బండి సంజయ్‌ని చూస్తే నవ్వాలో.. ఏడవాలో తెలియడం లేదు: రేవంత్ రెడ్డి

TSPSC పేపర్ లీకేజీ కేసులో రాష్ట్ర అధికారులు విచారణ చేపడితే నిజాలు బయటకు రావు అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2023-04-18 08:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: TSPSC పేపర్ లీకేజీ కేసులో రాష్ట్ర అధికారులు విచారణ చేపడితే నిజాలు బయటకు రావు అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంలోని పెద్దలను కాపాడుకునేందుకే రాష్ట్ర సర్కార్ సిట్‌ను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్రం కూడా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ప్రతీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ నిరుద్యోగులను మోసం చేశారన్నారు. 22 కోట్ల 6 లక్షల దరఖాస్తులు వస్తే 7,22,311ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంట్‌లో ప్రధాని సమాధానం ఇచ్చారని మండిపడ్డారు. పార్లమెంటు సాక్షిగా నిరుద్యోగులను మోసం చేసినట్లు ప్రధాని అంగీకరించినట్లు గుర్తుచేశారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తే ఒకే రోజులో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బండి సంజయ్ చెబుతున్నాడని.. బండి మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ వరదల సమయంలో బండి పోతే బండి ఇస్తామన్నారు.. ఆ తరువాత ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నట్లు గుర్తుచేశారు. అసలు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో బండికి తెలుసా? అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్, ఒకేరోజు 2లక్షల ఉద్యోగాలని బండి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రజాక్షేత్రం నుంచి పార్లమెంట్ వరకు నిరుద్యోగుల కోసం కొట్లాడింది కాంగ్రెస్ అన్నారు. బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ ముందు మోడీ ఇంటి దగ్గర చేయాలని సూచించారు.

ఈనెల 21న నల్గొండలో మాహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన, 24న ఖమ్మం జిల్లాలో, 26న ఆదిలాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపడతున్నట్లు ప్రకటించారు. మే 4 లేదా 5న సరూర్ నగర్‌లో నిరుద్యోగుల సమస్యలపై భారీ సభ నిర్వహిస్తామని అన్నారు. ఎల్బీ నగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి.. సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళతామని తెలిపారు. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొంటారని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కోసం కాదు.. నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటమని వెల్లడించారు. దీనికి అన్ని నిరుద్యోగ సంఘాలు మద్దతు తెలపాలని కోరారు. అంతేగాక, మే 9 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర రెండో విడత కార్యక్రమం ఉంటుంది. జోగులాంబ జిల్లా నుంచి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.

Tags:    

Similar News