Viral video : వింత వ్యాధి.. తనకు తెలియకుండానే నిద్రలో షాపింగ్ చేస్తున్న మహిళ!

షాపింగ్ చేయడం కొందరికి సరదా అయితే మరి కొందరికి అదో అలవాటు. పండుగలు, వివిధ శుభకార్యాల సందర్భంగా ఏదో ఒకటి కొనకపోతే నిద్రపట్టదని చెప్పేవాళ్ల గురించి కూడా వింటుంటాం.

Update: 2024-06-10 07:32 GMT

దిశ, ఫీచర్స్ : షాపింగ్ చేయడం కొందరికి సరదా అయితే మరి కొందరికి అదో అలవాటు. పండుగలు, వివిధ శుభకార్యాల సందర్భంగా ఏదో ఒకటి కొనకపోతే నిద్రపట్టదని చెప్పేవాళ్ల గురించి కూడా వింటుంటాం. కానీ నిద్రలోనే షాపింగ్ చేసేవారి గురించి మీరెప్పుడైనా విన్నారా? కొందరికి ఈ అలవాటు కూడా ఉంటుందట. తమకు తెలియకుండానే మధ్య రాత్రిళ్లు లేచి నచ్చిన వస్తువులు కొనేస్తుంటారు. మరుసటి రోజు మెలకువ వస్తే గానీ అసలు విషయం గ్రహించలేకపోతారు. ప్రజెంట్ ఓ మహిళ అలాంటి వింత సమస్యతో బాధపడుతోంది.

యూకేకు చెందిన నలభై రెండేళ్ల వయస్సుగల మహిళ కెల్లీ నైప్స్‌ పొద్దస్తమానం బాగానే ఉంటుంది. కానీ రాత్రి పడుకున్నాక మధ్య రాత్రిళ్లు లేచి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తూ.. క్రిడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా నగదు చెల్లిస్తూ డబ్బులు పోగొట్టుకుంటుంటున్నది. పైగా ఈ పనిచేస్తున్నప్పుడు ఆమె స్పృహలో ఉండదట. ఆన్‌లైన్‌లో ఏం ఆర్డర్ చేస్తున్నది, ఎన్ని డబ్బులు చెల్లిస్తున్నది ఆ సమయంలో గుర్తుండదు. మరుసటి రోజు నిద్రలేచాక షాపింగ్ చేసినట్లు మెసేజెస్ రావడం, కార్డులో డబ్బులు కట్ కావడం వంటివి చూసుకొని బాధపడుతుంది. అయితే పారాసోమ్నియా అనే అరుదైన స్లీపింగ్ డిజార్డర్ వల్ల ఆమె ఇలా చేస్తుందట.

ఇటీవల ఓ రోజు రాత్రి కెల్లీ నైప్స్‌ పిల్లలకు సంబంధించిన అనేక ఆట వస్తువులను, ఇంట్లోకి అవసరం లేకపోయినా పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులను, ఫ్రిడ్జ్‌ను కొనుగోలు చేసింది. క్రెడిట్ కార్డు ద్వారా బిల్లులు చెల్లించేసింది. ఇలా ప్రతిరోజూ లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటోంది. పైగా ఈ వింత వ్యాధి కారణంగా ఆమె సైబర్ మోసాలకు కూడా గురవుతోంది. అరుదైన పారసోమ్నియా నుంచి బయటపడేందుకు ముక్కుకి శ్వాస సంబధ సమస్యల నిమిత్తం అమర్చుకునే ఓ డివైస్‌ను కూడా అమర్చుకుందట కెల్లీ.

నిద్రలో అలర్ట్ చేసే పరికరాన్ని అమర్చుకున్నా అది కెల్లీ చేసే విచిత్ర పనులను, అర్ధరాత్రి షాపింగ్‌ను అడ్డుకోలేకపోతోంది. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నిపుణుల సలహాలు కోరుతోంది. కాగా ఈ అరుదైన వ్యాధికి ట్రీట్మెంట్ అయితే లేదు అంటున్నారు పలువురు నిపుణులు. తనకు తాను బయటపడే వరకు వేచి చూడాలని సూచిస్తున్నారు. అప్పటి వరకూ కుటుంబ సభ్యులు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. 

Full View


Similar News