‘బలగాల ఉపసంహరణ అంటే లొంగిపోవడమే’
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు నుంచి బలగాల ఉపసంహరణ చేపట్టడమంటే ఆయా ప్రాంతాలను శత్రుదేశానికి సరెండర్ చేయడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. గాల్వన్ లోయ, ప్యాంగాంగ్ సరస్సుల నుంచి బలగాలను ఉపసంహరించడం, బఫర్ జోన్ ఏర్పాటు చేయడమంటే ఆ ప్రాంతాలపై భారత హక్కులను చైనాకు సరెండర్ చేయడమేనని తెలిపారు. చైనా నుంచి సరిహద్దులో ముప్పు, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద సమస్య ముంచుకొస్తున్న తరుణంలో రక్షణశాఖకు బడ్జెట్ కేటాయింపులు […]
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు నుంచి బలగాల ఉపసంహరణ చేపట్టడమంటే ఆయా ప్రాంతాలను శత్రుదేశానికి సరెండర్ చేయడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. గాల్వన్ లోయ, ప్యాంగాంగ్ సరస్సుల నుంచి బలగాలను ఉపసంహరించడం, బఫర్ జోన్ ఏర్పాటు చేయడమంటే ఆ ప్రాంతాలపై భారత హక్కులను చైనాకు సరెండర్ చేయడమేనని తెలిపారు. చైనా నుంచి సరిహద్దులో ముప్పు, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద సమస్య ముంచుకొస్తున్న తరుణంలో రక్షణశాఖకు బడ్జెట్ కేటాయింపులు పెంచకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. సరిహద్దు నుంచి బలగాల ఉపసంహరణ నేపథ్యంలో భారత్ తన భూభాగాన్ని ఎంతమాత్రం చైనాకు విడిచిపెట్టలేదని కేంద్ర రక్షణ మంత్రి పార్లమెంటులో శుక్రవారం ప్రకటించడం గమనార్హం.
ఉపసంహరణతో సరిహద్దులో ఉద్రికత్తతలు తగ్గుతాయని, కానీ, దేశ భద్రతను ఫణంగా పెట్టి చేపట్టరాదని కేంద్రంపై ఏకే ఆంటోని విమర్శలు ఎక్కుపెట్టారు. సాంప్రదాయంగా భారత నియంత్రణలో ఉన్న ప్యాంగాంగ్ సో సరస్సు, గాల్వన్ లోయ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించి వాటిని చైనాకు అప్పజెప్పినట్టే చేసిందని ఆరోపించారు. ప్రస్తుతకాలంలో ఉపసంహరణ, బఫర్ జోన్ ఏర్పాట్లంటే సదరు ప్రాంతాలపై హక్కులను వదులుకోవడమేనని వివరించారు. వీటి ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదని చెప్పారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్రం దేశంలోని అన్ని రాజకీయపార్టీల నేతలతో చర్చించాలని సూచించారు. చైనాతో పంచుకుంటున్న సరిహద్దులో యథాతథ స్థితి ఎప్పుడు పునరుద్ధరించబడుతుందని, ఇందుకోసం ప్రభుత్వం అనుసరించే వ్యూహమేంటో వివరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.