తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్.. సీఎంల ప్లాన్?
దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. కృష్ణా జలాల వ్యవహారంలో రెండు రాష్ట్రాలూ కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా ప్రకటనలు చేస్తున్నాయి. వాటా కోసం కొట్లాట అంటూ సీఎం కేసీఆర్ఇటీవల ప్రకటించడమే కాకుండా అలంపూర్ దగ్గర అడ్డుకట్ట వేసే బరాజ్ నిర్మాణానికి ప్లాన్విడుదల చేశారు. మరోవైపు ఏపీ కూడా దీనిపై వెనక్కి తగ్గడం లేదు. కృష్ణాలో తమ వాటా మేరకు వాడుకుంటున్నామంటూ తేల్చి చెప్పుతోంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. కృష్ణా జలాల వ్యవహారంలో రెండు రాష్ట్రాలూ కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా ప్రకటనలు చేస్తున్నాయి. వాటా కోసం కొట్లాట అంటూ సీఎం కేసీఆర్ఇటీవల ప్రకటించడమే కాకుండా అలంపూర్ దగ్గర అడ్డుకట్ట వేసే బరాజ్ నిర్మాణానికి ప్లాన్విడుదల చేశారు. మరోవైపు ఏపీ కూడా దీనిపై వెనక్కి తగ్గడం లేదు. కృష్ణాలో తమ వాటా మేరకు వాడుకుంటున్నామంటూ తేల్చి చెప్పుతోంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ విభేదాలు తలెత్తినట్లు భావిస్తున్నారు. కానీ విపక్షాలు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నాయి. ఇది వచ్చే ఎన్నికల కోసమేనని, దక్షిణ తెలంగాణను పట్టించుకోవడం లేదనే దృష్టిని మరల్చేందుకే సీఎం కొత్త నాటకానికి దిగారని విమర్శలున్నాయి.
రాజకీయ ప్రయోజనాల కోసమేనా..?
రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారనే అనుమానాలు విపక్షాలు వెల్లడి చేస్తున్నాయి. మళ్లీ నీళ్ల సెంటిమెంట్ రగిలిస్తూ ఓట్లు దండుకునేందుకు రాష్ట్రాల హక్కులను తాకట్టు పెడుతున్నారంటున్నారు. జల వివాదాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల తీరుతో ఇప్పుడు ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జలాల అంశంలో అభ్యంతరాలపై నిన్నటి వరకూ కలిసి మెలిసి ఉండి, విందు, వినోదాలతో కాలక్షేపం చేసిన ఇరు రాష్ట్రాల సీఎంలు ఒక్కసారిగా ఎందుకు కయ్యానికి దిగుతున్నారనే ప్రశ్నలు ఉత్ఫన్నమవుతున్నాయి. ముందుగా ఇరు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులపై అనుమతులు లేవంటూ, డీపీఆర్‌లు ఇవ్వడం లేదంటూ ఒకరిపై ఒకరు లేఖలు రాసుకున్నారు. కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇద్దరూ ఒక్కటయ్యారు. ప్రగతిభవన్ వేదికగా విందు చేసుకున్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుకున్నారు. జలాల వాటాపై సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నీళ్ల పంచాయతీలో కేంద్రానికి పెత్తనం అప్పగించారు. ఇంతకాలం కలిసిమెలిసి ఉన్నామని చెప్పుకున్న కేసీఆర్, జగన్… తాజాగా టార్గెట్ చేసుకుంటున్నట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తుననారు.
కేంద్రం చేతుల్లో కంట్రోల్
కృష్ణా, గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులన్నింటినీ ఆ రెండు బోర్డుల పరిధిలోకి తీసుకొస్తామని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పింది. అంటే ప్రాజెక్టులను పరోక్షంగా కేంద్రమే కంట్రోల్ చేస్తున్నట్లు తెలుస్తూనే ఉంది. అటు రెండు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కూడా ఆదేశించింది. డీపీఆర్‌లను సమర్పించేందుకు రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి.
ఎన్నికల కోసమేనా..?
