కలెక్టరే కార్ డ్రైవ్ చేస్తూ తనిఖీలు
దిశ, ఖమ్మం: కరోనా వైరస్ (కోవిడ్-19) కట్టడికి ఈ నెల 31 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండోరోజు లాక్‌డౌన్ విజయవంతమైంది. అధికార యంత్రాంగం కట్టుదిట్టంగా 1897-ఎపిడమిక్ చట్టాన్ని అమలు చేస్తున్నది. రోడ్లపైకి వచ్చినవారిపై పోలీసులు లాఠీచార్జి చేయడానికి కూడా వెనకాడటం లేదు. సరైన కారణం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జనాల తాటతీస్తున్నారు. మంగళవారం ఉదయం వేళల్లో ప్రధాన రోడ్లపై కాస్త జన సందోహం […]
దిశ, ఖమ్మం: కరోనా వైరస్ (కోవిడ్-19) కట్టడికి ఈ నెల 31 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండోరోజు లాక్‌డౌన్ విజయవంతమైంది. అధికార యంత్రాంగం కట్టుదిట్టంగా 1897-ఎపిడమిక్ చట్టాన్ని అమలు చేస్తున్నది. రోడ్లపైకి వచ్చినవారిపై పోలీసులు లాఠీచార్జి చేయడానికి కూడా వెనకాడటం లేదు. సరైన కారణం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జనాల తాటతీస్తున్నారు. మంగళవారం ఉదయం వేళల్లో ప్రధాన రోడ్లపై కాస్త జన సందోహం కనిపించినా ఉదయం 9 గంటల తర్వాత రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి. ప్రభుత్వం సోమవారం సాయంత్రం చేసిన ప్రకటనలతో జనాల నుంచి సానుకూల స్పందన వచ్చింది. పరిస్థితి తీవ్రంగానే ఉందని గ్రహించి రోడ్లపైకి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు.
చెక్‌పోస్టుల వద్ద సోదాలు
ఉదయం వేళలో జిల్లా కలెక్టర్ కర్ణన్ స్వయంగా కారు డ్రైవింగ్ చేస్తూ జిల్లాలోని పలు చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జనాలు రోడ్లపైకి రాకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ కృష్ణారెడ్డి ఖమ్మం పట్టణంతోపాటు కారెపల్లిని సందర్శించారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టాలని స్థానిక పోలీసు అధికారులకు సూచించారు. కొత్తగూడెం పట్టణంతోపాటు ఆ జిల్లాలోని పాల్వంచ, భద్రాచలంలో రోడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. పాల్వంచలోని ఐటీసీ సంస్థ సోమవారం కార్యకలాపాలు నిర్వహించినా జిల్లా అధికారుల ఆదేశాలతో మంగళవారం మూసివేశారు. డీఎస్పీ ఎస్ఎం అలీ ఇంట్లో పనిచేస్తున్న సిబ్బందిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే, వారెవరికీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాకపోవడంతో జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
వివాదాస్పదమైన ఏసీపీ తీరు!
సోమవారం రాత్రి ప్రభుత్వ మహిళా వైద్యాధికారులతో ఖమ్మం ఏసీపీ గణేష్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. డ్యూటీకి వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడమే కాకుండా నానా దుర్భాషలాడారని వైద్యాధికారిణులు ఆరోపించారు. ఏసీపీ తమపై చేయి చేసుకున్నారని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏసీపీ తమకు క్షమాపణ చెప్పాలని వైద్యాధికారులు పట్టుబడుతున్నారు. అయితే, వారు ఈ విషయమై ఏసీపీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
tags: coronavirus (covid-19), high alert, lockdown successful, epidemic act 1897