Health : స్మోకర్స్‌కి అలర్ట్ ..! మీరు తాగే ఒక్కో సిగరెట్ 22 నిమిషాల ఆయుష్షును తగ్గిస్తుంది!
Health : స్మోకర్స్‌కి అలర్ట్ ..! మీరు తాగే ఒక్కో సిగరెట్ 22 నిమిషాల ఆయుష్షును తగ్గిస్తుంది!
దిశ, ఫీచర్స్ : ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే. అయితే కొందరు దీనికి మరీ ఎక్కువగా బానిసై పోతుంటారు. ఎప్పుడో ఒకసారి తాగుదామని మొదలు పెట్టేవారు సైతం ప్రతిరోజూ డబ్బాలకొద్దీ సిగరెట్లు కాల్చుతుంటారు. కొందరు ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా రోజూ కనీసం మూడు నాలుగు సిగరెట్లైనా తాగుతుంటారు. ఇలాంటి అలవాట్లే స్మోకింగ్ చేసేవారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే తాజా అధ్యయనం మరో కొత్త విషయాన్ని వెల్లడించింది. స్మోక్ చేసే అలవాటు ఉండే పురుషుల్లో ఒక్కో సిగరెట్ 17 నిమిషాల ఆయుష్షును తగ్గిస్తుందని, అదే మహిళల్లో అయితే 22 నిమిషాల ఆయుష్షును తగ్గిస్తుందని పేర్కొన్నది. ఆ వివరాలేంటో చూద్దాం.
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ (యుసిఎల్) పరిశోధకులు పొగ పీల్చడం లేదా సిగరెట్ తాగడం ఆరోగ్యంపై ఏ విధమైన ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు మరోసారి అధ్యయనం నిర్వహించారు. అనేకమంది స్త్రీ, పురుషుల్లో స్మోకింగ్ అలవాట్లను పరిశీలించారు. అలాగే స్మోక్ చేసేవారిలో, చేయనివారిలో ఆరోగ్యాన్ని అంచనా వేశారు. కాగా ఈ సందర్భంగా పరిశోధకులు సిగరెట్ తాగని వారికంటే.. తాగేవారిలో ఒక స్టేజ్ దాటాక ఆరోగ్య సమస్యలు అధికం అయ్యే అవకాశం ఉందని గుర్తించారు. ముఖ్యంగా ఊపిరి తిత్తుల్లో ఇన్ ఫెక్షన్లు, క్యాన్సర్లు, లివర్ ప్రాబ్లమ్స్ వంటివి స్మోక్ చేసేవారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే సిగరెట్ తాగే అలవాటు సదరు వ్యక్తి ఆయుష్షును తగ్గిస్తుందని పరిశోధకులు అంటున్నారు.
స్త్రీ, పురుషులపై ప్రభావం
ఒక పురుషుడు రోజూ ఒక సిగరెట్ తాగే అలవాటువల్ల, తాగని వ్యక్తులతో పోలిస్తే ఒక్కో సిగరెట్‌కు 17 నిమిషాల ఆయుష్షును కోల్పోతాడు. మహిళల్లో అయితే 22 నిమిషాల ఆయుష్షు తగ్గుతుంది. ఇక రోజుకు 20 సిగరెట్లు తాగేవారిలో ఆయుష్షు 7 గంటలు తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే సిగరెట్ తాగేవారిలో ఒకప్పటితో పోలిస్తే స్త్రీ, పురుషుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు రీసెర్చర్స్ పేర్కొంటున్నారు. 1996లో మహిళలు రోజుకు సగటన 13.6 సిగరెట్లు తాగేవారని, ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయుండవచ్చునని అభిప్రాయపడుతున్నారు.
సిగరెట్ తాగడంవల్ల కలిగే నష్టాలు
సిగరెట్లలో నికోటిన్ ఉండటంవల్ల తాగినప్పుడు స్ట్రెస్ రిలీఫ్‌గా అనిపిస్తుంది. కాబట్టి ఒకసారి అలవాటు పడ్డ తర్వాత అంత ఈజీగా వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇది ప్రమాదకరం. తాత్కాలి ఆనందం కోసం చూసుకుంటే జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సిగరెట్ కాల్చడంవల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, స్వరపేటిక క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, అన్న వాహిక క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, కిడ్నీల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు.
మానేస్తే కలిగే ప్రయోజనం
ఒక వ్యక్తి సంవత్సరం ప్రారంభంలో అంటే.. ఫస్ట్ డే నుంచే సిగరెట్లు తాగడం మానేస్తే ఎంత ఆయుష్షు పెరుగుతుందనే విషయాన్ని కూడా పరిశోధకులు ఎనలైజ్ చేశారు. దీని ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు 10 సిగరెట్లు తాగుతుంటే గనుక జనవరి ఫస్ట్ నుంచే వాటిని తాగడం మానేస్తే ఇయర్ ఎండింగ్ వరకు అతను 50 రోజుల జీవితాన్ని తన ఆయుష్షులో తగ్గకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలంటే స్మోక్ చేయడం మానుకోవడమే ఉత్తమమైన మార్గం.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు అధ్యయనాల నుంచి సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.