రెండు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ఎన్నికల వాతావరణం మొదలవుతోంది. దాదాపు మూడేండ్ల కాలం దగ్గర పడుతుండటంతో… వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టుతున్నారు. ఆ దిశగానే పథకాలు కూడా రచిస్తున్నారు. అయితే సొంత ప్రయోజనాల కోసమే ఇద్దరు సీఎంలు.. గోదావరి, కృష్ణా ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టారనే అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. నదీ జలాల విషయంలో రాష్ట్రాలకే పూర్తి హక్కు ఉంటుందని, దాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టడం.. రెండు రాష్ట్రాలకూ మంచిది కాదని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే బేసిన్లు, భేషజాలూ లేవని, కలిసి మెలిసి ఉందామని, నీళ్లు పంచుకుందాంమన్నకేసీఆర్ ఇప్పుడు ఆంధ్రా ప్రాజెక్టులపై ఎందుకు కస్సుమంటున్నారన్నది చర్చగా మారింది. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హాజరై… గోదావరికి పూజ చేసిన జగన్.. తెలంగాణ ప్రాజెక్టుకు అనుమతులెక్కడున్నాయని ప్రశ్నించడంపై అనుమానాలు వస్తున్నాయి.
కలిసి మెలిసి సాగిన ఇద్దరు సీఎంలు నీళ్లపై నిప్పులు కురిపించుకోవడం వింతగానే కనిపిస్తోంది. అయితే ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమే ఇద్దరు సీఎంలు చేస్తున్న డ్రామాగా చెబుతున్నారు. అంతర్గతంగా స్నేహంగా ఉంటూ బయటికి మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్లుగా ప్రచారం చేసుకుంటాన్నారంటున్నారు. నీళ్లంటే ఇరు రాష్ట్రాల జనాలకు సెంటిమెంట్ అని, నీటి కోసం పోరాడే నేతలను హీరోగా చూస్తుంటారని, తెలంగాణ ఉద్యమంలోనూ, గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి కేసీఆర్ ఈ జలాలనే ప్రధాన అస్త్రంగా వాడుకున్నారంటున్నారు. అందుకే జల వివాదాన్ని, జనాల్లో సెంటిమెంట్‌ను మరోసారి రగిలిస్తూ దాన్ని క్యాష్ చేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారనే, ఇదే పంథాలో ఆంధ్రా సీఎం జగన్ కూడా ఉన్నారనే ఆరోపణలున్నాయి. తనకు మిత్రుడైన జగన్ కూడా ఇదే రకంగా వేళ్లేలా సీఎం కేసీఆర్ సెట్ రైట్ చేశారంటున్నారు.
వాస్తవానికి జల వివాదాలు సున్నితమైనవని, నీటిపై హక్కును వదులుకునేందుకు ఏ రాష్ట్రమూ సిద్ధపడదని నీటిపారుదల రంగ నిపుణులు చెప్పుతున్న అంశమే. నదీ జలాల విషయంలో రాష్ట్రాలకే పూర్తి హక్కు ఉంటుంది. కేంద్రానికి ఎలాంటి పెత్తనం ఉండదు.
రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే నదీ జలాల వివాదాల పరిష్కారం, కేటాయింపులపై ట్రిబ్యూనల్ ఆదేశాలే ఫైనల్. అందుకే జల వివాదాలు దశాబ్దాలపాటు సాగుతూనే ఉంటాయి. ఒక రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టుపై పక్క రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం కామన్. అభ్యంతరాలు, అనుమతుల పేరిట ఏ రాష్ట్రమూ తమ ప్రాజెక్టులను ఆపడంలేదని, అలాగని వాటిని కేంద్రం చేతుల్లో కూడా పెట్టడం లేదంటున్నారు. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సీఎంల వ్యవహారంతో దేశంలో మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులపై కేంద్రం ఆధిపత్యం చెలాయించే అవకాశం కల్పిస్తున్నారని, దీని పరిణామాలు భవిష్యత్తులో కనిపిస్తాయని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనాలు, ఓట్ల కోసం రాష్ట్రాల హక్కులను హరిస్తూ ఇద్దరూ సీఎంలు ప్రజలను మోసం చేస్తున్నారని, రాష్ట్రాల విశేషాధికారాన్ని జారవిడుచుకుంటున్నారని ఆక్షేపిస్తున్నారు.
అటు ఏపీ కూడా ఫైర్
కృష్ణా జలాల అంశంలో ఎప్పుడైనా సైలెంట్‌గా ఉండే ఏపీ.. మళ్లీ గొంతు పెంచింది. కృష్ణా నీటిని తరలించేందుకు ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతోందన్న తెలంగాణ ఆరోపణలు సరికాదని ఏపీ ఇరిగేషన్‌మంత్రి అనిల్ కుమార్ సోమవారం వెల్లడించారు. ఆంధ్రా ప్రాజెక్టులన్నీ చట్టానికి లోబడి కడుతున్నవే అని, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు పసలేనివని కొట్టిపారేశారు. ఆంధ్రకు కేటాయించిన నీరు తప్ప అక్రమంగా చుక్క నీరు కూడా వాడుకోవడం లేదని, 6 టీఎంసీలను నిల్వ చేసే ప్రాజెక్టులు తెలంగాణ అక్రమంగా కడుతోందని విమర్శించారు. పోతిరెడ్డిపాడు వద్ద లిప్ట్ పెడితే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. శ్రీశైలంలో 881 అడుగులకు నీరి చేరితే పోతిరెడ్డిపాడు నుంచి తరలించే అవకాశం ఉందని, 848 అడుగుల నీటి మట్టం ఉంటే చుక్క నీరు కూడ తీసుకోలేమని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. దీనిపై తెలంగాణ నుంచి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కూడా మళ్లీ కామెంట్స్ చేశారు. కృష్ణా జలాలపై పోరాటం చేస్తామంటున్నారు.
