దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొత్త అవతారం ఎత్తారు. ఇవాళ ప్రారంభమయ్యే ఐపీఎల్ 16వ సీజన్ ద్వారా బాలయ్య క్రికెట్ కామెంటేటర్‌గా పరిచయం కానున్నారు. నేడు ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌తో.. బాలయ్య స్టార్ స్పోర్ట్స్ కామెంట్రీ బృందంతో జత కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. తనదైన శైలిలో చమక్కులతో మిగతా కామెంటేటర్లను నవ్వించారు.
జై బాలయ్య అంటూ హోస్ట్ నందూ, ఇతర కామెంటేటర్లు ఆశిష్ రెడ్డి, కల్యాణ్ కృష్ణ తదితరులు బాలకృష్ణకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తాను స్కూల్ రోజుల్లో క్రికెట్ ఆడేవాడినని.. కాలేజీ రోజుల్లో తనకు అజహరుద్దీన్, కిరణ్ కుమార్ రెడ్డి (మాజీ సీఎం) వంటి మేటి క్రికెటర్లతో పరిచయం కలిగిందని వెల్లడించారు. తన ఓటు సన్ రైజర్స్‌కే అని బాలకృష్ణ స్పష్టం చేశారు.
ఇక అయితే బాలకృష్ణ సినీ డైలాగులు పలికేందుకు భువనేశ్వర్ కుమార్, అదిల్ రషీద్, హ్యారీ బ్రూక్, ఉమ్రాన్ మాలిక్ వంటి సన్ రైజర్స్ ఆటగాళ్ల ఆపసోపాలు పడ్డారు. వేణుగోపాల్ రావు తొడ కొట్టే ప్రయత్నం చేయగా.. బాలయ్య తనదైన శైలిలో స్పందించారు. మేం స్టేజిపై తొడ కొట్టీ కొట్టీ కమిలిపోయింది.. నువ్వు కొట్టొద్దులే, ఎందుకొచ్చిన బాధ అంటూ చమత్కరించారు.