Motivational : జీవితాన్ని మలుపు తిప్పే గెలుపు సూత్రాలు.. ఆచరిస్తే సక్సెస్ మీదే!
దిశ, ఫీచర్స్ : జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు మిమ్మల్ని ఆనంద పారవశ్యంలో ముంచెత్తే సందర్భాలు ఎదురౌతుంటాయి. మరొకొన్నిసార్లు ఒడిదుడుకుల సుడిగుండాలు వెంటాడుతుంటాయి. ఇంకొన్నిసార్లు సమస్యలు అధికమై సవాళ్లు విసురుతుంటాయి. ఇవి ఏ ఒక్కరి విషయంలోనో కాదు, ప్రతీ ఒక్కరి పర్సల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌లో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోవాల్సిన అనుభవాలుగా ఉంటాయని మోటివేషనల్ అండ్ పర్సనల్ స్కిల్స్ అంటున్నారు. సరిగ్గా అలాంటప్పుడే మీరు తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని మలుపు తిప్పగలిగే గెలుపు సూత్రం కావాలంటే మీరు తప్పక కలిగి ఉండాల్సిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.
భావోద్వేగాల నియంత్రణ
మనుషులన్నాక బాధలు, కష్టాలు, నష్టాలు వచ్చి పోతుంటాయ్. అయితే ఇక్కడ భావోద్వేగాలు కూడా మీ గెలుపోటములను నిర్ణయిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఇవి అస్సలు లేకపోవడం లేదా అతి భావోద్వేగాలు కూడా మీకు నష్టం కలిగిస్తాయి. కాబట్టి కోపం, బాధ, సంతోషం, ఏడుపు, దుఃఖం.. ఇలా ఏది వచ్చినా ఆ ఉద్వేగ భరిత సందర్భాన్ని అనుభవించడంతోపాటు కంట్రోల్ చేయగలిగే శక్తి సామర్థ్యాలను అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు. కొందరు తామున్న రంగంలో రాణించకపోవడానికి భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడం కూడా ఒక ఆటంకంగా మారుతుంది. కాబట్టి చదువులో, ఉద్యోగంలో, జీవితంలో, ఎక్కడైనా, ఎప్పుడైనా ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు విచక్షణగా ఆలోచించండి. ఆ సందర్భంలో వాటిని ఎలా కంట్రోల్ చేయాలో అర్థమైతే మీకు ఎదురే లేదిక.
స్వీయ క్రమశిక్షణ
తెలియనప్పుడైతే ఒకే. కానీ తెలిసి కూడా మీరు స్వీయ క్రమ శిక్షణ పాటించడం లేదంటే అది మీకు చాలా నష్టాన్ని కలిస్తుందని నిపుణులు చెప్తున్నారు. పైగా అదేం బ్రహ్మ విద్య కాదు, మీరు సాధన చేయడం ద్వారా అలవడే స్వీయ నియంత్రణ సామర్థ్యం. మీరున్న రంగంలో, వృత్తిలో రాణించడానికి ఇది చాలా అవసరం. స్వీయ క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడే ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు. అదే మీలో ఆత్మ విశ్వాన్ని నింపుతుంది. అదే జీవితాన్ని విజయ తీరాలవైపు నడిపిస్తుంది.
కృతజ్ఞతా భావం
మీరు సమర్థులుగా నిలబడాలంటే ఉండాల్సిన మరో లక్షణం కృతజ్ఞతా భావం. ఇది ఆరోగ్యానికి మేలు చేసే చక్కటి మానసిక పరిస్థితికి నిదర్శనం అంటున్నారు నిపుణులు. ప్రతీ క్షణం, ప్రతీ నిమిషం, ప్రతీ గంట, ప్రతీ రోజు మీరు ఎదుర్కొన్న ప్రతీ సానుకూల అనుభవం పట్ల కృతజ్ఞతగా ఉండండి. మీకు సహాయం చేసిన వారిని గుర్తుకు తెచ్చుకోండి. మిమ్మల్ని ప్రోత్సహించే వారికి మనసులోనైనా సరే థ్యాంక్స్ చెప్పుకోండి. మీరు ఏ వ్యక్తుల వల్ల, ఏ పరిస్థితులవల్ల, ఎలాంటి పరిణామాలవల్ల ప్రయోజనం పొందారో ఆలోచించుకోండి. వాటన్నింటిపట్ల కృతజ్ఞత కలిగి ఉండటం మీలో అంతులేని ఆనందానికి దారితీస్తుంది. మీ మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది.
మైండ్ ఫుల్ నెస్
గతంలో మిమ్మల్ని సంతోషానికి గురిచేసే అనుభవాలు ఎదురై ఉండవచ్చు. బాధలను కూడా అనుభవించి ఉండవచ్చు. భవిష్యత్తులో ఏం జరుగుతుందోననే ఆందోళన కూడా వెంటాడుతూ ఉండవచ్చు. కానీ వీటిని ఎలా స్వీకరిస్తారు? ఎలా మేనేజ్ చేస్తారు? అనేదే ముఖ్యం. గతం గురించి ఆలోచిస్తూ, ఫ్యూచర్ గురించి టెన్షన్ పడుతూ ఉంటే మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. కాబట్టి వర్తమానంలో జీవించండి. ఇప్పుడున్న పరిస్థితిలో, ఈ క్షణంలో, ఈ నిమిషంలో మీ గోల్ ఏంటో ఆలోచించండి. మీరు చేసే పనిలో పూర్తిగా నిమగ్నమైపోండి. దీంతో మీలో మైండ్ ఫుల్ నెస్ అలవడుతుంది. అప్పుడు మిమ్మల్ని వెంటాడే ప్రతికూల ఆలోచనలు, ఒత్తిడి, ఆందోళన వంటివి దూరమైపోతాయి.
క్షమాగుణం
తెలిసో తెలియకో మనుషులందరూ పొరపాట్లు చేస్తుంటారు. కానీ కొందరు వాటిని అంగీకరించరు. క్షమాపణ కూడా చెప్పరు. అలా చెప్పడం తమ బలహీనతను బయటపెడుతుంది అనుకుంటారు. ఇదే మీలోని అహంకారానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనం అంటున్నారు నిపుణులు. నిజం చెప్పాలంటే సారీ చెప్పడానికి, ఇతరులను క్షమించడానికి కూడా కొండంత ధైర్యం కావాలి. పైగా చేసిన పొరపాటును లేదా తప్పును గ్రహించినప్పుడు క్షమాపణ చెప్పడం మీలోని ఆత్మన్యూతా భావాన్ని, అహంకారాన్ని పోగొడుతుంది. మీలో సమర్థతను పెంచుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తలొగ్గని వారు కూడా ‘క్షమించండి’ అనే ఒకే ఒక్క మాటకు కరిగిపోతారు. పైగా మీరున్న రంగంలో అవాంతరాలను ఎదుర్కొని, నైపుణ్యాన్ని అలవర్చుకునేందుకు ఇదొక చక్కటి మార్గం కూడాను. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు సారీ చెప్పడం, ఇతరులను క్షమించడం మర్చిపోకండి.
Read More..