Ranganath: హైడ్రా వల్ల జరిగిన ఉపయోగం ఇదే.. కమిషనర్ AV రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్‌జోన్‌లు నిర్ణయిస్తున్నట్లు హైడ్రా(Hydra) చీఫ్ రంగనాథ్(Ranganath) స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
దిశ, వెబ్‌డెస్క్: సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్‌జోన్‌లు నిర్ణయిస్తున్నట్లు హైడ్రా(Hydra) చీఫ్ రంగనాథ్(Ranganath) స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ఆర్ఎస్‌ఈతో సమన్వయం చేసుకొని శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. చెరువులకు సంబంధించి 2000 నుంచి 2024 వరకు ఉన్న చిత్రాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి పారదర్శకంగా శాస్త్రీయంగా మార్కింగ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. నాలాలకు సంబంధించి కూడా కిర్లోస్కర్‌తో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు హైడ్రాకు 5800 ఫిర్యాదులు వచ్చినట్లు స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో అనధికార నిర్మాణాలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు.
ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు హైడ్రా 200 ఎకరాల భూమిని కాపాడిందని చెప్పారు. అంతేకాదు.. 8 చెరువులు, 12 పార్కులను కూడా సేవ్ చేసిందని అన్నారు. హైడ్రా చర్యల వల్ల ప్రజల్లో అక్రమ నిర్మాణాలపై అవగాహన పెరిగిందని తెలిపారు. ఎఫ్‌టీఎల్ అంటే ఏంటి?, బఫర్ జోన్ అంటే ఏంటి?, ఎక్కడ నిర్మాణాలు చేసుకుంటే మంచిదనే క్లారిటీ అందరిలోనూ వచ్చిందని అన్నారు. కొందరు కావాలనే హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా అంటే కేవలం కూల్చేందుకే కాదని క్లారిటీ ఇచ్చారు.