పశుగణాభివృద్ధికి కృషి.. గ్రామాల్లో వెటర్నరీ డాక్టర్ పాఠాలు
దిశ, ఫీచర్స్ : ఒడిశాకు చెందిన వెటర్నరీ డాక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ బలరామ్ సాహుకు వ్యవసాయం, పశు సంపదపై ఆసక్తి ఎక్కువ. దీంతో గ్రామీణుల సంప్రదాయ జ్ఞానం, ఆవిష్కరణల గురించి తెలుసుకుంటూ.. ఆయా అంశాలన్నింటినీ డాక్యుమెంట్ చేయడం మొదలుపెట్టాడు. ప్రధానంగా వ్యవసాయం, పశువుల పెంపకం, స్థానిక మత్స్య సంపదపైనే తన డాక్యుమెంటేషన్ రూపొందించాడు. ఇదే క్రమంలో పశువుల్లో తలెత్తే వ్యాధుల చికిత్సకు సంబంధించిన పరిష్కారాలు అందించేందుకు ‘పథే పాఠశాల’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధునిక వ్యవసాయంలో రసాయనాల […]
దిశ, ఫీచర్స్ : ఒడిశాకు చెందిన వెటర్నరీ డాక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ బలరామ్ సాహుకు వ్యవసాయం, పశు సంపదపై ఆసక్తి ఎక్కువ. దీంతో గ్రామీణుల సంప్రదాయ జ్ఞానం, ఆవిష్కరణల గురించి తెలుసుకుంటూ.. ఆయా అంశాలన్నింటినీ డాక్యుమెంట్ చేయడం మొదలుపెట్టాడు. ప్రధానంగా వ్యవసాయం, పశువుల పెంపకం, స్థానిక మత్స్య సంపదపైనే తన డాక్యుమెంటేషన్ రూపొందించాడు. ఇదే క్రమంలో పశువుల్లో తలెత్తే వ్యాధుల చికిత్సకు సంబంధించిన పరిష్కారాలు అందించేందుకు ‘పథే పాఠశాల’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆధునిక వ్యవసాయంలో రసాయనాల వినియోగం ఊహించనంతగా పెరిగిపోగా.. ఒకప్పుడు మాత్రం రైతులు అందుబాటులో ఉన్న సహజ వనరులతో సాగుచేసిన విషయం తెలిసిందే. అయితే యుగయుగాలుగా సంప్రదాయ పద్ధతులు మంచి ఫలితాలను ఇచ్చాయని సాహు తన జర్నీలో తెలుసుకున్నాడు. ఈ మేరకు 2008లో వ్యవసాయం, పశువుల పెంపకానికి సంబంధించిన వివిధ ప్రత్యామ్నాయాలపై రాష్ట్ర ప్రభుత్వాధికారులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పాటు రైతులకు ఆయన శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే పట్టణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న తన ట్రైనింగ్ క్లాసులకు హాజరయ్యే వారిలో మహిళల సంఖ్య తక్కువగా ఉందని గ్రహించిన సాహు.. గ్రామాల్లో వారి వద్దకే వెళ్లి బోధించాలని నిశ్చయించుకున్నాడు.
పశువులకు సంక్రమించే 50 వ్యాధులకు ఇంటి వైద్యమే..
ఈ మేరకు గ్రామీణులు, మహిళలతో ఇంటరాక్ట్ అయ్యేందుకు వారితో స్థానిక భాషలో మాట్లాడటం ప్రారంభించాడు. ఒడిషాలోని ఏదైనా గ్రామానికి వెళ్తే ఒడియాలో, జార్ఖండ్ గ్రామాల్లో హిందీ, అలాగే పశ్చిమ బెంగాల్ గ్రామీణులతో బెంగాలీలో మాట్లాడేవాడు. ఈ క్రమంలోనే ఆవులు, గేదెలు, మేకలకు సంక్రమించే దాదాపు 50 వ్యాధులకు సొంతంగా ఇంటి వైద్యంతో నయం చేసేలా వారికి ట్రైనింగ్ అందించారు. ఈ క్రమంలోనే ‘టూ వే లెర్నింగ్’ ద్వారా వారి నుంచి సాంప్రదాయ పద్ధతులను నేర్చుకునేవాడు. వేసవిలో గుడ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అయితే ఆవ నూనె వాటిపై రాస్తే నెలరోజులైనా పాడవవని తెలుసుకున్న బలరామ్ ఆ విషయాన్ని ఇతరులకు చెప్పేవాడు. అలాగే టమోటాలను బొగ్గులో ఉంచితే, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని తెలుసుకున్నాడు.
జాతీయ అవార్డుతో సత్కరించిన ప్రభుత్వం..
2008లో ట్రైనింగ్ క్లాసులు స్టార్ట్ చేసిన డాక్టర్ బలరామ్ సాహు.. దీనికి ‘పథే పాఠశాల లేదా మూవింగ్ క్లాసెస్/ రోడ్‌సైడ్ క్లాసెస్’ అని పేరు పెట్టారు. ఈ పన్నెండేళ్లలో 1,061 తరగతులు నిర్వహించగా.. లక్షకు పైగా ప్రజల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేశాడు. కొవిడ్ కారణంగా గ్రామాలకు వెళ్లలేకపోవడంతో ఒడిషా, హర్యానా, పంజాబ్, గుజరాత్‌లోని గ్రామీణులకు ఆన్‌లైన్ సెషన్స్ నిర్వహించాడు. మెరుగైన సాగు విధానాలు, పశుగణాభివృద్ధికి సాయపడే ఎన్నో కొత్త పద్ధతులను వివరిస్తున్న సాహు.. రేడియోలోనూ ‘పథే పాఠశాల’ను నిర్వహిస్తున్నాడు. ఆయన అసాధారణ కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2011లో జాతీయ అవార్డుతో సత్కరించింది.