Calcium : యువతలోనూ కాల్షియం లోపం.. ఈ సంకేతాలు కనిపిస్తే బీ కేర్ ఫుల్!

Calcium : యువతలోనూ కాల్షియంలో లోపం.. ఈ సంకేతాలు కనిపిస్తే బీ కేర్ ఫుల్!

Update: 2024-12-04 08:34 GMT

దిశ, ఫీచర్స్ : మానవ శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన ఖనిజాల్లో కాల్షియం ఒకటి. ఎముకలు, దంతాలు, కండరాల బలానికి, వాటి సమర్థవంతమైన పని తీరుకు ఇది చాలా ముఖ్యం. ఒకప్పుడు మిడిల్ ఏజ్ గల వారిలోనే ఈ లోపం ఎక్కువగా కనిపించేది. కానీ ప్రస్తుతం యువతరాన్ని కూడా వేధిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 22 శాతం మంది యువతీ యువకులు కాల్షియం లోపంతో తమ తమ పనుల్లో, కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇంతకీ ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం.

కండరాల తిమ్మిరి

సాధారణంగా శరీరానికి తగిన మేరకు పోషకాలు అందకపోవడం, అధిక కెఫిన్ వినియోగం, జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు వంటివి యువతలో కాల్షియం లోపానికి కారణం అవుతున్నాయి. ఈ పరిస్థితి బలహీనమైన ఎముకలు మొదలు ఇతర అనారోగ్యాలకు దారితీస్తోంది. అలాంటి వాటిలో కండరాల తిమ్మిరి ఒకటి. నరాలు, కండరాల సంకోచానికి, అవి బలంగా ఉండటానికి కాల్షియం చాలా ముఖ్యం. కానీ ప్రస్తుతం యువతలోనూ ఇది లోపిస్తోంది. దీనిని భర్తీ చేయడంలో పాలు, పెరుగు, జున్ను, ఆకుకూరలు వంటి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం అవసరం. ఆరోగ్య నిపుణుల సూచనలను బట్టి లోపాన్ని అధిగమించడానికి అవసరమైతే కాల్షియం సప్లిమెంట్లు కూడా యూజ్ చేయవచ్చు.

గోర్లు పెళుసుగా మారడం

గోర్లు సాధారణం కంటే తెల్లగా, బలహీనంగా, పెళుసుగా మారడం వంటి లక్షణాలు కూడా కాల్షియం లోపానికి సంకేతాలుగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. గోర్లలో ఎంతో కీలకమైన కెరాటిన్ అనే ప్రొటీన్‌ తయారు కావడానికి కాల్షియం చాలా ముఖ్యం. అది సరిగ్గా అందనప్పుడు కెరాటిన్ ఉత్పత్తి కాదు. దీంతో గోళ్లు బలహీనంగా, పెళుసుగా మారి విరిగిపోతుంటాయి. నువ్వులు, బాదం పప్పు, తృణ ధాన్యాలు వంటివి ఆహారంలో భాగంగా చేర్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

దంత క్షయం లేదా బలహీనత

తరచుగా దంతక్షయం, పళ్లు జివ్వు మని లాగడం వంటివి కాల్షియం లోపం వల్ల తలెత్తే సమస్యలే. ఇటీవల యువతలోనూ అధికంగా కనిపిస్తున్నాయి. కాల్షియంలోని ఎనామెల్ అనే పదార్థం దంతాల దృఢత్వానికి ముఖ్యం. అందుకే ఇది లోపిస్తే దంతాలు బలహీనంగా మారుతాయి. జంక్ ఫుడ్స్ తగ్గించి, పాలు, పాల ఉత్పత్తులు, టోఫు, కాల్షియం - ఫోర్టిఫైడ్ జ్యూస్, ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వంటివి ఉపయోగించడం దంత సంరక్షణకు సహాయపడతాయి.

శారీరక బలహీనత, అలసట

కొంతమంది పెద్దలు గంటల తరబడి వివిధ పనుల్లో నిమగ్నమైనప్పటికీ.. అలసిపోని వారిని మనం చూస్తుంటాం. కొంతమంది యుక్త వయసులో కూడా కాసేపు కదలకుండా కూర్చున్నా, చిన్న చిన్న పనులు చేసినా, చివరకు మెట్లు ఎక్కినా తీవ్రమైన అలసటను ఎదుర్కొంటుంటారు. కాల్షియం లోపమే కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అత్తి పండ్లు, బాదం, పాలు, ఆకు కూరలు వంటివి ఆహారంలో చేర్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

కాళ్లు, చేతుల్లో జలదరింపులు

ఒకే దగ్గర కూర్చొని పనిచేస్తున్న ఉద్యోగుల్లో, ముఖ్యంగా చదువుకుంటున్న యువతలో అకస్మాత్తుగా కాళ్లు, చేతులు కొద్ది క్షణాలు వణకడం లేదా జలదరింపులు సంభవించడం వంటి ప్రాబ్లమ్స్ ఇటీవల కామన్ అయిపోతున్నాయి. ఇది కూడా కాల్షియం లోపానికి సంకేతమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి తగిన కాల్షియం అందకపోవడంవల్ల నరాల బలహీనతకు తద్వారా జలదరింపులు లేదా తిమ్మిర్లకు కారణం అవుతుంది. పాలకూర, బచ్చలి కూర, తోటకూర, కాలే, ఇతర బలవర్ధకమైన మొక్కల ఆధారిత ఆహారాలు, పాలు, సాల్మన్ చేపలు బచ్చలికూర వంటివి తీసుకోవడంవల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అధిక సోడియం కలిగిన ఆహారాలను నివారించాలి.

గాయాలు త్వరగా మానకపోవడం

ఏదైనా గాయం తగిలినప్పుడు కొంత కాలానికి సహజంగానే మానిపోతుంది. అయితే చాలా రోజులైనప్పటికీ మానకపోవడం లేదా ఆలస్యంగా మానడం వంటి సంకేతాలు కనిపించినా మీ శరీరంలో కాల్షియం లోపానికి సంకేతమే. ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారు బ్రోకలీ, బోక్ చోయ్, సాల్మన్ చేపలు, మెగ్నీషియం, విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

పగుళ్లు లేదా ఎముకల నొప్పి

ఎముకల్లో నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, ఎముకలు, కండరాల్లో పగుళ్లు వంటివి కూడా కాల్షియం లోపానికి సంకేతాలుగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా బోన్స్ పెళుసుగా మారడం, చిన్న దెబ్బ తగిలినా తీవ్రంగా గాయపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాల్షియం అధికంగా లభించే ఆహారాలు, ముఖ్యంగా నువ్వులు, అవిసి కూర, కరివేపాకు, రాగులు, ఉలవలు, సాల్మన్ చేపలు, టోఫు, వైట్ బీన్స్, బ్రోకలి, అత్తి పండ్లు, పాలు, ఆకు కూరలు ఆహారంలో భాగంగా తీసుకోడం వల్ల క్రమంగా ఈ సమస్యను అధిగమించవచ్చు. దీంతోపాటు ఎముకల సాంద్రతను బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యాయామాలు చేయాలంటున్నారు ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News