Self mistakes : స్వీయ తప్పిదాలు.. లైఫ్ క్వాలిటీని తగ్గిస్తున్న డైలీ రొటీన్స్!
Lifestyle : స్వీయ తప్పిదాలు.. లైఫ్ క్వాలిటీని తగ్గిస్తున్న డైలీ రొటీన్స్!
దిశ, ఫీచర్స్ : మనం హెల్తీగా, హ్యాపీగా ఉండాలనుకోవడంలో తప్పు లేదు. అయితే అందుకోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా తెలిసో, తెలియకో చేసే కొన్ని పొరపాట్లు, రోజువారీ అలవాట్లు మన లైఫ్ క్వాలిటీని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మనం చేసే పని ఏదైనా ఈజీగా అయిపోవాలని ఆలోచిస్తుంటాం. కానీ అన్ని సందర్భాల్లోనూ అదే పద్ధతిని అనుసరిస్తే నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. అలాంటి స్వీయ తప్పిదాలు ఏవి? ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువసేపు వేడినీటి స్నానం
అసలే చలికాలం. మనలో చాలామందికి గోరు వెచ్చటితో స్నానం చేయడం హాయిగా అనిపిస్తుంది. అయితే ఎక్కువ సేపు హాట్ వాటర్ షవర్ కింద ఉంటే మాత్రం రిస్క్‌లో పడ్డట్లే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వేడి నీటికి శరీరం ఎక్కువసేపు గురికావడంవల్ల చర్మ సమస్యలు తలెత్త వచ్చు. అలాగే నేచురల్ ప్రొటెక్టివ్‌గా ఉండే ఆయిలీ స్కిన్ లేయర్స్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. ఫలితంగా హాట్ వాటర్‌కు అధిక ఎక్స్‌పోజర్ కారణంగా చర్మం పొడిబారుతుంది. స్కిన్ అలెర్జీలు రావచ్చు. కాబట్టి మరీ గంటల కొద్ది వేడినీటితో స్నానం చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు.
మళ్లీ మళ్లీ ఆహారాన్ని వేడిచేయడం
వంట చేయడానికి ఓపిక లేకనో, రాత్రింబవళ్లు వండటం దేనికనో కొందరు ఒకేసారి వండేసి ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. అయితే తిన్నప్పుడల్లా దానిని వేడి చేసి తింటుంటారు కొందరు. కానీ ఇలా చేయడం ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేస్తుంది. ముఖ్యంగా రెడీమీడ్ మీల్స్ మీ సమయాన్ని ఆదా చేయవచ్చు. అందులో సంతృప్త కొవ్వులు, అధిక సోడియం ఉండటంవల్ల ఒకటికి రెండుసార్లు వేడి చేస్తే అనారోగ్యాలను కలిగిస్తాయంటున్నారు నిపుణులు.
సింథటిక్ సువాసనలు
వాష్ రూమ్, బాత్ రూమ్, బెడ్ రూమ్ ఇలా ఏదో ఒకటి కాదు, ఇల్లు మొత్తం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అందరూ భావిస్తుంటారు. అందుకోసం చాలా మంది సువాసనలు వెదజల్లే సింథటిక్ లిక్విడ్స్‌ను స్ర్పే చేస్తుంటారు. అయితే ఇలా చేయవద్దు అంటున్నారు నిపుణులు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ అలర్జీ, ఆస్తమా అండ్ ఇమ్యునాలజీ ప్రకారం కూడా సింథటిక్ సువాసనలు ఆస్తమా, శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి వాడే ముందు మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి.
గిన్నెలను సింక్‌లో నానబెట్టడం
చాలా మంది రాత్రిపూట భోజనం తర్వాత తిన్న ఖాళీ ప్లేట్లను, గిన్నెలను, వివిధ వంట పాత్రలను సింక్ బేసిన్‌లో నానబెట్టి, దీనివల్ల మరుసటి ఉదయం వాష్ చేయడం ఈజీ అవుతుందని భావిస్తారు. కానీ ఇది ప్రమాదకరం కూడా. ఎందుకంటే అందులో మిగిలిపోయిన పదార్థాలు బాగా నానడంవల్ల అందులో బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి పుట్టుకొస్తాయి. తర్వాత వాటిని వాష్ చేసేవారిలో అలెర్జీలకు కారణం అవుతాయి.
రాత్రిళ్లు తలస్నానం
చాలా మందికి రాత్రిపూట పడుకునే ముందు స్నానం చేసే అలవాటు ఉంటుంది. పొద్దంతా ఎక్కువసేపు పనిచేయడం, అలసటకు గురికావడం వల్ల ఇలా చేస్తే రిలాక్స్ అవుతామని, నిద్ర బాగా పడుతుందని భావిస్తారు. అయితే పడుకోవడానికి ముందు తలస్నానం చేయడం కొంతమందిలో జలుబు, గొంతు నొప్పి వంటి అనారోగ్యాలకు కారణం అవుతుంది. స్నానం తర్వాత తలను సరిగ్గా తుడుచుకోకపోవడం వల్ల ఇలా జరగొచ్చు. అలాగే రోజూ రాత్రిపూట తల స్నానం చేయడం, తడి సరిగ్గా ఆరకముందే పడుకోవడం వంటివి చుండ్రు, జుట్టు రాలే సమస్యలకు కూడా దారితీస్తాయి.
