Popcorn brain : ప్రతి క్షణం అదే ధ్యాస.. వదిలి ఉండలేరు.. తరచూ ఫోన్లో దూరిపోతూ..
ఏదైనా మెసేజ్ వచ్చిందేమోనని మళ్లీ మళ్లీ చెక్ చేస్తారు. కాల్స్ ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే..
దిశ, ఫీచర్స్ : మీరు వర్కులో బిజీగా ఉంటారు. కంప్లీట్ అయ్యే వరకు మరో విషయంపై కేంద్రీకరించవద్దని అనుకుంటారు. కానీ కట్టుబడి ఉండలేరు. పని మధ్యలో ఉండగానే సడెన్‌గా ఫోన్ గుర్తుకు వస్తుంది. ఏదైనా మెసేజ్ వచ్చిందేమోనని మళ్లీ మళ్లీ చెక్ చేస్తారు. కాల్స్ ఏమైనా వస్తాయేమోనని దానివైపే చూస్తుంటారు. ఈ పరిస్థితి వల్ల పనిపై ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడుతుంటారు. క్రమంగా ఇదొక అలవాటుగా మారుతుంది. దీనినే ‘పాప్ కార్న్’ బ్రెయిన్ అంటున్నారు నిపుణులు. ఒక విధంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ చెక్ చేయాలన్న కుతూహలంతో ఇతర ముఖ్యమైన విషయాల నుంచి మీ మైండ్ డైవర్ట్ అవుతుంది.
కారణం ఇదే..
ప్రస్తుతం వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌తోపాటు స్మార్ట్‌ఫోన్ జీవితంలో ఒక భాగమైపోయింది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కానీ అప్రమత్తంగా ఉండకపోతే నష్టం కూడా ఉంటుందని, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. పదే పదే ఫోన్ చెక్ చేయాలన్న బలమైన కోరికను కలిగించే ఫీలింగ్(పాప్ కార్న్ బ్రెయిన్)కు అదే కారణమని కూడా మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజెంట్ యువతలో ఇదొక సమస్యగానూ మారుతోంది.
‘డిజిటల్’ ఎఫెక్ట్
పాప్ కార్న్ బ్రెయిన్ అనేది డిజిటల్ పరికరాలపై ఆధారపడి అత్యధిక సమాచారం తీసుకోవడంవల్ల, గ్రహించడంవల్ల ఏర్పడే చంచలమైన మనస్తత్వానికి నిదర్శనంగానూ నిపుణులు పేర్కొంటారు. ఇది మెదడుపై ఒత్తిడి కలిగించడంవల్ల ఒక అంశంపై పూర్తిగా ఫోకస్ చేయలేకపోతారు. ఒకేసారి నాలుగైదు అంశాలను చూడటం, చదవడం, సమాచారాన్ని సేకరించడం కారణంగా మనసు గందరగోళానికి గురవుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో నోటిఫికేషన్ లేదా మెసేజ్ వచ్చిన సౌండ్ రాగానే చేస్తున్న పనిని మధ్యలో వదిలేసి దానిని చూడటానికి టైమ్ కేటాయిస్తారు. ఒత్తిడిలో ఇలాంటి పని చేయడం కారణంగా స్థిరమైన ఆలోచనకు ఆటంకం కలుగుతుంది. ఆ క్షణం ఏకాగ్రతను కోల్పోతుంటారు. కొన్నిసార్లు ఏదో పరధ్యానంలో మునిగిపోతుంటారు.
ఎలా బయటపడాలి?
‘పాప్‌కార్న్ బ్రెయిన్’కు ప్రధాన కారణం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే నోటిఫికేషన్లను చెక్‌చేసే అత్యుత్సాహం, ఆసక్తి ఎక్కువగా ఉండటంవల్ల అసలు పనిని అసంపూర్తిగా చేస్తారు. దీంతోపాటు తక్కువ సమయంలో ఎక్కువ సమాచారంతో మెదడు చిక్కుకుపోతుందని ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే.. మీ మెదడుకు మీరే ట్రైనింగ్ ఇవ్వాలి. ఫోన్‌లో, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో నోటిఫికేషన్లు చెక్ చేయకూడదని, ముఖ్యమైన పని వదిలి వాటిపై కేంద్రీకరించకూడదని పదే పదే అనుకోవాలి. మిమ్మల్ని ప్రభావితం చేసిన ఆలోచనల ట్యూన్‌ను మీకు మీరే సెట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే ఏ అలవాటు అయితే మీలో రుగ్మతకు దారితీసిందో.. ఆ అలవాటును మార్చుకోవాలి. అప్పటికే సాధ్యం కాకపోతే సైకాలజిస్టులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.