కేసీఆర్ గేమ్‌లో పావుగా ఈటల.. రాజకీయ భవిష్యత్తు చీకటేనా.?

దిశ, తెలంగాణ బ్యూరో : ఈటల రాజేందర్‌ను బీజేపీలోకి పంపిందే కేసీఆర్ అంటూ ఆ మధ్యన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. ఈటల రాజేందర్ సైతం బీజేపీలో చేరడానికి ముందు టీఆర్ఎస్‌తో దోస్తీపై అనుమానాలను వ్యక్తం చేశారు. తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన, ప్రధానితో భేటీ.. ఇప్పుడు అవన్నీ చర్చనీయాంశాలుగా మారాయి. కేసీఆర్, హరీష్ రావులు పోటీచేసినా గెలుపు తనదేనంటూ ధీమాతోనే ఉన్నారు. గెలుపు నల్లేరు మీద నడకే అని అనుకున్నారు. కానీ […]

Update: 2021-09-05 23:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఈటల రాజేందర్‌ను బీజేపీలోకి పంపిందే కేసీఆర్ అంటూ ఆ మధ్యన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. ఈటల రాజేందర్ సైతం బీజేపీలో చేరడానికి ముందు టీఆర్ఎస్‌తో దోస్తీపై అనుమానాలను వ్యక్తం చేశారు. తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన, ప్రధానితో భేటీ.. ఇప్పుడు అవన్నీ చర్చనీయాంశాలుగా మారాయి.

కేసీఆర్, హరీష్ రావులు పోటీచేసినా గెలుపు తనదేనంటూ ధీమాతోనే ఉన్నారు. గెలుపు నల్లేరు మీద నడకే అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన ముందున్నది ముళ్ళబాట. కనీసంగా మూడు నెలల పాటు ఎదురుచూపులే. ప్రచారం దూకుడు పెంచడమా లేక తాత్కాలికంగా విరమించుకోవడమా లేక కాస్త స్పీడు తగ్గించడమా అనేది ఆయనకు సంకటంగా మారింది.

నిజానికి టీఆర్ఎస్, బీజేపీ మధ్య దోస్తానా, పరస్పర అవగాహన ఉన్నదంటూ ఈటలకు మొదటి నుంచీ అనుమానమే ఉన్నది. ఇవి ఇప్పుడు నిజమవుతున్నాయనే అభిప్రాయం ఆయన అభిమానుల్లో కలుగుతున్నది. సుదీర్ఘకాలం పాటు టీఆర్ఎస్‌లో యాక్టివ్‌గా ఉన్న ఈటల రాజేందర్‌కు బీజేపీతో ఉన్న సంబంధాల గురించి తెలియంది కాదు. అందుకే బీజేపీలో చేరే సమయంలోనే ఈ అంశాన్ని ఢిల్లీ పార్టీ పెద్దల దగ్గర ప్రస్తావించారు. భవిష్యత్తులో ఆ రెండు పార్టీల మధ్య కొనసాగనున్న సంబంధం గురించి చర్చించారు. నిర్దిష్టమైన భరోసా, హామీ వచ్చిన తర్వాతనే చేరాలనే నిర్ణయం తీసుకున్నారు.

కానీ, తాజా పరిణామాలు ఆయనకు మింగుడుపడటంలేదు. వ్యక్తం చేసిన అనుమానాలకు బలం చేకూర్చినట్లు అయింది. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా హుజురాబాద్‌‌లో కొట్లాడుతున్న ఈటల రాజేందర్‌కు ఇప్పుడు ప్రజల్లో ముఖం చూపించుకోవడం, ప్రచారం చేసుకోవడం ఇబ్బందికరంగా పరిణమించింది.

టీఆర్ఎస్‌తో దోస్తీ ఉండదు.. అంతా కుస్తీయే.. అందులో అనుమానమే అవసరం లేదంటూ అప్పట్లో హామీ ఇచ్చిన ఢిల్లీ పెద్దలే ఇప్పుడు కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ కావడం ఈటలకు ఆందోళన కలిగిస్తున్నది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో ఉండదంటూ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో ఇంతకాలం దూకుడుగా చేస్తున్న ప్రచారానికి బ్రేకులు వేసినట్లు అయింది. కేసీఆర్, మోడీ మధ్య భేటీ జరిగిన గంటల వ్యవధిలోనే ఎన్నికల సంఘం ఈ విషయం తేల్చి చెప్పడం గమనార్హం.

