మారిన సీన్… సీనియర్ నేతలకు కేసీఆర్ ఝలక్

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ టీఆర్ఎస్ నాయకులకు  సీఎ౦ కేసీఆర్ మరోసారి ఝలక్ ఇచ్చారు. ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చారు. కాగజ్ నగర్ కు చెందిన ఉద్యమ కారుడు, ఎన్నారై దండె విఠల్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం వస్తుందని భావించిన సీనియర్లకు నిరాశే మిగిలినట్లయింది. నామినేషన్ కు మరో రెండ్రోజులే గడువు ఉండగా.. దండె […]

Update: 2021-11-21 02:55 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ టీఆర్ఎస్ నాయకులకు సీఎ౦ కేసీఆర్ మరోసారి ఝలక్ ఇచ్చారు. ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చారు. కాగజ్ నగర్ కు చెందిన ఉద్యమ కారుడు, ఎన్నారై దండె విఠల్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం వస్తుందని భావించిన సీనియర్లకు నిరాశే మిగిలినట్లయింది. నామినేషన్ కు మరో రెండ్రోజులే గడువు ఉండగా.. దండె విఠల్ పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

సిర్పూర్ కాగజ్ నగర్ కు చెందిన దండె విఠల్ విద్యాభ్యాసం అక్కడే సాగింది. నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ (ECE) అమరావతి యూనివర్సిటీలో చేశారు. యూఎస్ఏలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన.. 2000లో సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించారు. 2010లో టెలికాం కంపెనీ స్థాపించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, IT, హెల్త్ కేర్, క్రాఫ్ట్ పేపర్, లాజిస్టిక్స్ వ్యాపారాలలో పాలుపంచుకున్నారు.

2009 నుంచి 2013 వరకు పూర్తి సమయం టీఆర్‌ఎస్ కార్యకర్తగా సిర్పూర్ నియోజకవర్గంలో పనిచేశారు. 2013లో సనత్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జిగా నియమితులయ్యారు. 2014లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి టీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పని చేస్తున్నారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన తెలంగాణ ఉద్యమకారుడిగా, కేటీఆర్‌కు సన్నిహితుడుగా ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా సమీకరణాలు కలిసి రావడంతో టీఆర్ఎస్ అధిష్టానం ఆయన పేరును తెరపైకి తెచ్చింది. గతంలో పురాణం సతీష్ ఎమ్మెల్సీగా కొనసాగగా.. ఈసారి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయనకు అవకాశం కల్పించారు. టీఆర్ఎస్ అగ్రనాయకత్వం తోపాటు మైహోం రామేశ్వరరావుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. గతంలో సనత్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయినా.. పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు.

సనత్ నగర్ నుంచి ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలిచిన విషయం తెలిసిందే. తలసాని టీఆర్ఎస్ లో చేరాక దండె విఠల్ కు ప్రాధాన్యత తగ్గినప్పటికీ ఆయన పార్టీకి తన సేవలను అందించారు. దీనిని గుర్తించిన అధిష్టానం తాజాగా ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆయన పార్టీ బలోపేతం కోసం పనిచేయడం, బీసీ సామాజికవర్గం కావడం, ఆర్థికంగా బలంగా ఉండటం, అధినాయకత్వానికి సన్నిహితంగా ఉండటంతో.. ఆయన పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన సీనియర్లకు మరోసారి సీఎం కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. కూచాడి శ్రీహరిరావు, వల్లకొండ సత్యనారాయణగౌడ్, గడ్డం అరవింద్రెడ్డి, గొడాం నగేశ్ లాంటి వారికి అవకాశం వస్తుందని ఆశించారు. సీనియర్లను కాదని చివరికి దండే మిట్టల్ వైపు టీఆర్ఎస్ అధినాయకత్వం మొగ్గు చూపింది.

Tags:    

Similar News