మేకప్‌తో నిద్రపోవడం
చాలా మంది సాయంకాలం ఫంక్షన్లకో, పార్టీలకో, పెళ్లిళ్లకో వెళ్లే క్రమంలో మేకప్ చేసుకుంటారు. అయితే తిరిగి వచ్చిన తర్వాత ఓపిక లేకనో, ఆలస్యమైందనో అలాగే పడుకుంటారు. కానీ మేకప్ తొలగించకపోవడం మీ చర్మ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మేకప్‌లో ఉండే హానికారక రసాయనాలు స్కిన్ ఇన్ ఫెక్షన్లకు, వృద్ధాప్య ఛాయలకు కారణం అవుతాయి. ఈ అలవాటును వెంటనే మానుకోవాలంటున్నారు నిపుణులు.
కూల్ డ్రింక్‌లు, సోడాలు, ఆల్కహాల్
కొందరికి భోజనం తర్వాత సోడా లేదా కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేస్తే గ్యాస్ ప్రాబ్లం పోతుందని భావిస్తుంటారు. మరి కొందరు రాత్రిపూట భోజనానికి ముందు గానీ, భోజనం చేస్తూ గానీ ఆల్కహాల్ సేవిస్తుంటారు. అయితే ప్రతిరోజూ ఇలా చేస్తే మాత్రం మీ జీవన ప్రమాణం ప్రమాదంలో పడ్డట్లే. ఎందుకంటే సోడాలు, కూల్ డ్రింక్‌లు, ఆల్కహాల్ వంటివి వాస్తవానికి అధిక చక్కెర స్థాయిలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని అవయవాలను బలహీన పరుస్తాయి.
నోస్ హెయిర్ కట్ చేయడం
చాలా మంది పురుషులు షేవింగ్ చేస్తున్నప్పుడు ముక్కులో ఉన్న చిన్న చిన్న వెంట్రుకలను కూడా కట్ చేస్తుంటారు. కానీ వాస్తవానికి అవి ఉంటే మంచిదే అంటున్నారు నిపుణులు. ముక్కులోకి దుమ్ము, ధూళి వంటివి నేరుగా పోకుండా రక్షణగా నిలుస్తాయి. కాబట్టి కట్ చేయకపోయినా ఏమీ కాదు. ముక్కు లోపలి భాగాన్ని దాటి పెరిగితే మాత్రమే ఎక్స్‌ట్రా హెయిర్‌ను కట్ చేసుకోవడం బెటర్.
ఒకే బ్లేడ్ మళ్లీ మళ్లీ వాడటం
షేవింగ్ చేసేవారు తరచుగా బ్లేడ్‌ను వాడుతుంటారు. అయితే ఒక బ్లేడ్ ఒకసారి వాడితేనే బెటర్. అలా కాకుండా ఒక రేజర్ లేదా బ్లేడ్‌ను ఒకటికంటే ఎక్కువసార్లు వాడితే.. ముఖంపై దద్దుర్లు, గాయాలు వంటివి కావచ్చు. పైగా రేజర్‌పై బ్యాక్టీరియా పేరుకుపోయి ఉండవచ్చు. అది స్కిన్ అలెర్జీలకు తద్వారా చర్మ వ్యాధులకు దారితీయవచ్చు. అయితే ప్రస్తుతం ట్రిమ్మర్లు అందుబాటులోకి వచ్చినందున బ్లేడ్‌కి ప్రత్యామ్నాయంగా అది వాడటం బెటర్ అంటున్నారు నిపుణులు.
లంచ్ తర్వాత నిద్ర పోవడం
మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర ముంచుకొస్తుంది కొందరికి. దీంతో ఓ కునుకు తీస్తే పోలే అనుకొని నిద్రలోకి జారుకుంటారు. కానీ రోజూ అదే కంటిన్యూ అయితే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. మెటబాలిక్ సైకిల్ దెబ్బతింటుంది. నిద్రలేమి, రిఫ్లెక్స్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి మీ లైఫ్ క్వాలిటీని తగ్గిస్తాయి. అలాగే ఉదయం టిఫిన్ చేయకపోవడం, రాత్రిపూట ఆలస్యంగా తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.
నీళ్లు తాగకపోవడం
సాధారణంగా రోజుకు 7 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెబుతుంటారు. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పుడు 10 నుంచి 14 గ్లాసుల వరకు కూడా తాగవచ్చు. కాగా చాలా మంది బిజీ షెడ్యూల్ కారణంగా దీనిని మర్చిపోతుంటారు. ఫలితంగా ఆరోగ్యం రిస్కులో పడవచ్చు. లైఫ్ క్వాలిటీ తగ్గుతుంది. అలాగే శరీరానికి తగినంత నీరు అందకపోడంవల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమై, సంతోషకరమైన జీవితానికి నీరు తాగడం కూడా చాలా ముఖ్యం.
Read More: ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోయే అలవాటు ఉందా..? ఇది తెలుసుకోండి!