ప్రజల ఆయువు పోతుంటే.. విదేశాలకు ప్రాణ వాయువు ఎగుమతులా..?
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రాణవాయువు (ఆక్సిజన్) కొరతతో దేశవ్యాప్తంగా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్ల బాధలు చెప్పలేనివి. మునుపెన్నడూ చూడని విధంగా దేశంలో రోజుకు 1500 కు మించి మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో కొద్దిరోజులుగా ఈ తరహా మరణాలు పెరుగుతున్న తరుణంలో ఆక్సిజన్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి టన్నుల కొద్దీ వాయువును ఆస్పత్రులకు తరలిస్తున్నా అదీ సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన […]
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రాణవాయువు (ఆక్సిజన్) కొరతతో దేశవ్యాప్తంగా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్ల బాధలు చెప్పలేనివి. మునుపెన్నడూ చూడని విధంగా దేశంలో రోజుకు 1500 కు మించి మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో కొద్దిరోజులుగా ఈ తరహా మరణాలు పెరుగుతున్న తరుణంలో ఆక్సిజన్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి టన్నుల కొద్దీ వాయువును ఆస్పత్రులకు తరలిస్తున్నా అదీ సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజల్లో ఆగ్రహావేశాలకు దారి తీస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ నుంచి జనవరి) భారత్ విదేశాలకు ఇబ్బడిముబ్బడిగా ఆక్సిజన్‌ను ఎగుమతి చేసింది. ఇక్కడ సెకండ్ వేవ్ ఉధృతి ఉంటుందని పలు కేంద్ర సంస్థలు ముందే హెచ్చరించినా.. ప్రపంచ దేశాల్లో ఆక్సిజన్ అందక లక్షలాది మంది ప్రాణాలు పోతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం వాటిని పరిగణనలోకి తీసుకోలేదనే అనుమానం కలుగుతున్నది. ఫస్ట్ వేవ్ పీక్స్ లో ఉండగానే.. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో విదేశాలకు ఎగుమతి చేసే ఆక్సిజన్ రెట్టింపు శాతాని (డబుల్) కి పెరిగాయని అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి.
ఎగుమతులు ఇలా..
2020 ఏప్రిల్ నుంచి 2021 జనవరి (మూడు త్రైమాసికాలు) దాకా ఇండియా 9 వేల మెట్రిక్ టన్నుల (9,294 ఎంటీ) ఆక్సిజన్ ఎగుమతి చేసింది. అంతకుముందు ఇది 4,502 మెట్రిక్ టన్నులే ఉండటం గమనార్హం. ఎగుమతి అయింది లిక్విడ్ ఆక్సిజన్ కావడంతో పారిశ్రామికంగానే గాక వైద్య రంగంలోనూ వాడుకుంటారు. కాగా.. గతేడాది చివరి త్రైమాసికంలో, అంటే ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మధ్య చేసిన ఆక్సిజన్ ఎగుమతులకు సంబంధించిన గణాంకాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. భారత్ నుంచి అత్యధికంగా ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్న మన పొరుగు దేశం బంగ్లాదేశ్.. ఈ ఏడాది 8,800 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువును ఆ దేశం ఇంపోర్ట్ చేసుకుంది. ఆ తర్వాతి జాబితాలో నేపాల్, భూటాన్ ఉన్నాయి. ప్రపంచంలో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్న పెద్ద దేశాలలో ఒకటిగా ఉన్న భారత్ లో ప్రస్తుతం ప్రాణ వాయువు కొరతను ఎదుర్కోవడం ఆందోళనకు గురి చేస్తున్నది. ఇదే విషయమై బుధవారం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని ఆమె విమర్శించారు. మంగళవారం ఢిల్లీలోని పలు ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరత ఉందని, ఉన్న నిల్వలు నాలుగు గంటలకు మించి రావని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించిన విషయం తెలిసిందే.