Anxiety: చిన్న విషయానికే ఆందోళన.. వీటిని వదిలేస్తేనే రిలీఫ్!
Anxiety: చిన్న విషయానికే ఆందోళన.. వీటిని వదిలేస్తేనే రిలీఫ్!
దిశ, ఫీచర్స్ : అనుకున్నది జరగకపోతే ఆందోళన.. జర్నీలో ఆలస్యమైతే ఆందోళన, పరీక్షలు దగ్గరపడుతుంటే ఆందోళన.. పరీక్షలు ముగిసినా ఆందోళనే.. అప్పులెక్కువైనా ఆందోళన.. అప్పు పుట్టకపోయినా ఆందోళనే.. ఇలా ప్రతీ విషయంలో ఆందోళన చెందుతుంటారు చాలామంది. నిజానికి ఆందోళన, ఆత్రుత, టెన్షన్ వంటివి కూడా మనిషిలోని సహజ లక్షణాలే కానీ.. మరీ ఎక్కువైతేనే కష్టం. కొన్ని డైలీ హాబిట్స్, పరిస్థితుల ప్రభావాలు కూడా మనలో ఆందోళనను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటి, వాటిని ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
* కెఫిన్ అధిక వినియోగం : కాఫీ మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ అతిగా తాగితే మాత్రం ఆందోళనకు దారితీస్తుంది. అందులోని కెఫిన్ మీలో అప్పటికే ఉన్న యాంగ్జైటీని మరింత ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఆందోళన, భయం వంటివి పెరుగుతాయి. కెఫిన్ వాడకాన్ని తగ్గించాలంటున్నారు నిపుణులు.
* పనులు వాయిదా వేయడం : ఆయా పనుల నిర్వహణలో చూద్దాం లే.. చేద్దాం లే అనే ధోరణి పలువురిలో ఆందోళనకు కారణం అవుతుంది. ముఖ్యంగా అవసరమైన సమయానికి చేయకుండా వాయిదా వేయడంవల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ముఖ్యమైన పనులను వాయిదా వేసేకంటే.. కాస్త ఇబ్బంది అనిపించినా సమయానికి పూర్తి చేసుకోవడం మీలోని యాంగ్జైటీని తగ్గిస్తుంది.
*నిద్రలేకపోవడం : ప్రస్తుతం యువతలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో నిద్రలేమి ఒకటి. రాత్రిళ్లు ఎక్కువసేపు స్క్రీన్లకు అతక్కుపోవడం, ఇన్‌స్టా, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి వేదికల్లో నిమగ్నమైపోవడం వంటి కారణాలతో చాలామంది సమయానికి నిద్రపోరు. క్రమంగా ఇది నిద్రలేమికి దారితీస్తుంది. సమయానికి నిద్రలేకపోవడం కూడా శరీరంలో జీవక్రియలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఒత్తిడి, ఆందోళన వంటి భావాలను పెంచుతుంది. మీరు యాంగ్జైటీస్ నుంచి బయటపడాలంటే సమయానికి నిద్రపోవడం మంచిది.
*సోషల్ మీడియా అతి వినియోగం : సోషల్ మీడియాను మన అవగాహనకోసం, అవసరం కోసం ఉపయోగించుకోవడంవల్ల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అదే పనిగా రాత్రింబవళ్లు ఎక్కువ సమయం అందులోనే నిమగ్నమైపోతే మాత్రం స్ట్రెస్, యాంగ్జైటీస్ పెరుగుతాయి. ఇటీవల యువతలో ఈ ధోరణి పెరుగుతోంది. వర్క్‌ప్లేస్‌లలో, ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, కామెంట్లు, సంఘటనలు మీలో ఆందోళన కలిగించేవి కూడా కావచ్చు. కాబట్టి అలాంటి చాన్స్ ఉంటే సోషల్ మీడియాను లిమిటెడ్‌గా వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
*నెగెటివ్ థాట్స్ : ప్రతీ విషయంలో నెగెటివ్, పాజిటివ్ ఉంటాయి. కానీ కొందరు పాజిటివ్ వదిలేసి నెగెటివ్ విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దీనివల్ల ఆందోళన మరింత పెరుగుతుంది. కాబట్టి మీలో ప్రతికూల ఆలోచనలు మెదులుతుంటే వాటిని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాలి. వాటివల్ల ఏమిటి లాభం? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే సమస్య నుంచి బయటపడతారు. అలాగే ప్రతికూల పరిస్థితులను, ఆలోచనలను ఎదుర్కోవాలంటే మీలో విషయ పరిజ్ఞానం, అవగాన, సామాజిక స్పృహ కూడా అవసరం అంటున్నారు నిపుణులు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More ....
Health : స్మోకర్స్‌కి అలర్ట్ ..! మీరు తాగే ఒక్కో సిగరెట్ 22 నిమిషాల ఆయుష్షును తగ్గిస్తుంది!