కోబడ్ గాంధీ బహిష్కరణ.. ప్రకటించిన మావోయిస్టు పార్టీ
దిశ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు పార్టీ సీనియర్ సభ్యుడు కోబడ్ ఘాండీపై బహిష్కరణ వేటు పడింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగించి బహిష్కరిస్తున్నట్లు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్క్సిజం-లెనినిజం-మావోయిజం మూల సూత్రాలను తిరగదోడడం, పాలకవర్గాలకు అనుకూలంగా మారి మావోయిస్టు పార్టీపై బుదరజల్లడం, మూలసూత్రమైన వర్గపోరాటానికి బదులుగా వర్గ సామరస్య భావనలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుని భావవాద ఆధ్యాత్మిక గురువుగా మారారని అభయ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 2009లో […]
దిశ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు పార్టీ సీనియర్ సభ్యుడు కోబడ్ ఘాండీపై బహిష్కరణ వేటు పడింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగించి బహిష్కరిస్తున్నట్లు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్క్సిజం-లెనినిజం-మావోయిజం మూల సూత్రాలను తిరగదోడడం, పాలకవర్గాలకు అనుకూలంగా మారి మావోయిస్టు పార్టీపై బుదరజల్లడం, మూలసూత్రమైన వర్గపోరాటానికి బదులుగా వర్గ సామరస్య భావనలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుని భావవాద ఆధ్యాత్మిక గురువుగా మారారని అభయ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
2009లో అరెస్టైన తర్వాత జైల్లో తన వ్యక్తిగత స్వార్థం కోసం కొన్ని రాయితీలు పొందాడని, దానికి కొనసాగింపుగా ‘మావోయిస్టు పార్టీకి ప్రజల మద్దతు లేదని, తిరుగుబోతు దళాలు (రోవింగ్ రెబల్స్)గా పనిచేస్తున్నట్లు నిందారోపణలు చేశాడని, ఇది పాలకవర్గాలతో గొంతు కలపడం తప్ప మరేమీ కాదని పేర్కొన్నారు. మార్క్సిస్టు మూల సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందున సభ్యత్వాన్ని తొలగించి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
గతితార్కిక చారిత్రక భౌతికవాదానికి, ఆలోచనలకు భిన్నంగా ఆయనతో పిడివాద స్వభావంతో కూడిన తాత్విక ఆలోచనలు పొడసూపాయని పేర్కొన్నారు. వర్గపోరాటంలో, ప్రజాయుద్ధంలో స్వయంగా పాల్గొని నిర్దిష్ట పరిస్థితులను అధ్యయనం చేయడం ద్వారా స్వీయాత్మక ఆలోచనలు, భావాలను సరదిద్దుకోడానికి అవకాశం ఉన్నా దాన్ని తిరస్కరించారని పేర్కొన్నారు.
కోబడ్ ఘాండీ సైద్ధాంతికంగా లేవనెత్తిన అంశాలన్నింటికీ పార్టీ డాక్యుమెంట్లలో జవాబులు ఉన్నాయని, చర్చల్లో పాల్గొన్నప్పటికీ వాస్తవాలను మరుగుపర్చి ఇటీవల రాసిన ‘ఫ్రాక్చర్డ్ ఫ్రీడమ్ ఏ ప్రిజన్ మెమొయిర్’ అనే పుస్తకంలో పార్టీ సిద్ధాంతానికి తప్పుడు భాష్యం చెప్పారని అభయ్ ఆ ప్రకటనలో ఉదహరించారు. వర్గపోరాటాన్ని విడిచిపెట్టి భావవాద ఆలోచనలతో సమాజంలో సంతోషాన్ని సాధించడానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడని ఆరోపించారు.