కాళేశ్వరం నుంచి తప్పించేందుకేనా..?
ఇప్పటికే గోదావరి నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో ప్రభుత్వంపై చాలా విమర్శలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయం ఎలా ఉన్నా… దక్షిణ తెలంగాణను ఎండబెడుతున్నారంటూ సొంత పార్టీలోనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కృష్ణా జలాలపై ఇన్ని రోజులు మౌనంగా ఉన్న కేసీఆర్.. ఇప్పుడు ప్లాన్ ప్రకారమే తెరపైకి తీసుకువచ్చారంటున్నారు. కృష్ణా జలాలపై పోరాటం చేస్తున్నామని దక్షిణ తెలంగాణ ప్రాంతంలో పట్టు సాధించడం, విపక్షాల నోళ్లు మూయించేందుకే ఈ నాటకమంటున్నారు.
మళ్లీ సెంటిమెంట్రగిలించడమే : డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
కృష్ణా జలాలను మళ్లీ సెంటిమెంట్కోసం కేసీఆర్వాడుకుంటున్నాడు. ఏడేండ్ల తెలంగాణలో దక్షిణ తెలంగాణకు చేసేందేమీ లేదు. ఎన్నికల సమయంలో హడావుడి చేస్తున్నారే తప్ప ఆ తర్వాత కనీసం కాల్వలు కూడా తవ్వడం లేదు. పాలమూరు–రంగారెడ్డి, తుమ్మిళ్ల, ఆర్డీఎస్‌కు సంబంధించిన ఒక్క పని కూడా పూర్తి చేయడం లేదు. ఎన్నికలప్పుడు మాత్రం అక్కడెక్కడో వాడని పైపులు, మోటర్లను తెచ్చి ఇక్కడ వేసి నీళ్లు వస్తున్నాయని చెప్పుతున్నారు. అంతే తప్ప మళ్లీ పట్టించుకోవడం లేదు. ఆర్డీఎస్‌లో 15.09 టీఎంసీల నీటివాటా ఉంటే ఇప్పుటికీ నాలుగు టీఎంసీల కంటే ఎక్కువ వాడకోవడం లేదు. ఆర్డీఎస్ పేరు చెప్పి తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించారు. పోతిరెడ్డిపాడును సెంటిమెంట్‌గా వాడుకున్నారు. కానీ ఇప్పటివరకూ ఒక్క కాల్వ పూర్తి చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వేల కోట్లు దండుకుంటున్నారు. కానీ దక్షిణ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టును ఎందుకు కట్టడం లేదు. ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ కోసం వాడుకుంటున్నారు.
రాజకీయ అవసరాల కోసమే : చల్లా వంశీచంద్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి
కృష్ణా జలాల అంశంలో స్పందించాల్సిన సమయంలో రాష్ట్రం స్పందించలేదు. కోర్టులో కేసు వేయాలంటే కూడా వేయలేదు. పాత కేసులోనే ఇంప్లీడ్ అయ్యారు. దక్షిణ తెలంగాణకు అన్యాయాన్ని ముందు నుంచీ చెప్పుతున్నాం. ప్రజలకు అవసరం ఉన్న రీతిలో స్పందించడం లేదు. రాజకీయ అవసరాల కోసమే కృష్ణా జలాలను వాడుకుంటున్నారు. రాజకీయంగా అవసరం ఉన్నప్పుడే దీన్ని తెరపైకి తీసుకువచ్చి సెంటింమెంట్గా వాడుకుంటున్నారు. సాగునీటి విషయంలో ప్రజలకు మేలు జరుగాలి, పొలాలకు నీరు రావాలనేది కాదు. సెంటిమెంట్ సజీవంగా ఉండాలి, ఓట్లు రావాలి, రీడిజైన్ల రూపంలో కమీషన్లు రావాలి.. ఇదే ప్రాధాన్యతగా కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు.