ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటున్నారా?.. ఈ ముప్పు తప్పదు!

కొందరు ఒకసారి వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టేసి తర్వాత తినడానికి ముందు ప్రతిసారీ వేడి చేసుకొని తింటుంటారు.

Update: 2024-06-08 09:36 GMT

దిశ, ఫీచర్స్ : కొందరు ఒకసారి వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టేసి తర్వాత తినడానికి ముందు ప్రతిసారీ వేడి చేసుకొని తింటుంటారు. అలాగే బేకరీల్లో కూడా ఎప్పుడో తయారు చేసిన ఎగ్ పఫ్‌లు, సమోసాలు, వివిధ ఆహార పదార్థాలు వేడి చేసి ఇస్తుంటారు. కానీ ఇలా తినడం ప్రమాదకరం అని మీకు తెలుసా?

రాత్రి వండిన అన్నం లేదా ఇతర పదార్థాలను వేడి చేసి తినడంవల్ల ఫుడ్ సేవ్ అవుతుందని కొందరు భావిస్తుంటారు. కానీ నిజానికి హెల్త్ పాడవుతుందని నిపుణులు చెప్తున్నారు. పైగా ఇలా చేయడంవల్ల ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’ బారిన పడతారని హెచ్చరిస్తు్న్నారు.

అమెరికన్ జర్నల్ ఆఫ్ బయోమెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం.. ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’ అనేది మనం తినే ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధి. ముఖ్యంగా వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సమయం ఉంచినప్పుడు దానిపై బాసిల్లాస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది.

ఆహారంపై బాసిల్లాస్ సెరియస్ బ్యాక్టీరియా ఒక రకమైన విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఆ ఫుడ్ కలుషితం అవుతుంది. తినడంవల్ల ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. వాంతులు, విరేచనాలు, మోషన్స్ వంటివి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితినే ఫ్రైడ్‌ రైస్ సిండ్రోమ్‌గా పేర్కొంటారు. నిర్లక్ష్యం చేస్తే మరణం కూడా సంభవించవచ్చు. సాధారణంగా అన్నం, పాస్తా, నూడుల్స్, మాంసం, కూరగాయలు, స్వీట్లు వంటి పదార్థాలను గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచడం వల్ల ఇక బాసిల్లాస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది.

కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం.. ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్‌కు కారణమయ్యే బాసిల్లాస్ సెరెయస్ బ్యాక్టీరియా రెస్టారెంట్లలో ఎక్కువగా ఫామ్ అయ్యే చాన్స్ ఉంది. ఇటీవల ఓ కాలిఫోర్నియాలోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసిన దాదాపు 150 మంది వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలను అనుభవించడాన్ని అబ్జర్వ్ చేసిన రీసెర్చర్స్ అందుకు బాసిల్లాస్ సెరెయస్ అనే బ్యాక్టీరియానే కారణమని కనుగొన్నారు. ఒకసారి వండిన పదార్థాలను ఎక్కువసార్లు వేడి చేసి తినకపోవడమే ఈ సమస్యకు పరిష్కారం. 


Similar News