కేసీఆర్ ఎత్తులు, జిత్తులు, వ్యూహాలు ఈటలకు తెలియందేమీ కాదు. పోలింగ్ చివరి క్షణం వరకూ ఏదో ఒకటి చేస్తారని కేసీఆర్ మీద ఈటలకు బలమైన అనుమానమే ఉన్నది. కానీ అంతదాకా వెళ్ళకముందే ఢిల్లీ టూర్‌లోనే కేసీఆర్ ఎఫెక్ట్ కనిపించింది. బలమైన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మమతా బెనర్జీ విషయంలో సానుకూల నిర్ణయం వెలువడినా సొంత పార్టీ విషయంలో మాత్రం భిన్నమైన నిర్ణయం రావడం ఈటల రాజేందర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. బీజేపీలో చేరి తప్పు చేశాడంటూ ఇప్పటివరకూ తనకు పరిచయమైన వ్యక్తులు, వివిధ పార్టీల్లో ఉన్న శ్రేయోభిలాషులు వ్యాఖ్యానించినా తాజా పరిణామాలు మాత్రం ఆయనను ఆలోచనలో పడేసినట్లు అయింది. ముందుకు పోలేక వెనక్కి రాలేక ఉచ్చులో చిక్కుకున్నట్లు అయిపోయింది.

కేసీఆర్, మోడీ దోస్తులే అనే సంకేతం హుజురాబాద్ ప్రజల్లోకి వెళ్లడంతో ఇప్పుడు ఈటల రాజేందర్ ఎంత చెప్పుకున్నా అది వర్కవుట్ అయ్యేలా లేదు. జోరు మీదున్న ఈటలకు బ్రేకులు వేస్తే టీఆర్ఎస్‌కు మాత్రం ఎక్కడలేని కొత్త ఉత్సాహాన్ని కల్పించినట్లయింది అనే చర్చలు ఈటల వర్గీయుల్లో విస్తృతంగా జరుగుతున్నాయి. నిజంగా ఈటలను గెలిపించుకోవాలన్న ఉద్దేశం బీజేపీ నాయకత్వానికి ఉన్నట్లయితే ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చి ఉండేదన్న వ్యాఖ్యలూ చేస్తున్నారు. కేసీఆర్‌తో ఫ్రెండ్‌షిప్ మెయింటెయిన్ చేయడంపై చూపించిన ఆసక్తిని ఈటలను గెలిపించుకోవాలన్న విషయంలో ఉన్నట్లయితే పరిణామాలు మరో రకంగా ఉండేవన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

టీఆర్ఎస్, బీజేపీ గేమ్ ప్లాన్‌లో ఇప్పుడు ఈటల రాజేందర్ పావుగా మారిపోయారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తునే నిర్ణయించనున్నది. రాజకీయంగా చరిత్ర హీనుణ్ణి చేయాలని టీఆర్ఎస్ భావిస్తుంటే గెలిచి తన సత్తాను చాటాలని ఈటల కోరుకుంటున్నారు. ఈటలలో ఉన్న కసి పార్టీ నాయకత్వంలో లేదనే ఆవేదన ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతున్నది. తోడుగా ఉండాల్సిన పార్టీ నాయకత్వం ఆయనకు ఇస్తున్న సహకారం ఇదేనా అనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. ఇకపైన కార్యక్షేత్రంలో తేల్చుకోవడం ఈటల వంతు అయింది.

ఇవి కూడా చదవండి:

TRS పార్టీకి నేనే బాస్.. విలేకరులు వెధవలు.. MLA కొడుకు వివాదాస్పద కామెంట్స్

ఢిల్లీలో డీల్ కుదిరిందా.. మోడీ, కేసీఆర్ ప్లాన్ అదేనా..?

Tags:    

Similar News