జగనన్న సంక్రాంతి కానుక.. వారి సొంతింటి కల నెరవేరినట్టే !

దిశ, ఏపీ బ్యూరో: జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లే‌అవుట్ల పనులు మొదలయ్యాయి. సంక్రాంతి కానుకగా తొలిదశ లే‌అవుట్లను వినియోగదారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలోని ధర్మవరం, ప్రకాశం జిల్లాలోని కందుకూరు, కడప జిల్లాలోని రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలిలో లే అవుట్లను వేశారు. జనాల డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల్లో అన్ని వసతులతో ప్లాట్లను సిద్ధం చేశారు. […]

Update: 2021-12-28 21:29 GMT

దిశ, ఏపీ బ్యూరో: జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లే‌అవుట్ల పనులు మొదలయ్యాయి. సంక్రాంతి కానుకగా తొలిదశ లే‌అవుట్లను వినియోగదారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలోని ధర్మవరం, ప్రకాశం జిల్లాలోని కందుకూరు, కడప జిల్లాలోని రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలిలో లే అవుట్లను వేశారు. జనాల డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల్లో అన్ని వసతులతో ప్లాట్లను సిద్ధం చేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా అర్బన్‌ అథారిటీ పరిధిలో మరికొన్ని లే అవుట్లను సిద్ధం చేస్తున్నారు.

మధ్య తరగతి ప్రజలకు లబ్ధి

ప్రభుత్వం ప్రధానంగా నగర, పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి ఆదాయ వర్గాల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఈ జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లే‌అవుట్లను ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుతం పట్టణ, నగర ప్రాంతాల్లో గజం స్థలం కూడా సామాన్యుడు కొనలేక పోతున్న విషయం తెలిసిందే. అందుకే మార్కెట్‌ ధర కంటే తక్కువకు ప్లాట్లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలివిడతలో వీటన్నింటినీ సిద్ధం చేసి సంక్రాంతి నాటికి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. అంతకు ముందే ప్లాట్ల బుకింగ్‌కు అనుగుణంగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ను కూడా ప్రారంభించాలని భావిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఈ లే అవుట్లను ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే ప్రభుత్వ పరిశ్రమలకు చెందిన భూములను తీసుకుని.. ఆ వ్యయాన్ని ఆయా పరిశ్రమలకు చెల్లించనున్నారు. అవసరమైన చోట ప్రైవేటు భూములను మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగం జీవో నం.76 నిబంధనలకు లోబడి తీసుకుంటున్నది. ఇలా సేకరించిన భూముల్లో భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా 50 శాతం భూమిని అన్ని రకాల మౌలిక వసతులకు కేటాయిస్తున్నారు. మిగిలిన స్థలంలో మాత్రమే ప్లాట్లు వేస్తున్నారు. ఈ ప్లాట్లు వేయడానికి అయిన ఖర్చు మేరకే ప్రజలకు అందించనున్నారు. ఈ లేఅవుట్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందించేందుకు సిద్ధమవుతున్నారు.

టౌన్‌షిప్ పథకం వివరాలేంటి?

నగరాలు, పట్టణాల్లోని మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో, ప్రణాళికా బద్ధంగా ఇళ్ల స్థలాలు సమకూర్చే పథకమే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌. ఈ పథకం కింద ప్లాట్‌ పొందడానికి 3.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ లే‌ఔట్లు అన్నీ ఒకే విధంగా ఉండేలా నిర్మాణాలు చేపడుతున్నారు.
అన్ని సౌకర్యాలతో లేఔట్లు
* డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల్లో మూడు కేటగిరీల్లో ప్లాట్లు
* లేఔట్‌లలో 60 అడుగులు బీటీ, 40 అడుగులు సీసీ రోడ్లతో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నీటి నిల్వ సరఫరాకు అనుగుణంగా ఏర్పాట్లు
* అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రికల్, కేబుల్, వీధి లైట్లు, పార్క్‌లు, ఇతర వసతుల కల్పన

ఈ పథకం వర్తించడానికి అర్హతలు

ఒక కుటుంబానికి ఒకే ప్లాట్‌ ఇస్తారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా వార్షిక ఆదాయం రూ.18 లక్షల లోపు ఉండాలి.18 సంవత్సరాలు పైబడి ఉండాలి. లబ్ధిదారుడు తప్పకుండా రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి.

ప్లాట్‌ల కేటాయింపు ఇలా..

డీటీసీపీ రూపొందించిన వెబ్‌సైట్‌లో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. లేదా స్థానిక వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్లాట్‌ అమ్మకం ధరపై 10 శాతం మొత్తాన్ని దరఖాస్తు సమయంలో ఆర్టీజీఎస్‌/ఎన్‌ఈఎఫ్‌టీ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. లాటరీ విధానంలో ప్లాట్‌లు కేటాయిస్తారు. దరఖాస్తుదారుడు ప్లాట్‌ పొందలేకపోతే లాటరీ అనంతరం నెల రోజులకు దరఖాస్తు సమయంలో చెల్లించిన 10 శాతం మొత్తాన్ని వెనక్కిస్తారు.

ప్రభుత్వ భూముల్లో ఏర్పాటుకే తొలి ప్రాధాన్యం

అవసరం మేరకు ప్రైవేటు భూముల్ని తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ భూముల్లోనే టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఎంపీ విజయ‌సాయిరెడ్డి ట్విట్టర్‌లో తెలిపారు. జ‌గ‌నన్న స్మార్ట్ టౌన్‌షిప్ లేఅవుట్ల ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, కొన్ని లే‌అవుట్లు ఇప్పటికే సిద్ధం కాగా మ‌రికొన్ని సిద్ధమ‌వుతున్నాయ‌ని విజ‌య‌సాయి రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి నాటికి వీట‌న్నిటినీ అందుబాటులోకి తీసుకురావాల‌ని ప్రభుత్వం ప‌నులు వేగ‌వంతం చేసింద‌ని తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అన్ని వ‌సతుల‌తో జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్ షిప్ లేఅవుట్లు రూపుదిద్దుకుంటున్నాయ‌ని పేర్కొన్నారు.

– ఎంపీ విజయ సాయిరెడ్డి

ఐదు శాతం భూమి వదలాల్సిందే

వీటి నిర్మాణం కోసం అదనపు భూమికై ప్రభుత్వం ప్రైవేట్ లే‌ఔట్ల మీద పడింది. ఎవరు లే‌ఔట్ వేయాలన్నా 5 శాతం భూమిని ప్రభుత్వానికి వదలాలనే నిబంధన తెచ్చింది. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించడమో లేక ప్రైవేట్ భూములను కొనుగోలు చేసి ప్రజలకు టౌన్‌షిప్ నిర్మించి ఇవ్వడమో చెయ్యాలి గానీ ఇలా ప్రైవేటు లే‌ఔట్ యజమానుల నుంచి భూమిని తీసుకునే పద్ధతి సరికాదని చెబుతున్నాయి.

మరో హ్యాపీ నెస్ట్ కాదుగా..

గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో తక్కువ ధరలకు ప్లాట్లు అంటూ అప్పటి టీడీపీ ప్రభుత్వం హంగామా చేసింది. ప్రజలు కూడా అప్పట్లో సీఆర్డీఏ ఎదుట ప్లాట్ల కోసం బారులు తీరారు. తీరా చూస్తే అవి ఏమయ్యాయో వాటి వివరాలు ఏంటో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెస్తున్న జగనన్న టౌన్ షిప్స్‌లో మాత్రం అలాంటి అవాంతరాలు జరగకుండా చూడాలని సామాన్య మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Tags:    

Similar News