దేశంలోనే అతి పెద్ద లంచగొండి
దిశ, క్రైమ్ బ్యూరో: రూ.1.10 కోట్లు.. అవును అక్షరాల కోటి పది లక్షలు.. ఇదేదో అప్పు పత్రం అనుకునేరు.. లేదంటే చిన్నపాటి ప్రాజెక్ట్‌కు అవసరమైన బడ్జెట్ అని భావించేరు.. మేడ్చల్ మండలం కీసర మండలం తహసీల్దార్ నాగరాజు ఓ పనిని చేసిపెట్టడానికి తీసుకున్న లంచం తాలూకు మొత్తమది.. పాపం ఏసీబీ అధికారులు ఏదో చిన్నాచితక నగదేమో అనుకుని చేత్తో లెక్కిద్దంలే అనుకుని వెళ్లారు.. తీరా మనసారు గారు తీసుకున్న అమౌంట్‌ను చూసి కళ్లు బైర్లు కమ్మడంతో ఆలోచనలో […]
దిశ, క్రైమ్ బ్యూరో: రూ.1.10 కోట్లు.. అవును అక్షరాల కోటి పది లక్షలు.. ఇదేదో అప్పు పత్రం అనుకునేరు.. లేదంటే చిన్నపాటి ప్రాజెక్ట్‌కు అవసరమైన బడ్జెట్ అని భావించేరు.. మేడ్చల్ మండలం కీసర మండలం తహసీల్దార్ నాగరాజు ఓ పనిని చేసిపెట్టడానికి తీసుకున్న లంచం తాలూకు మొత్తమది.. పాపం ఏసీబీ అధికారులు ఏదో చిన్నాచితక నగదేమో అనుకుని చేత్తో లెక్కిద్దంలే అనుకుని వెళ్లారు.. తీరా మనసారు గారు తీసుకున్న అమౌంట్‌ను చూసి కళ్లు బైర్లు కమ్మడంతో ఆలోచనలో పడి, కట్టలు లెక్కించడానికి మిషన్లనే తెప్పించుకున్నారు.
మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజు రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కీసర మండలం రాంపల్లిలో 28 ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో పట్టాదారు పాస్ పుస్తకం క్లియర్ చేసేందుకు తహసీల్దార్ నాగరాజు బాధితులు, రియల్ వ్యాపారుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఏఎస్ రావు నగర్ లోని నాగరాజు నివాసంలో రూ.1.10 కోట్లు నగదు చేతులు మారుతుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎర్వ నాగరాజుతో పాటు రియల్ ఎస్టేట్ బ్రోకర్ శ్రీనాథ్, కందాడ అంజిరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ నాగరాజు నివాసంలో ఏసీబీ అధికారులు రాత్రి పొద్దుపోయే వరకూ తనిఖీలు చేస్తూనే ఉన్నారు. కీసర తహసీల్దార్ కార్యాలయంలోనూ తనిఖీలు జరుగుతున్నాయి.
మేడ్చల్ జిల్లాలో తహసీల్దార్ నాగరాజు ఒక అధికారిగా కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే మాదిరిగా వ్యవహరిస్తాడనే ప్రచారం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇష్టారీతిగా మెదులుతాడని బాధితులు వాపోతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఓ ప్రధాన పార్టీకి చెందిన వారుగా ప్రచారం జరుగుతోంది. ఓ ఎంపీకి అనూయాయులుగా కూడా స్థానికులు చెబుతున్నారు. కాగా, నాగరాజు 2016లో కూకట్ పల్లి, శామీర్ పేట మండలాల్లో పనిచేశాడు. గతంలో తహసీల్దార్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడు. ఆ కేసు నుంచి మూడు నెలల కిందటే బయపడినట్టు తెలుస్తోంది.
ప్రమేయం?
