దిశ, ఫీచర్స్: పిల్లలందరూ ఎప్పుడూ ఒకేలా ఉండరు. వారు రోజంతా అరుస్తూ.. గొడవ చేస్తూ ఉండడం సహజమే. కొందరు పిల్లలు తెలివిగా క్రమశిక్షణగా ఉంటారు. మరికొందరు ఏ విషయంలోనైనా మందకొడిగా ఉంటారు. ఇలా ఉన్నంతమాత్రానా వారిని తక్కువగా అంచనా వేయకండి. సాధారణంగా చిన్నతనంలో చాలామంది అల్లరి చేస్తుంటారు. పిల్లలకు ఎవరి ముందు ఎలా ఉండాలి? ఎక్కడ ఎలా ప్రవర్తించాలనే విషయాలు తెలియవు. అలాంటి విషయాలను తల్లిందండ్రులు పిల్లలకు తెలియజేయాలి. అంతేకాని నలుగురింలో వారిని తిట్టకూడదు. విద్యా, క్రీడలు వంటి విషయాల్లో చాలామంది పేరెంట్స్ ఇతరుల పిల్లలతో పోల్చుతారు. ఇలా చేయడం వల్ల కలిగే పర్యవసానాలు ఏంటో తెలుసుకోండి.
ఇతరులతో పోల్చడం..
పిల్లలను ఎప్పుడూ ఇతర పిల్లలతో పోల్చకూడదు. ముఖ్యంగా బంధువుల పిల్లలతో. ఇలా చేయడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఎవరి వ్యక్తిత్వాలు వారికి ఉంటాయి. విద్యా విషయంలోనే కాదు మరే ఇతర విషయాల్లోనైనా పిల్లల నైపుణ్యాలను గుర్తించి వాటి ఆధారంగా వారి లక్ష్యాలను నిర్దేశించాలి. పిల్లలకు భావోద్వేగాలు ఎక్కువగానే ఉంటాయి. వాటిని నియంత్రించేందుకు తల్లిదండ్రుల సాయం అవసరం అవుతుంది. అందువల్ల వీలైనంతవరకు ఇతరులతో పోల్చడం, నలుగురిలో చులకనగా చూడడం వంటివి చేయకండి. ఇలా చేయడం వల్ల వారు మానసికంగా క్రుంగిపోయే అవకాశం ఉందని పేరెంటింగ్ నిపుణులు చెబుతున్నారు.
పరీక్షల విషయంలో..
పరిక్షలలో విషయంలో మార్కులు తక్కువగా వచ్చినప్పుడు లేదా ఫెయిల్ అయినప్పుడు పిల్లలను ఇతరులతో పోల్చుతారు. ఇలా చేయడం వల్ల వాళ్లలో నిరుత్సాహం పెరుగుతుంది. పిల్లలు ఏం సాధించినా వారిని మెచ్చుకోండి. వాళ్లు గెలిచిన బహుమతులను నలుగురికి చూపించి గొప్పగా చెప్పండి. ఇటువంటి ప్రశంస వారలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒకవేళ ఓటమిపాలైతే దానిని కూడా పేరెంట్స్ స్వీకరించాలి. ఓటమిని సానుకూలంగా విశ్లేషించి, గెలవడం ఎలాగో వారికి నేర్పించాలి.
భయంతో బాధపెట్టకండి..
చాలామంది పిల్లలు కొన్ని విషయాల్లో మందకొడిగా ఉంటారు. ఈ మాత్రం దానికే పేరెంట్స్ భయపడి వారిని అన్నీ విషయాల్లో ఇబ్బంది పెట్టకూడదు. ధైర్యం, తెలివితో ఓటమిని అధిగమించాలని వారికి చెప్పాలి. జీవితంలో మీరు ఎదుర్కొన్న సవాళ్లు, కష్టాలను గురించి వారికి తెలియజేయాలి. నీ కోసం అది చేశాను, ఇది చేశాను నువ్వు ఇలా ఉంటే ఎలా? చదవకపోతే ఎలా అంటూ వారిపై ఒత్తిడిని కలిగించకండి. ఇలా చేయడం వల్ల పిల్లలకు తల్లిదండ్రులపై ప్రతికూల భావం ఏర్పడే అవకాశం ఉంటుంది.
సామాజిక నైపుణ్యాలు..
బయటి వ్యక్తులు అయినా.. బంధువుల ముందు అయినా పిల్లలను తిడితే వారు క్రమశిక్షణ లేనివారిగా తయారవుతారు. ఇలా చేయడం వల్ల వారిలో అభద్రతా భావాన్ని పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా పిల్లలలో సామాజిక నైపుణ్యాలు, సంబంధాలు క్షీణించే అవకాశం ఉంటుంది.
ఎలా ఉండాలి?
పిల్లల తప్పులకు పేరెంట్స్ ఎప్పుడూ తిట్టకూడదు. ప్రేమగా వారిని దగ్గరికి తీసుకొని తప్పుల గురించి తెలియజేయాలి. నలుగురిలో పిల్లలను మెచ్చుకోవడం, వారి ప్రతిభ గురించి చెప్పడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.