Cardio vs Weight Lifting: కార్డియో.. వెయిట్ లిఫ్ట్.. ఆరోగ్యానికి ఏ వ్యాయామం మంచిది?
Cardio vs Weight Lift : కార్డియో.. వెయిట్ లిఫ్ట్.. ఆరోగ్యానికి ఏ వ్యాయామం మంచిది?
దిశ, ఫీచర్స్ : ఫిట్‌నెస్ అండ్ ఫిజికల్ హెల్త్‌పై యువతలో రోజు రోజుకూ ఆసక్తి పెరుగుతోంది. జిమ్‌లకు వెళ్లి రకరకాల వ్యాయామాలు ప్రయత్నించేవారు చాలా మందే ఉంటున్నారు. అయితే వీటిలోనూ పలు రకాలు ఉంటాయి. శరీర సౌష్టవానికి, ఆరోగ్యానికి అవసరమయ్యే కసరత్తుల మధ్య తేడా తెలిసి నడుచుకోకపోతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అలాగే కార్డియో, వెయిట్ లిఫ్ట్.. ఈ రెండింటిలో ఏది మంచిదనే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తుంటారు. నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.
కార్డియోతో బెనిఫిట్స్
వ్యాయామాలు అన్నీ మంచివే అయినప్పటికీ అతి వ్యాయామాలు మాత్రం తగదు అంటున్నారు నిపుణులు. ఇక స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటివి కార్డియో (Cardio) ఎక్సర్‌సైజ్ కేటగిరీలోకి వస్తాయి. వీటిని ప్రయత్నించడంవల్ల కేలరీలు బర్న్ అయి, అధిక బరువు తగ్గడంలో సహాయపడతాయి. రెగ్యులర్‌గా చేసేవారిలో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. పక్షవాతం, గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి ప్రాణాంతక సమస్యలను నివారించవచ్చునని ఫిట్‌నెస్ నిపుణులు చెప్తు్న్నారు. పైగా వీటివల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అయి ఒత్తిడి, ఆందోళన దూరం అవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే కార్డియో వ్యాయామాల వల్ల గుండెకు మంచిది కానీ.. కండరాలు పెంచుకోవాలనుకునేవారికి మాత్రం వీటివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. పైగా సక్రమంగా చేయకపోతే గాయపడే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
వెయిట్ లిఫ్టింగ్ ప్రయోజనాలు
ఫిట్‌నెస్‌పై ఆసక్తితో జిమ్‌లలో వెయిట్ లిఫ్టింగ్ (Weight Lift) వ్యాయామాలను చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కండరాల పెరుగుదలకు ఇవి చక్కటి మార్గమని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగు పర్చడంలో, ఎముకల బలోపేతానికి, శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించడానికి బరువులు ఎత్తే వ్యాయామాలు సహాయపడతాయి. వీటివల్ల కలిగే నష్టాల విషయానికి వస్తే.. కోచ్ లేదా నిపుణుల శిక్షణ లేకుండా ప్రయత్నించడం వల్ల కండరాల్లో నొప్పి, ఎముకలకు గాయాలు వంటివి సంభవిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచిదే కానీ.. ప్రత్యేకించి గుండె ఆరోగ్యానికి మాత్రం ఎలాంటి లాభం ఉండదు. అందుకోసం కార్డియో మేలు.
ఇలా చేస్తే బెటర్
కార్డియో వ్యాయామాలు ఒక రకమైన ప్రయోజనాలు కలిగిస్తే.. వెయిట్స్ లిఫ్ట్ ఎక్సర్‌సైజ్‌లు మరో రకమైన ప్రయోజనాలు కలిగిస్తాయి. కాబట్టి ఈ రెండింటివల్ల బెనిఫిట్స్ పొందేలా ప్లాన్ చేసుకోవడం మంచిది అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. అందుకోసం వారంలో 2 నుంచి 4 సెషన్లు క్రియేట్ చేసుకొని, ప్రతీ సెషన్‌లో అరగంట కార్డియోకే కేటాయించడం బెటర్. అలాగే కార్డియో సెషన్స్ ముగిశాక వెయిట్ లిఫ్టింగ్ కూడా 30 నుంచి 40 నిమిషాలు చేయడం మంచిది. అయితే ఒకే రోజు కార్డియో, వెయిట్ లిఫ్టింగ్ సెషన్స్ పెట్టుకోకుండా వేర్వేరు రోజుల్లో ఉండేలా చూసుకోవాలంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. వీటన్నింటినీ ప్రయత్నించే ముందు ఫిట్‌నెస్ నిపుణుల సలహాలు మాత్రం తప్పనిసరి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.