం వంటివి పెరిగిపోతున్నాయి. దీంతో కొందరు డిప్రెషన్‌లో కూరుకుపోతున్నారు.

ఎలా గుర్తించాలి?

ఏదో లోతైన ఆలోచనల్లో మునిగిపోవడం, ఎప్పుడూ బాధగా ఉన్నట్లు కనిపించడం, అలసటగా ఉండటం, ఏ పనీ చేయాలనిపించకపోవడం, అందరూ ఉన్నా తాము ఒంటరిగా ఉంటున్నామనే ఆందోళనతో బాధపడటం, ఎలాంటి అభిరుచులు లేకపోవడం వంటివి రిటైర్మెంట్ డిప్రెషన్‌కు ముందు కనిపించే లక్షణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు పెన్షన్ తక్కువగా వచ్చేవారిలో ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేకపోవడం, కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో కూడా మానసిక ఆందోళన ఏర్పడుతుంది. తాము ఉద్యోగం చేస్తున్నప్పుడే బాగుండేదనే ఆలోచన, ప్రస్తుత పరిస్థితిపై ప్రతికూల ఆలోచనలు, ఆందోళన కారణంగా డిప్రెషన్ ఆవహిస్తుంది. దీనికి తోడు బీపీ, డయాబెటిస్, ఇతర అనారోగ్యాలు వెంటాడుతుంటాయి.

పరిష్కారం ఏమిటి?

రిటైర్మెంట్‌కు ముందే తర్వాత పరిస్థితులను ఎలా మేనేజ్ చేయాలనే ప్లాన్ కొంతవరకు సహాయపడుతుంది. అలాగే తాము ఒంరిగా అవుతామని భావిస్తే కుటుంబ సభ్యులతో కలిసి ఉండే విషయమై చర్చిస్తే విదేశాల్లో ఉండే బదులు ఇంటిపట్టునే ఉండే అవకాశాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. ఒకవేళ అలా సాధ్యం కాదన్నప్పుడు మానసికంగా ఒంటరిగానైనా ఉండగలమనే మానసిక సంసిద్ధత ఉన్నప్పుడు డిప్రెషన్ వంటివి రాకుండా ఉంటాయి. ఇక పదవీ విరమణ తర్వాత పిల్లలకు దూరంగా ఉన్నప్పటికీ మీరు ఒంటరిగా లేదా భార్యా భర్త కలిసి ఉన్నా డైలీ మీకు ఆనందాన్ని కలిగించే హాబిట్స్ కలిగి ఉండటం, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చుట్టు పక్కల వ్యక్తులతో, వారి పిల్లలతో కలిసి మెలిసి ఉండటం, వంటి జీవన శైలి కూడా మేలు చేస్తుంది అంటున్నారు మానసిక నిపుణులు. అలాగే యోగా, మెడిటేషన్ విహార యాత్రలు, ఆధ్యాత్మిక పర్యటనలు వంటివి కూడా ఆనందాన్ని కలిగించేవి అయితే రిటైర్మెంట్ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సహాయపడతాయి. కుటుంబ సభ్యులు కూడా ఉద్యోగ రీత్యా దూరంగా ఉన్నప్పటికీ తరచుగా ఫోన్లలో మాట్లాడటం, ఆరోగ్యం, ఆర్థిక అవసరాలను తెలుసుకొని నెరవేర్చడం, తామున్నామన్న భరోసా ఇవ్వడం వంటివి కూడా రిటైర్మెంట్ ఏజ్‌లో డిప్రెషన్ నుంచి బయటపడేస్తాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Read More...

Lung health : శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులా..? బయటపడే మార్గమిదిగో..







Tags:    

Similar News