28 ఎకరాలను డీల్ చేసేటప్పుడు తహసీల్దార్ మాత్రమే ఉండకపోవచ్చునన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల క్లియరెన్స్, మద్దతు లేకుండా ఫైలు ముందుకు కదిలే అవకాశమే లేదు. పైగా అంత పెద్ద నగదును స్వీకరించేటప్పుడు మిగతా వారికి కూడా వాటాలు ఉండొచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం తహసీల్దార్, వీఆర్వోలు కలిసి అత్యంత ఖరీదైన వివాదాస్పద స్థలాన్ని క్లియర్ చేయలేరని, తహసీల్దార్ స్థాయిలో అంత పెద్ద విస్తీర్ణం గురించి ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదని ఓ రెవెన్యూ అధికారి పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ఎవరెవరు ఉన్నారనే విషయాలు పూర్తి విచారణ అనంతరమే తేలే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా అంత పెద్ద మొత్తంలో నగదు పట్టుకున్న ఘటన ఇదే అయి ఉంటుందని పలువురు అధికారులు అంటున్నారు.
ఘనాపాటిలు.. ఈ అధికారులు..
సరిగ్గా ఏడాది కిందట కేశంపేట తహసీల్దార్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇంట్లో ఏకంగా రూ.90 లక్షలకు పైగా నగదు బయట పడింది. ఇటీవల షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఓ స్థలం వివాదంలో ఆర్ఐ రూ.50 లక్షలు డిమాండ్ చేయగా, రూ.30 లక్షలకు డీల్ కుదర్చుకుని రూ.15 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ఘటన ఇంకా మరువకముందే ఇప్పుడు కీసర తహసీల్దార్ నాగరాజు ఏకంగా రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడడం ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లోనే కాదు ఏకంగా దేశంలోనే సంచలనంగా పేర్కొనవచ్చు. ఇటీవలే అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు గురవ్వడం సంచలనం రేకెత్తించింది.
నజర్ పెట్టినా ఆగని దందా..
కాగా, అవినీతి బాగోతం అంతకంతకు పెరిగిపోతుండడంతో నగర శివార్లలోని రెవెన్యూ యంత్రాంగంపై ఏసీబీ అధికారులు నజర్ పెట్టిందన్న వార్తలు వచ్చాయి. అయినా దందా ఆగకపోవడం విడ్డూరంగా ఉంది. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో అధికారులు మమేకమై ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ క్రమంలోనే అత్యంత పెద్ద డీల్ వ్యవహారం ఏసీబీకి చేరడం, అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం విశేషం. తాజాగా చోటు చేసుకున్న ఈ తతంగం వెనుక కూడా నాయకుల హస్తం రియల్ ఎస్టేట్ ముసుగులో సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, రెవెన్యూ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలోనే సీఎం కేసీఆర్ కూడా కొత్త చట్టాలను తీసుకురావాలని, వారి బాధ్యతలను ఇతర శాఖలకు బదలాయించాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కరిద్దరు చేసే అవినీతి దందాతో మొత్తం రెవెన్యూ యంత్రాంగానికే మచ్చగా మారుతోందని, నిజాయితీగా పని చేసే వారు కూడా రెవెన్యూ వ్యవస్థపై మాట్లాడే అవకాశం లేకుండా పోతోందని కొందరు అధికారులు వాపోతున్నారు. .
పెరిగిన బూమ్తోనే..
రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగిన నేపథ్యంలో పదేండ్ల నుంచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎకరా రూ.లక్షకు కొనుగోలు చేస్తే ఇప్పుడు దాని విలువ రూ.కోటికి చేరింది. పదేండ్లలోనే ఇన్ని రెట్లు పెరిగిన దరిమిళా ప్రలోభాలకు తావు లేకుండా వ్యవహారం నడవడం కష్టమేనని రెవెన్యూ యంత్రాంగమే అంటోంది. పైగా తప్పుల తడకగా ఉండే రికార్డుల్లో హక్కులను సొంతం చేసుకోకపోతే ఇతరులెవరైనా ఆక్రమించుకోవడమో, తన కంటే ముందు హక్కు పత్రాలు పొందుతారన్న భయం నెలకొంది. ఈ పెరిగిన భూముల ధరలతోనే ప్రలోభాల స్థాయి రికార్డుల్లోకి ఎక్కుతోంది.