మానేరును మింగేస్తున్నారు.. అధికారులు యాక్టింగ్ చేస్తున్నారు..!
దిశ, సిరిసిల్ల: కరీంనగర్‌కు చెందిన రాజు అనే వ్యక్తి సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని 456 సర్వే నెంబర్లో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ సర్వే నెంబర్ పక్కన మానేరు నది పరివాహక ప్రాంతం అని రెవెన్యూ రికార్డుల్లో ఉంది. తీరా ఆ భూమి వద్దకు వెళ్లి చూస్తే దాన్ని దాటుకుని దాదాపు ఐదు ఎకరాల భూమి ఉంది. దీంతో పట్టా భూమి తర్వాత ఉండాల్సిన మానేరు వాగును కొందరు కబ్జా చేశారని […]
దిశ, సిరిసిల్ల: కరీంనగర్‌కు చెందిన రాజు అనే వ్యక్తి సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని 456 సర్వే నెంబర్లో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ సర్వే నెంబర్ పక్కన మానేరు నది పరివాహక ప్రాంతం అని రెవెన్యూ రికార్డుల్లో ఉంది. తీరా ఆ భూమి వద్దకు వెళ్లి చూస్తే దాన్ని దాటుకుని దాదాపు ఐదు ఎకరాల భూమి ఉంది. దీంతో పట్టా భూమి తర్వాత ఉండాల్సిన మానేరు వాగును కొందరు కబ్జా చేశారని తెలిసింది. ఈ అక్రమార్కులు పట్టా భూములకు దారి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు వాపోవడంతో మానేరు వాగును మింగేస్తున్న ఈ విషయం బయటకు వచ్చింది.
తంగళ్ళపల్లి శివారులోని మానేరు నది పరివాహక ప్రాంతం ఆక్రమణకు గురవుతుంది. ఎకరాల భూమిని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు సాగుచేస్తున్నారు. దీనిపై పర్యవేక్షణ చేసి అక్రమార్కులపై కొరడా ఝుళిపించాల్సిన అధికార యంత్రాంగం నిద్రనటిస్తున్నారు. ఏళ్ళ కాలంగా నది పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించడం పై ఎలాంటి చర్యలు చేపట్టని అధికారుల తీరుతో కొందరు ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే మరికొందరు ఇసుకపై ఎర్ర మట్టి పోసి ఏకంగా వ్యవసాయ భూమిగా మార్చేశారు. ఇదేంటని ఎవరైనా అడిగితే వాగులో ఏం చేసిన తమను అనే వారు లేరని చెబుతున్నారు. ఈ భూములను విక్రయానికి పెట్టడంతో కొనుగోలుదారులు భూమి వద్దకు వెళ్లి చూడగా అసలు ఆ భూములకు పట్టా లేదని తెలిసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఎకరాల భూమి అన్యాక్రాంతం..
జిల్లాల పునర్విభజలతో కొత్త మండలాలు ఏర్పడ్డాయి. దీనితో మండల విస్తీర్ణం తగ్గి ఎక్కడ ఏ విషయం జరిగిన అనతి కాలంలో అధికారులు అక్కడికి చేరుకొని సమస్య పరిష్కారానికి బాటలు వేస్తారని ప్రజలు భావించారు. కానీ, ప్రస్తుత అధికారుల తీరు దానికి భిన్నంగా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయానికి ముందు భాగంలోని నది పరివాహక ప్రాంతంలో ఏకంగా రియల్ ఎస్టేట్ వెంచర్ వెలిచింది. దీనిలో ప్లాట్లు అమ్మకాలు జరిపేందుకు అధికారిక అనుమతులు లేవని ప్రచారం జరుగుతున్న అధికారులు ఎవరు ఆ వైపుగా పర్యవేక్షణ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా తంగళ్లపల్లి వైకుంఠధామం ఎదురుగా మానేరు వాగును పూడ్చి అక్రమార్కులు దాదాపు పదిహేను ఎకరాల భూమిని తయారు చేశారు. కొందరు దీనిలో ఎంచక్కా వ్యవసాయాన్ని కొనసాగిస్తుంటే.. ఇంకొందరు మరింత వాగును ఆక్రమించేందుకు హద్దులు పెట్టారు.
అయితే ఇటీవల ఈ భూములను అక్రమార్కులు అమ్మకానికి పెడుతున్నారని తెలిసి అక్కడికి కొనుగోలుదారులు కొందరు వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది. అమ్మకందారులు చూపిన భూమికి ఎలాంటి పట్టా లేదని వాగులోని ఇసుకను ఎర్ర మట్టితో చదునుచేసి మోసం చేసేందుకు ప్రయత్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అడ్డదారిలో తయారు చేసిన ఈ భూమికి ఎకరానికి 15 లక్షల నుండి 20 లక్షల వరకు ధరలు నిర్ణయించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అన్ని కుదిరి ఈ భూములు అమ్మకాలు జరిగితే మానేరు వాగుని మింగేస్తున్న అక్రమార్కులకు కోట్ల రూపాయలు రానున్నాయి. దీనిలో అధికారులకు వాట వస్తుందని నమ్మకంతోనే చర్యలకు వెళ్లడం లేదని తెలుస్తోంది
అనధికారిక బోర్లు.. కరెంట్ సరఫరా..
వ్యవసాయ భూమికి సంబంధించి అన్ని పట్టాదారు పాసు పుస్తకాలు ఉంటేనే బోర్లు వేయడానికి కరెంటు కనెక్షన్ తీసుకోవడానికి చాలా రోజులు పడుతుంది. ఇక అసలు పట్టాదారు పుస్తకాలు లేని భూములకు బోరు వేయడానికి కరెంటు సరఫరా చేయడానికి అవకాశమే లేదు. కానీ, తంగళ్ళపల్లి మానేరు వాగును ఆనుకొని అనేక భూములకు యథేచ్ఛగా కరెంటు సరఫరా జరుగుతోంది. ఈ భూములకు నీటి సరఫరా కోసం వందలాది బోర్లు వాగులో వెలిశాయి. వీటిని పర్యవేక్షించి నియంత్రించాల్సిన మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు మొద్దు నిద్రలో ఉండడంతో ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు పనులు కానిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కరెంటు సరఫరా జరుగుతున్న తీరు చూస్తే యమపాశాలు మానేరు వాగుపై నుంచి పోతున్నట్లే కనిపిస్తున్నాయి. అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగలతో ఎప్పటికైనా ప్రమాదమని వెంటనే విద్యుత్ అధికారులు వీటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే..
తంగళ్ళపల్లి మండలం వైకుంఠధామం ఎదురుగా మానేరు వాగు పరివాహక ప్రాంతాన్ని అక్రమార్కులు ఇటీవలే ఆక్రమించారు. దీనిపై గతంలో స్థానిక ప్రజలు పలుమార్లు విమర్శలు చేశారు. అయినా వీటిని అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. మరో ఆశ్చర్య విషయం ఏమిటంటే అనధికారికంగా మానేరు వాగు వ్యవసాయ భూమి గా మార్చుకున్న స్థలం పక్కనే గత హరితహారం సమయంలో దాదాపు నాలుగు లక్షల రూపాయల నిధులతో మంకీ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేశారు. ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. మొక్కలు నాటే ఈ క్రమంలో అయినా అధికారులు అన్యాక్రాంతమైన మానేరు భూమిని పరిశీలించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇసుకలో నాటిన మొక్కలు ఎండిపోయి లక్షలాది రూపాయల ప్రజాధనం ఇసుక పాలైందని స్థానికులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి హద్దులు ఏర్పాటు చేసి దోషులపై కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.